నిర్భయ గీతానికి శత అక్షరమాలలు – “నివేదన” పుస్తకంపై సమీక్ష

ఒక పరభాష కవితకు వంద అనువాదాలు రావడం అరుదైన విషయం . అలల మాదిరిగా తేలియాడే శైలి , సొగసైన పదాల అల్లిక , వడివడిగా సాగే నడక ఉంటే తప్ప అన్ని అనువాదాలు రావు .అలాంటి కవితల్లో –

విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగోర్ రాసిన “కొరొ జాగోరితో”  (వేర్ ద మైండ్ ఈజ్ విత్అవుట్ ఫీయర్ …) ఒకటి .

దీనిని తెలుగులో 95 మంది కవులు 100 సార్లు అనువాదం చేశారు . 1913 లో ఈ కవితను ‘గీతాంజలి’ పేరిట ఆదిపూడి సోమనాధరావు తొలిసారి అనువాదం చేశారు . ఆ తరువాత చలం, బాలాంత్రపు రజనీకాంతరావు, రాయప్రోలు సుబ్బారావు, కె.వి.రమణారెడ్డి , తిరుమల రామచంద్ర , అచంట జానకీరామ్ , చర్ల గణపతి శాస్త్రి , ధాశరధీ , కొంగర జగ్గయ్య – ఇలా లబ్ద ప్రతిష్టులైన రచయితలు తమదైన శైలిలో దీనిని తెలుగు లోకి తీసుకువచ్చారు . ఈ గేయం హైస్కూలు పాఠ్యాంశంగా అందరికీ సుపరిచితమైనదే . అయిన దానిలోని సొబగును , స్ఫూర్తిని – ఈ కవులు తమదైన శైలిలో పాఠకులకు అందించడానికి ప్రయత్నించారు . ఈ కవితలన్నింటినీ సంస్కృతి సంస్థ – నివేదన పేరిట ఒక సంకలనంగా తీసుకువచ్చింది . భావం ఒకటే అయినా తమవైన పదాల ద్వారా కొత్త అందాన్ని అద్దటంలో ఈ కవుల ప్రజ్ఞ పాఠకులను అలరిస్తుంది . రవీంద్రుడి కవిత్వంపైనా , తెలుగు సాహిత్యం పైనా ఆసక్తి ఉన్నవారు తప్పనిసరిగా చదవాల్సిన పుస్తకమిది .

 

-సివిఎల్ఎన్ ,ఆదివారం ఆంధ్రజ్యోతి .

Andhrajyothy_15_06_2014_022_002

“నివేదనడిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది.  మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్‌ని అనుసరించండి.

నివేదన on kinige

 

NivedanaTagoreTeluguPoems600

Related Posts:

రమణ కవిత్వంలో తాత్వికస్వరం (జడి సమీక్ష)

తాత్వికపరమైన గాఢత వున్న కవిత్వం మరల మరల చదివిస్తుంది. కవిత్వం చదివిన తాలూకూ అనుభూతి హృదయాన్ని అంటిపెట్టుకుని వుంటుంది. లోలోపలి ప్రపంచాన్ని కుదుపు కదిపి కుదుపుతుంది. ఆలోచనాస్రవంతిలో మిళితమై వెన్నంటి వుంటుంది. ఈ తరహా కవిత్వం అరుదు. దానిని గుర్తుపట్టడం అంత సులువు కాదు. కవిత్వ పాఠకుడు ఓపెన్‌గా ఉండాలి. ముందస్తు అభిప్రాయాలకు తావు ఇవ్వకుండా వాచకంలోకి ప్రయాణించాలి. అలాంటప్పుడే ఈ అరుదైన కవిత్వం తాలూకు గాఢత మనసుని ఆవరిస్తుంది.

కవిత్వమూ, వచనమూ కాక, కేవలం వాగాడంబరంతో కూడుకున్న మాటలు కవిత్వం పేరుతో పుస్తకాలుగా పొగడబడుతున్న కాలాన కె.ఎస్.రమణ రాస్తున్న కవిత్వం వైపు చూపు సారించే పాఠకులకు ఉందా అనిపించింది. కానీ, పాఠకుల్ని శంకించలేము. నిజాయితీగా, నిర్మమకారంగా రమణ కవిత్వ పుస్తకం ‘జడి‘ని ఒక రాత్రి చేతిలోకి తీసుకుని చదివితే కవి సంవేదన, అభివ్యక్తి వైచిత్రి మెల్లమెల్లగా మానసిక ప్రపంచాన్ని అలముకుంటాయి. వడ్డెర చండీదాస్‌కి ప్రేమతో అంకితమిచ్చిన పుస్తకమిది.

జీవితానికీ, సమాజానికీ ఆవల ఉన్న కవిత్వం కాదు ఇది. మన లోపలితనాన్ని, ఆ లోపల వున్న శూన్యాన్ని మనకు గుర్తు చేసే ప్రయత్నం ఈ కవిత్వంలో వుంది. మార్కెట్ ముద్ర వేసిన బతుకు నమూనాలలో కూరుకుపోయి, అదే జీవితంగా భ్రమసే వారి డొల్లతనాన్ని తేటతెల్లం చేసే తీరు ఈ కవిత్వాన్ని సాంద్రతరం చేసింది. మార్కెట్ బీభత్సం మనుషుల్ని ఏం చేస్తుందో ఆవేశంతో కాక సంయమనంతో చెప్పడం, పదునుగా చెప్పడం రమణ కవిత్వంలో చూస్తాం.

కలలు చనిపోతున్న కఠోర వాస్తవాన్ని చెబుతారు. ఒంటరిగా మరణిస్తున్న ప్రేమికుల గురించి పలవరిస్తారు. రుచించడం మానేసిన జీవితాన్ని ఎలా జీవిస్తారని ప్రశ్నిస్తారు. మార్కెట్ మూసల్లో కుదించుకుపోతున్న మనుషుల గురించి బెంగపడతారు. అప్రయత్నంగా నవ్వడం మరచిపోయిన విషాదం ఎంతటి భయానకమైనదో గుర్తు చేస్తారు.

జీవితానికి సంబంధించిన నికార్సైన స్పృహ వుంది రమణలో. ‘దర్శనం’ అనే కవిత రమణకు ఉన్న ఎరుక ఎలాంటిదో చెప్పడానికి ఓ ఉదాహరణ.
“జీవన రాస రసకీలల్లో
నన్ను పోగొట్టుకున్న ప్రతీక్షణమూ
నీలో నన్ను పొంది ధ్వనించాను” అంటూనే అక్కడే ఆగిపోకుండా ఇంకా ఇలా అంటాడు:
“లేదు ప్రియా…
నువువ్ నీ పెదిమ వొంపులో
రొమ్ము బరువు నీడలో
మధుర తన్మయంగా
యెంత తృప్తినీ కల్గించనీ
లలితగాఢంగా
యెంత శాంతిని అందించనీ
మన ప్రేమ యెంత నిజమో
మన వొంటరితనం అంతే నిజం”.

ఇక్కడ చెబుతున్న ఒంటరితనం ఏకాకితనం కాదు. మనిషి అస్తిత్వానికి సంబంధించిన సంవేదనగా చూడాలి. “నువ్వు నేను ఒకటేనని” ఎవరెన్ని పలికినా ఎవరి అస్తిత్వం వారిదే. ఎవరి అనుభూతి వారిదే. ఎవరి కలలు వారివే. ఎవరి వొంటరితనం వారిదే. ‘వొంటరితనం’ అనే మాటని ప్రతికూలమైనదిగా చూడక్కర్లేదు. మానవ అస్తిత్వానికి సంబంధించిన స్పృహ ఇది. మానవ సంబంధాలు, సామాజిక సంబంధాలు సవ్యమైన దిశగా సాగడానికి ఈ రకమైన ఎరుక తోడ్పడుతుంది.

అందుకే రమణ పలవరిస్తున్న తాత్వికాంశాలు జీవన సంఘర్షణలకు, సామాజిక సంవేదనలకూ ఎడంగా ఉన్నవి కావు. నిజానికి వాటి పట్ల మరింత స్పష్టత, సంలీనత వున్న కవి రమణ. మనిషి జీవనసారాంశాన్ని ఉన్నతీకరించే ప్రయత్నం రమణ కవిత్వంలో కనిపిస్తుంది. ‘మెరవణి’, ‘మన్నెపుబాట’, ‘మొదటి నుంచీ….’ ‘సంఘం శరణం గచ్ఛామి’, ‘అద్దంలో రెండు’, ‘నిరసన’, ‘వీలునామా’, ‘వొక నల్లటి ప్రేమగీతం’, …. మొదలైన కవితలు చదివితే రమణ కవిత్వంలోని వస్తువిస్తృతి, శైలీ వైవిధ్యం బోధపడతాయి.

ఆవేశకావేశాల వ్యక్తీకరణనే కవిత్వం అనుకుంటే పొరపాటు. అభివ్యక్తిలో సంయమనం, నింపాదితనం, కచ్చితత్వం మిళితమై వున్నప్పుడు ఆ కవిత్వం పాఠకుడ్ని కదిలిస్తుంది. ఈ స్పృహ వున్నందునే తన ఉద్వేగాల్ని వాచ్యం చేయలేదు. పదాలకు సొగసులద్దారు. వాక్యాలకు జీవశక్తిని ఇచ్చారు. సున్నితమైన స్పందనల్ని మృదువుగా చెబితే ఉండే అందం ఏమిటో తెలిసిన కవి రమణ. ఈ సౌందర్యాన్ని ఆస్వాదించే గ్రహణశక్తి, అభిరుచి వున్నవారికి రమణ కవిత్వం తాదాత్మ్యానికి లోను చేస్తుంది. అందుకే రమణ కవిత్వాన్ని చదవాలి.

కిరణ్‌‌కుమార్
పాలపిట్ట జులై 2012 సంచిక

* * *

“జడి” డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్‌ని అనుసరించండి.
జడి On Kinige

Related Posts:

చీకటి వెలుగుల ప్రతిబింబం (“లైఫ్ ఎట్ చార్మినార్” పై సమీక్ష)

సాహిత్య ప్రస్థానం పత్రిక మే 2012 సంచికలో “నచ్చిన పుస్తకం” అనే శీర్షిక క్రింద “చీకటి వెలుగుల ప్రతిబింబం” అనే పేరుతో శ్రీ వొరప్రసాద్ గారు అయినంపూడి శ్రీలక్ష్మి రాసిన “లైఫ్ ఎట్ చార్మినార్” అనే కవితా సంకలనాన్ని సమీక్షించారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో పనిచేస్తున్నశ్రీమతి అయినంపూడి శ్రీలక్ష్మి గతంలో ‘అలల వాన‘ కవితా సంపుటి వెలువరించారు. తాజాగా విశేషరీతిలో ‘లైఫ్ ఎట్ చార్మినార్‘ డాక్యూ పోయెమ్ అనే సుదీర్ఘ కవితతో పాఠకుల ముందుకు వచ్చారు.

అర్థవంతంగానూ, పొందికగానూ కూర్చిన కవిత్వం పాఠకులను అలరిస్తుందని. చిక్కటి కవిత్వానికి విలక్షణమైన కవితా వస్తువు మరింత వన్నె తెస్తుందని వొరప్రసాద్ పేర్కొన్నారు. హైదరాబాద్ అనగానే గుర్తుకు వచ్చే ‘చార్మినార్’ ఈ దీర్ఘ కవితా వస్తువు అని చెబుతూ, చార్మినార్ విలక్షణత, విశిష్టత ఈ కవితలో చక్కగా ప్రతిబింబించిందని ఆయన అన్నారు.

చారిత్రక కట్టడం ప్రాధాన్యత, మత సామరస్యం, అక్కడి ప్రజల జీవనోపాధి, మక్కామసీదు, పావురాలు వంటి వన్నీ ఈ దీర్ఘకవితా ప్రయాణంలో పాఠకుడిని విభిన్నంగా పలకరిస్తాయని, చదువరులు ఆశ్చర్యపడేలా చార్మినార్ పరిసరాలను కొత్త కోణాలలో కవయిత్రి ఆవిష్కరించారని ఆయన అభిప్రాయపడ్డారు. కవితలకు తగ్గ అందమైన భావచిత్రాలు పాఠకుడికి గిలిగింతలు పెడతాయని అన్నారు.

‘చార్మినార్ -/నాకు విచ్చుకున్న దోసిలిలా అనిపిస్తుంది /దేవుణ్ణి-/ ఏ కోరిక కోసమో అర్థిస్తున్న భక్తునిలా అనిపిస్తుంది’ శూన్యాకాశంలోకి నిట్టనిలువుగా పైకిలేచిన చార్మినార్ గోపురాలను చేతులుగా మలిచి కవిత్వ శిల్పం చేస్తారు. చార్మినార్ పక్కనే ఆనుకుని ఉండే మక్కామసీదులో వేలాది భక్తులు నిత్యం చేసే నమాజు దృశ్యాన్ని ఈ వాక్యాలు ఆవిష్కరిస్తాయి. నాలుగు శిఖరాల చార్మినార్ నాలుగు రోడ్లుగా విస్తరిస్తూ మనుషుల్లో మానవత్వం నింపుతుందని కవితాత్మకంగా చెబుతారు. “నాలుగు దిక్కులా రోడ్లు వేసుకున్న చార్మినార్/ మనుషుల రక్తాల్లో/ ఏ సమున్నత మానవతావాదాన్నో/ ప్రవహింపజేస్తున్నట్టుగా అనిపిస్తుంది” అనడంలో మనుషుల్లో మానవత్వం ఒక నిరంతర ప్రవాహంగా కొనసాగాలనే భావనను బలంగా వ్యక్తీకరించే ప్రయత్నం కనపడుతుంది. భావ వ్యక్తీకరణకు శక్తివంతమైన పదాలను ఉపకరణంగా చేసుకోవడంలోకవయిత్రి ప్రతిభ వెల్లడవుతుంది. ఎటువంటి భావాన్నైనా తన వస్తువు పరిధి దాటకుండా సమర్థవంతంగా కవిత్వీకరించగలిగారు. ప్రతీ వాక్యంలో ఆర్థ్రత,కరుణ, మానవీయత అంతర్లీనంగా ప్రతిఫలిస్తాయని వొరప్రసాద్ అన్నారు.

‘నగరమంతటా/తెల్ల ముఖమల్ లా పరుచుకున్న చలి పవనం/చార్మినార్ కు/ వందల మీటర్ల దూరంలోనే “గాయబ్” అవుతుంది /’షాదాబ్’ బిర్యానీ సొగసైన పరిమళాలు /హైకోర్టు – గుల్జార్ హౌస్ వరకు/గాలిలో తేలివస్తాయి’ ఈ చరణాలు పాఠకుల మనసులను ఆహ్లాదపరుస్తాయని, చలిని తెల్లని మఖమల్ వస్త్రంతో పోల్చిన కవయిత్రి భావుకత అబ్బురపరుస్తుందని అంటారు సమీక్షకులు. బిర్యానీ పరిమళాలు మన నాసికను చేరుకుంటాయట.

ఈపుస్తకంలో అనేక చోట్ల కవయిత్రి భావాలు పాఠకుడిని ఆకట్టుకుంటాయి. “హరేక్ మాల్ బీస్’ అరుపులు /’దేనేకీ బాత్ బోలో భాయ్’ బుజ్జగింపులు అన్నీ కలిసి/ ఏ అజ్ఞాత సంగీతకారుడో కూర్చిన మనుష్య సంగీతాన్ని వినిపిస్తుంటాయి’ అంటారు. మనుషుల నిత్యజీవన సమరాన్ని చక్కటి కవితా చరణాలుగా మలుస్తారు.మనుష్య సంగీతం అనేది ప్రతీ మానవ హృదయాన్ని స్పందింపచేసే భావన. మనుషులు మనుషుల కోసం మానవీయంగా స్పందించినప్పుడు ఒక మంచి సమాజానికి ఆస్కారం ఉంటుంది. ఒక సమిష్టి భావన మనిషికి బలాన్నిస్తుంది.

‘జనం కళ్ళల్లోకి తొంగిచూస్తే చాలు…/ ఆకాశంలోని నక్షత్రాలన్నీ కూడబలుక్కొని/ చార్మినార్ పరిసరాల్లోకి / ఏ ఫ్లెయింగ్ సాసర్ లేకుండానే / దిగివచ్చినట్లనిపిస్తాయి’ అంటూ మనుషుల కళ్లను నక్షత్రాలతో పోల్చి కవయిత్రి మెప్పిస్తారని వొరప్రసాద్ అన్నారు. ప్రతీకాత్మకంగా, భావనాశక్తి ద్వారా అభివ్యక్తీకరిస్తూ దీర్ఘకవితను హాయిగా చదివేలా కవయిత్ర్రి రాసారని, పదబంధాలనిండా సామాజిక స్పృహ పరుచుకుని ఉంటుందని ఆయన అన్నారు. అక్షరాలన్నీ అంతర్లీనంగా సామాజిక సంగీతాన్ని వినిపిస్తాయని సమీక్షకులు అభిప్రాయపడ్డారు.

పూర్తి సమీక్ష సాహిత్య ప్రస్థానం మే 2012 సంచికలో లభ్యమవుతుంది.

ఇన్ని చక్కని కవితలున్న ఈ పుస్తకం డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్‌ను అనుసరించండి.

లైఫ్ @ చార్మినార్ On Kinige

Related Posts:

తెలుగు కవిత్వ లోకంలో ఓలలాడండి ….

ప్రతీ ఏడాది, ఆ సంవత్సరం ప్రచురితమైన కవితల్లోంచి అత్యుత్తమ కవితలని ఎంచుకుని ఒక సంకలనంగా ప్రచురిస్తున్నారు సాహితీమిత్రులు. కాలానుకనుగుణంగా కవితలను పరిణామాల్లో అంశాలకు ఆవిర్భావ వికాసాలకు ఇవి దర్పణాలు. సంపాదకులు పాపినేని, దర్భశయనం వారి ప్రమాణాల మేరకు కవితల్ని ఎన్నిక జేయడం జరుగుతుంది.

2007 నుండి 2011 వరకు వచ్చిన ఐదు కవితా సంకలనాలనూ మీరు ఇప్పుడు 25 శాతం తక్కువకు కొనుగోలు చెయ్యండి, తెలుగు కవితా లోకంలో ఓలలాడండి.

తెలుగు కవితా లోకంలో విహరించడానికి ఇప్పుడే http://kinige.com/koffer.php?id=40 దర్శించి Buy this Offer మీట నొక్కండి.

కవిత 2007 – 2011 … 25 శాతం తక్కువకు! On Kinige

Related Posts:

సాహిత్య చంద్రికలు (“రేపటి వర్తమానం” కవితా సంపుటి పరిచయం)

మనకు ఆధునిక కవులు చాలామంది ఉన్నారు. వందల సంఖ్యలో కవితలు ప్రచురితమవుతున్నాయి. వస్తు, శైలి, శిల్ప వైవిధ్యాలతో రచనలు వస్తున్నాయి. అయితే, వాటిలో కొన్ని బాగా ఆకట్టుకోగలుగుతున్నాయి. అందుకు కారణం వాటిలోని విశిష్టతే.
ఆకలి కవితలు, ఆక్రందన కవితలు, ఆహ్లాద కవితలుగానూ, నానీలు రెక్కలుగాను కవితలు విడిపోతున్నాయి. అలా జరుగుతున్నా మంచి కవితలే మనం చదవగలుగుతున్నాం.
కవిత్వాభినివేశం ఉన్నప్పుడు, భాషమీద పట్టు ఉన్నప్పుడు ఒక పరిణితి చెందిన ఛాయాచిత్రకారుదు తీసిన అరుదైన చిత్రాల వంటి గాఢమైన, హత్తుకోగల కవితలు రచించడం సాధ్యపడుతుంది.
కవిత్వానికి స్పందన, ప్రేరణలు మాత్రమే సరిపోవు. అనుభూతి, సానుభూతితో పాటు వాటిని యథాతథంగా అక్షరాలలోకి దించగల నైపుణ్యమూ ఉండాలి.
ప్రపంచమనే విశాల కాన్వాసు మీద, నిత్యమూ వాటికవే ఎన్నో వైవిధ్యాలతో సంఘటనల చిత్రాలు రూపుదిద్దుకుంటూ చెరిగిపోతూ ఉంటాయి. వాటిని చెరిగిపోకుండా పట్టుకోగలగాలి. పదిలంగా మనో మందిరంలో నిక్షిప్తం చేసుకోవాలి. అటుపైన ప్రసవ వేదనలాంటిది మొదలవుతుంది.
రచన కాగితం మీద ప్రసవించే వరకూ ఆ బాధ ఆగదు. అటు తర్వాత, అపురూపంగా అక్షరాలను తడిమి చూసుకుంటూ, చేర్పులూ మార్పులతో అక్షర శిల్పాన్ని అందంగా అద్భుతంగా కవి తీర్చిదిద్దుతాడు. సంగీత సరస్వతులు నడుస్తూ కూడా రాగారధనలు చేస్తుంటారు. సాహిత్య సరస్వతులు కూడా నడుస్తునే భావసంపదలని ఎంతో మురిపెంగా మోసుకు వెళ్తుంటారు. అక్షరారాధనలు చేస్తుంటారు. వారి అంతరంగమే ఒక భువన విజయ మందిరం.
ఒక కవికి ఇంతటి నేపధ్యం ఉంటుంది.
చంద్రుడు కేవలం ఒక గోళమయితే ఎలాంటి ఆకర్షణ ఉండదు. చంద్రుడు అక్కడే ఉండి, వెన్నెలని జగమంతా కురిపిస్తున్నప్పుడు, ప్రపంచం కృతజ్ఞతతో ఆ గోళాన్ని ఒక దేవతగా చూస్తుంది.
చంద్రుడు దిగిరాడు, చంద్రికల్ని తన దూతలుగా పంపుతాడు. కవి కూడా అంతే. అతని కవితా చంద్రికలే మనల్ని స్పృశిస్తాయి.
ఇంత ఉపోద్ఘాతం ఇస్తేగానీ అడిగోపుల సారస్వత స్వరూపం మనకి అవగతం కాదు. కొన్ని దశాబ్దాలుగా నాకు ఆయన మిత్రుడు. అయన తెల్లని కోకిల, కమ్మగా పాడే కోకిలకి దేవుడు నల్లరంగు ఇచ్చినా, సరస్వతీదేవి అడిగోపుల వ్యక్తిత్వానికి స్వచ్ఛతనిచ్చింది. అందుకే ఆయన తెల్లని కోకిల.
గొప్ప సాహిత్యకారులు గొప్ప వ్యక్తులు కూడా అయినప్పుడు వారు ఆదర్శమూర్తులవుతారు. అడిగోపుల నిండుకుండ. తొణకడు, బెణకడు. జీవితమంతా మానవత్వ వేదనలకే అంకితం చేసాడు. గొప్ప కథలు రాసినా, ఇంకా రాయగలిగినా, కవిత్వల్నే తన సాహిత్య సైంధవాలుగా ఎంచుకున్నాడు.
అందుకే మెట్టు మెట్టు ఎక్కుతు ఎంతో ఎత్తుకు ఎదిగాడు. ప్రస్తుత పుస్తకం పదిహేడవది.
ఇందుకో ఆయన ఏం చెప్పాడోనని చూస్తే, అసలేమీ చెప్పలేదా అనిపిస్తుంది. అడిగోపుల అరుదైన పదచిత్రాల కూర్పులో తనకి తానే సాటి.
‘అక్షరాలు దర్జీ ముందు గుడ్డముక్కలు
కలిపితే అందమైన వస్త్రమవుతుంది ‘- ఇది అడిగోపులకి వర్తించే వ్యక్తీకరణ
వీరి కవితల్లో ముక్తాయింపులు ముత్యాల్లా మెరుస్తుంటాయి.
‘ఫిడేలు గానం మనసు నింపుతుంది
కడుపునింపడం లేదు’ అనేది శ్లేషలో చెప్పబడింది.

‘రోజూవారీ కూలీల డొక్కలు శబ్దాలు చేస్తుంటాయి
పాలకై పసిబిడ్డల ఏడ్పులు చందమామని చుట్టుకుంటాయి – ‘

నీతిని మరచిన మనుషులు
అవినీతికి సహచరులు
మనిషిని కొలవడానికి
ఆస్తిని తూకం వేస్తున్నారు
ఆర్జితం నీతా అవినీతా
ప్రశ్నించడం మరుస్తున్నారు!

ముదిమిన సంప్రాప్తించిన చెక్కిలి ముడతలు
బతుకు పుస్తక పాఠాలు – లోహితాస్యులు పాములు కరచి చనిపోతారు
చంద్రమతులు బలిపీఠాలు ఎక్కుతారు
ప్రజాస్వామ్యం తుప్పుపట్టిందని
సప్తాశ్వుడికి కబురుపెట్టండి
ఇది సరికొత్త వేకువ
నిద్రించే వాళ్ళని నిద్రపోనీకండి –

ఇలాంటి మెరుపులు ప్రతీ కవితలోనూ కనిపిస్తాయి.
కొందరికి సాహిత్యం ఒక అభిరుచి, కొందరికి కాలక్షేపం. మరికొందరికి జీవిక. కానీ అడిగోపులకి సాహిత్యం ఒక తపస్సు.
అక్షరాల ఆణిముత్యాలతో ఆయన నిత్యమూ విరామ రహితంగా, మానవత్వ కేతనం పక్కన నింపాదిగా కూచుని రేపటి తరం కోసం వర్తమానాన్ని లిఖిస్తునే ఉంటాడు. అదే ఆయన ప్రత్యేకత. అందుకే ఆయన సుకవి.

కాటూరు రవీంద్ర త్రివిక్రమ్
(చినుకు మాస పత్రిక మే 2012 సంచిక నుంచి)

* * *

రేపటి వర్తమానం” డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్‌ని అనుసరించండి.

రేపటి వర్తమానం On Kinige

Related Posts:

జంటలు-1

డా. వెలిచాల కొండలరావు రచించిన ఈ పుస్తకం గాలీబు కవితలకు అనువాదం. మిర్జా గాలీబు ఉర్దూ భాషలో అత్యుత్తమ శ్రేణి కవిగా సుప్రసిద్ధుడు. అతని భాషా, భావాలు సున్నితమైనవి, సుకుమారమైనవి, సుతారమైనవి. అతని భాష తాత్త్విక భాష, అతని భావం దార్శనిక భావం.

గాలీబ్ కవితలలోని కొన్ని పంక్తుల సారాన్ని తెలుగువారికి సరళంగా, సులభంగా తెలుగులా అనిపించేట్లు, వినిపించేంట్లు అందించడం తన లక్ష్యమని కొండలరావుగారు పేర్కొన్నారు. ఈ తెలుగు కవితలు “Spirit of Poem”నే ప్రతిబించిస్తాయి తప్ప, “Letter of Poem”ను కాదు. ఈ చేతలకు కొండలరావు గారు జంటలు అని నామకరణం చేసారు.

ఈ పుస్తకంలోని కొన్ని కవితల సౌరభాన్ని ఆస్వాదిద్దాం.

* * *

మనమనుకుంటాం మనకు చాలా తెలుసని కాని
ఎంత తెలుసు మనకు తెలవవలసినదానిలో గాలిబ్!

బిందుబిందువైతే వ్యక్తి
సింధువైతే వ్యక్తిత్వం గాలిబ్!

దివ్వె వెలగాలంటే కావాలి కదా మరి తైలం
అలాగే మనం వెలగాలంటే చింతనాతైలం గాలిబ్!

ఎచటుంది అందం యొక్క అందం, అది నీ కనుచూపులోనే లేకపోతే?
ఎచటుంది దైవం యొక్క దైవత్వం అది ‘ప్రకృతి’ లోనే లేకపోతే గాలిబ్!

అన్ని మాటలు కావాలా వివేకం గురించి అంతగా చెప్పడానికి
రెండు మాటల్లో చెప్పరాదా, ‘నిరాడంబరత’,’నిజాయితీయని’ గాలిబ్!

ఉదారులమనేవారి డాంబికాలు చూడాలంటే
చూడు భిక్షకుల దుస్తులు వేసికొని గాలిబ్!

నేనెపుడెపుడు నా బాధల గురించి ఎవరికైనా చెబుదామనుకుంటానో
అపుడపుడు వారు నాకంటేముందు వారి చిట్టాలు విప్పుతారు గాలిబ్!

ఎప్పుడో అడుగంటాయి విలువలు,
ఇపుడు మిగిలినవి అభిప్రాయాలు మాత్రమే గాలిబ్!

మన విశ్వాసాలు మన శ్వాసల్లాంటివి
మనం వాటిని వదులుదామనుకున్నా అవి మనను వదలవు గాలిబ్!

ఏమిటో కాని ఈ తరంవారు అన్నిటినీ అమ్ముకోజూస్తారు
తుదకు వారిని కూడా వారు గాలిబ్!

మన కొరకే ప్రార్థించేది ప్రార్థనెలా ఔతుంది
ఔతుంది అభ్యర్థన గాలిబ్!

మనమిపుడు కన్నీళ్ళు కార్చే రోజుల్లో బ్రతకడం లేదు
“మొసలి కన్నీళ్ళు కార్చే” రోజుల్లో బ్రతుకుతున్నాం గాలిబ్!

పని పవిత్రంగా చేస్తే కూడా పూజే, ప్రార్థనే,
కాని మనమనుకుంటాం దేవుని పూజే పూజయని గాలిబ్!

దృష్టం నచ్చకపోతే మరొక దానిలోకి మార్చుకోవచ్చు దానిని కాని
అదృష్టాన్ని ఎలా మార్చగలం, కనబడని, వినబడని దానిని గాలిబ్!

* * *

దీనిలోని ప్రతీ జంటా ఆలోచనలు రేకెత్తిస్తుంది, మార్మికమైన అనుభూతిని కలిగిస్తుంది. ఎన్నో మంచి కవితలున్న ఈ పుస్తకం డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్‌ను అనుసరించండి.

జంటలు 1 On Kinige

కొల్లూరి సోమ శంకర్

Related Posts:

“మానస సరోవరం” పై డా. సి.నారాయణరెడ్డి అభిప్రాయం

“శ్రీ గజానన్ తామన్ గారికి,
నమస్కారం.
మీరు ఆప్యాయంగా పంపిన “మానస సరోవరం” అందింది.

మాత్రాచ్ఛందో భరితంగా గేయం రచించినా, వచన కవిత రాసినా మీ సృజనాత్మకత ప్రతి కవితలో అగుపిస్తున్నది.

మీ గేయరచనా పటిమకు”నేటి నా గీతం” అనే కవిత ప్రబల సాక్ష్యం. మీ కవితల్లో వస్తు వైవిధ్యం ఉంది. అభివ్యక్తి గాఢత్వం ఉంది. చాలా సంతోషం.

అక్కడక్కడ కొన్ని వచనకవితలున్నా, మీ రచన వివిధ గేయగతుల్లో సాగింది. వైదికాంశాలను, పౌరాణికాంశాలను భూమికలుగా తీసుకొని మీరు చక్కని కవితలు రచించారు. కొన్ని కొన్ని కవితల్లో భావుకతతోపాటు, సామాజిక చేతన కూడా వుండడం ప్రశంసనీయం.

మీ
సి.నారాయణరెడ్డి

* * *

గజానన్ తామన్ రచించిన “మానస సరోవరం” డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. వివరాలకు ఈ క్రింది లింక్‌ను అనుసరించండి.

మానస సరోవరం On Kinige

Related Posts:

కైవల్యం” కవితాసంపుటిపై సమీక్ష

సుప్రసిద్ధ రచయిత్రి శ్రీవల్లీ రాధిక గారి కవితా సంకలనం “కైవల్యం“పై కౌముది అంతర్జాల మాసపత్రిక, ఫిబ్రవరి 2012లో సమీక్ష ప్రచురితమైంది.

అర్ధవంతమైన కవితలు, అర్ధమయ్యే కవితలు, ఆలోచించి వ్రాసిన కవితలు, ఆలోచింపజేసే కవితలు…వ్రాసే అతికొద్ది మంది ఆధునిక కవయిత్రులలో రాధికగారు ఒకరని సమీక్షకులు అభిప్రాయం వ్యక్తం చేసారు. ఈ సంకలనంలోని కవితల్లో చాలా భాగం వాస్తవ చిత్రణతో మొదలై ఆధ్యాత్మిక భావనలను అల్లుకుని ఒక చక్కని ముగింపుతో పూర్తవుతుందని; ఏ కవితా అలవోకగా చదివి మరిచిపోయేది కాదని సమీక్షకులు పేర్కొన్నారు. పుస్తకానికి ముందుమాట వ్రాసిన అద్దేపల్లి రామ్మోహనరావుగారి మాటలు, చివరి అట్టపై ఆశీస్సులందించిన సామవేదం షణ్ముఖశర్మగారి మాటలు అక్షరసత్యాలని సమీక్షలులు పేర్కొన్నారు.

పూర్తి సమీక్షకై ఈ లింక్‍ నొక్కండి

కైవల్యం కవితాసంపుటి డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. వివరాలకు ఈ క్రింది లింక్‍ని అనుసరించండి.

కైవల్యం On Kinige

కొల్లూరి సోమ శంకర్

Related Posts:

మిశ్రమ భావోద్వేగాల సమాహారం

కరువు కురిసిన మేఘం” వై. హెచ్. కె. మోహన్‌రావు గారు రాసిన కవితా సంకలనం. ఇందులో 37 కవితలున్నాయి.

“విభిన్నమైన అంశాలపై కవితలున్నా, వాటిల్లో అంతర్లీనంగా ఉన్న వేదనంతా, మనిషి మనిషి కాకుండా పోతున్నాడనే” అని అంటారు శ్రీ శివారెడ్డి ఈ పుస్తకానికి రాసిన ముందుమాటలో.

మోహన్‌రావు గారు తన గురించి చెబుతూ, తనది “క్రింద పడిపోయినవాడి పక్షాన నిలిచే తత్వమని” అన్నారు. తెలుసుకోవాలనే తపన, సాహిత్య పఠనం తనని కవిత్వం రాసే దిశకు నడిపించాయని చెప్పారు.

ఈ సంకలనంలోని ఎక్కువ కవితల్లో రైతుల కడగండ్లను గురించి వర్ణించారు. వాటిల్లో కొన్ని “కరువు కురిసిన మేఘం”, “స్వేదం సహనం వీడక ముందే”, “హాలా’హలధరు’డై”, “పల్లె మేల్కొంటునట్లు…..” “సుంకురాలిన కంకి”.

కరువుకురిసిన మేఘం” కవితలో, “చల్లగా వర్షించే మేఘం నలుపు/మృత్యు సంకేతమని/అది కరువును కురిసిన తరువాత తెలిసింది” అని అంటారు. “పంట పొలాల్లో/పైరుకు జీవంపోసే నది/చుక్క జారకుండా/ప్రాణాలు తీయడం కూడా /నేర్చిందని తెలిసింది” అని రైతుల వ్యధని వ్యక్తం చేసారు.

స్వేదం సహనం వీడక ముందే” అనే కవితలో, కాడిజారిన సేద్యం గురించి బాధ పడుతూ, “అదేమిటో ఎంత వెదికినా/మేఘంలో చిరునామా దొరకని వాన చినుకు/కంటిలో కన్నీరై కనిపించింది/పాతాళం దాకా ఆనవాలు చిక్కని నీటిచుక్క అడ్రస్సూ/అక్కడే దొరికింది” ఎంత ఆర్ద్రత! మనసు చెమ్మగిల్లించే పదాలు ఇవి.

హాలా’హలధరు’డై” అనే కవితలో – సకాలంలో వర్షాలు కురవక రైతులు ఎదుర్కునే ఇబ్బందులను ప్రస్తావిస్తారు, “చినుకు కోసం ఎదురుచూసే ఆ కళ్లు/చేను దు:ఖానికి చెమరిస్తాయి/వర్షించని మేఘాన్ని చూసి కన్నీళ్లు కురుస్తాయి” అని అంటారు. అదే వరదలొచ్చి రైతులు నష్టపోతే, ” పుట్లెన్ని పండించినా ఉట్టిమీదకు పెడ్డరాదు” అని అంటారు.

సుంకురాలిన కంకి” అనే కవితలో “నాగలి తప్ప నాగరికం తెలియని తల్లి/కరువురాగం శృతి చేసుకుంది !” అని చెబుతూ, “గుండె పగిలిన పత్తి/రైతు బ్రతుకును వత్తినిచేస్తే/తలగుడ్డ ‘పాశమై’ వెక్కిరించింది” అంటూ బాధ పడతారు. ఏం చేస్తే సంక్రాంతి పండుగ రైతుల్లో ఉత్సాహం నింపుతుందో ఈ కవితలో చెబుతారు కవి.

పల్లె మేల్కొంటునట్లు…..” అనే కవితలో కష్టాలు పడుతున్న రైతులు చైతన్యవంతులై పట్టణ వీధుల్లో నకిలీమందుల్ని, అందిరాని ధరల్ని నిలదీయాలని చెబుతారు.

ప్రపంచీకరణ ముప్పు గురించి రాసిన కవితలు – “ఒక విధ్వంసానంతరం”, “మనీ+మనీ=మనిషి”, “విషాదాంతం”.

ఒక విధ్వంసానంతరం” అనే కవితలో ప్రపంచీకరణ కొండచిలువలా మింగేసిన తర్వాత, “బ్రతుక్కీ చావుకీ తేడా తెలియని అవాంఛిత స్థితులే గాని/నాలుగు నవ్వులు పూచే ముఖాలేవి ?” అని ప్రశ్నిస్తారు. “ఎక్కడ చూసినా కరెన్సీ కట్టల అభ్యంగనాలే తప్ప/కాస్త ఊరటనిచ్చే ఆలింగనాలే కరువయ్యాయి” అని వాపోతారు.

మనీ+మనీ=మనిషి” అనే కవితలో అంతరించిపోతున్న మానవ సంబంధాల గురించి చెబుతూ, “ప్రపంచం దగ్గరౌతున్న కొద్దీ/మనిషి మార్కెట్‌సరుకులా మారుతున్నాడు/మనిషి కొనుగోలు వస్తువులా మారిన తరువాత/తాను వస్తువుతోనే జీవనం సాగిస్తున్నాడు”అని అంటారు. సున్నితత్వాన్ని కోల్పోడాన్ని చక్కగా వర్ణించారు కవి.

విషాదాంతం” అనే కవితలో ప్రపంచీకరణ గురించి చెబుతూ, “‘’గ్లోబ్’ అంతా కుగ్రామం కావడమంటే బ్రతుకును పాతాళానికి తొక్కడమేనా?” అని ప్రశ్నిస్తారు. “గ్లోబలైజేషన్‌దోపిడి పర్యాయం/పేద దేశాల కొల్లగొట్టే బహిర్‌మార్గం/ప్రపంచీకరణ పరదాస్యమే” అని అంటారు.

అమ్మ ప్రేమ గురించి, మాతృవాత్సల్యం గురించి రాసినవి – “కొంగు సాక్షిగా”, “మమకారానికి సాకారం”.

కొంగు సాక్షిగా” అనే కవిత అమ్మకంటే సొమ్మే విలువని భావించే వారి గురించి రాసినది. ” అమ్మంటే రెండక్షరాల కూర్పు కాదు/కడుపుతీపిలో కారుణ్యం కలిస్తే అమ్మ” అంటూ అద్భుతమైన నిర్వచనం చెప్పారు.

మమకారానికి సాకారం” అనే కవిత అమ్మ గురించి గొప్పగా చెప్పిన మరో కవిత. “అమ్మకు భాష్యం అమ్మే / అమ్మను మించిన జన్మలేదు” అని అంటారు. పిల్లల కోసం తల్లి ఎంతగా ఆరాటపడుతుందో చెబుతూ “నా బ్రతుకుకోసం, ఆమెచేతులెపుడూ పనితో పోటీ పడేవి” అని అంటారు.

గాంధీజీ గురించి, గాంధీ తత్వాన్ని గురించి రాసినవి రెండు కవితలు – “మరో సిద్ధార్థుడు”, “రెక్కలు తెగిన భారతం”.

“సత్యానికి శరీరాన్ని తొడిగితే ఆయన/రూపమొస్తుంది/సత్యాగ్రహానికి అక్షర రూపమిస్తే/ఆయన పేరే ధ్వనిస్తుంది” అని అంటారు “మరో సిద్ధార్థుడు” అనే కవితలో. గాంధీజీని ఇంత చక్కగా వర్ణించిన కవిత మరోకటి లేదంటే అతిశయోక్తి కాదు.

జాతిని సమూలంగా మార్చడానికి గాంధీమార్గం అవసరమని చెబుతూ, “రాచపుండులా మారిన జాతి రుగ్మతకు/మరో శస్త్రచికిత్స జరగాలి” అని అంటూ, “గాంధీ మార్గం విశ్వ నాందీవాచకం కావాలి” అని కోరుకుంటారు “రెక్కలు తెగిన భారతం” అనే కవితలో.

కృష్ణా నదితో తనకున్న అనుబంధాన్ని వివరిస్తూ రాసిన కవితలు – “నదీరాగం”, “కృష్ణతరంగిణి”.

“రాగాలు తీయడం కోయిలకే కాదు/’కృష్ణ’మ్మకి కూడా తెలుసు” అంటారు కవి “నదీరాగం” అనే కవితలో. కృష్ణానది తన ప్రవాహదిశలో ఒక్కో చోట ఒక్కో రాగాన్ని పలికిస్తుందని అంటారు.

నదిలో నీటి ప్రవాహం బాగా ఉన్నప్పుడు పల్లెలెలా ఉండేవో వర్ణిస్తారు, “కృష్ణతరంగిణి” అనే కవితలో. నీటి ప్రవాహం తగ్గిపోతే, రైతుల గుండెలు వడబడుతున్నాయని అంటారు. కరువుని త్రోలగ గలగల సాగమని నదిని కోరుకుంటారు కవి.

ఘనీభవిస్తున్న నదులు” అనే కవితలో మతమౌఢ్యాన్ని నిరసిస్తారు.

తెలుగు భాష గురించి, “అమ్మంటే ఏమిటి మమ్మీ!” అనే కవితలో చక్కగా చెప్పారు.

పైర్లను కబళిస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారం గురించి “రియల్ రోగం” అనే కవితలో హృద్యంగా చెప్పారు.

వివిధ పత్రికల్లో ప్రచురితమై, బహుమతులు పొందిన కవితలివి. పాఠకులలో మిశ్రమ భావోద్వేగాలను కలిగించే కవితలివి. కవితావస్తువు సార్వజనీనమై, భాష సరళంగా ఉండడం వలన ఈ కవితలని ఆసాంతం హాయిగా చదువుకోవచ్చు.

ఈ పుస్తకం డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. వెల రూ.50/-. నెలకి రూ.30/- అద్దెతో కూడా చదువుకోవచ్చు.

కరువు కురిసిన మేఘం On Kinige

కొల్లూరి సోమ శంకర్

Related Posts:

కుండీలో మర్రిచెట్టు

విన్నకోట రవిశంకర్ రాసిన ఈ కవితాసంకలనంలో 29 కవితలున్నాయి. “మానవత్వపు సారాంశాలైన జీవితానుభవాలతో స్పందించే కవితలు ఈ పుస్తకం నిండా వున్నాయని, జీవితానుభవమూ, హృదయానుభూతీ – ఈ రెండు ధృవాల్నీ కలిపి కవిత్వ విద్యుచ్చక్తిని సృష్టించాడు కవీ, విద్యుత్ ఇంజనీరూ ఐన రవిశంకర్” అని ముందుమాటలో ఇస్మాయిల్ గారు చెప్పిన మాటలు ఎంతో నిజం అనిపిస్తుంది ఈ కవితలు చదివితే.

ఇందులోని కొన్ని కవితలను పరిచయం చేసుకుందాం.

హోళీ: వసంతోత్సవం పండుగ సందర్భంగా రంగులతో ఆడుకుంటూ తనలోని భేషజాలని వదిలించుకుని, మనిషి తనని తాను చేరుకోడాన్ని; ఆకులు రాల్చిన చెట్టు మళ్ళీ చిగురించి పూలు పూచడంతో పోల్చారు ఈ కవితలో.

ఉదయాలు: చిన్న చిన్న పదాలలో ఎంతో చక్కని భావల్ని నింపిన కవిత ఇది. ఆశనిరాశల మధ్య జరిగే దోబూచులాటని ఈ కవిత వర్ణిస్తుంది. కల అందమైన భ్రమ కాగా, జీవితం కఠినమైన వాస్తవం అని ఈ కవిత చెబుతుంది.

కుండీలో మర్రిచెట్టు: విశాలంగా, ఊడలు దాల్చి పెరిగే మర్రిచెట్టుని, కుండీలో పట్టేడట్టుగా బోన్సయ్‌గా మార్చేసారని బాధ పడుతూ, నిండైన దాని జీవితాన్ని ఎవరో అపహరించారని వాపోతారు కవి. మనిషి తన స్వార్థం కోసం ఏమైనా చేస్తాడని, అది ఎదుటివారికే ప్రయోజనకరమని వారిని నమ్మిస్తాడని అనే అర్థం గోచరిస్తుంది ఈ కవితలో.

స్త్రీ పాత్ర: తనున్నచోట తన చుట్టూ ఆర్ద్రత ప్రవేశపెడుతుంది స్త్రీ. మహిళలు లేని పరిసరాలని ఊహించడం కష్టం. “హఠాత్తుగా అసంగతంగా మారిన/అక్కడి వాతావరణానికి/ఆమె అర్థం కల్పిస్తుంది” ఎంతో లోతైన అర్థం ఉందీ కవితలో.

నిద్రానుభవం: రాత్రుళ్ళు నిద్ర పట్టకుండా బాధపడేవారికి, అతి తేలికగా నిద్ర పట్టేసే వాళ్ళకి మధ్య తేడాని ఈ కవిత చూపుతుంది. అతి తేలికైన పదాలతో అలవోకగా సాగిన కవిత ఇది.

రామప్ప సరస్సు: తమకి దూరమైన మిత్రుడి స్మృతిలో ఈ కవిత రాసారు రవిశంకర్. ఎంత అందమైన, క్రూరమైన సరస్సో అని బాధ పడతారు.

జ్ఞాపకం: తరచూ విస్మరించే సన్నిహితులను తలచుకుంటూ రాసిన కవిత ఇది. అమ్మని ఉద్దేశించి రాసినా, దీన్ని మనం విస్మరించే వ్యక్తులకు అన్వయించుకోవచ్చు. బంధాలను పునర్దర్శించేందుకు ఉపకరిస్తుంది ఈ కవిత.

ట్రాన్సిషన్: ఈ కవిత మానవ జీవితానికి అద్దం పడుతుంది. జీవితమంటేనే కొన్నింటిన్ పోగొట్టుకోడం, మరికొన్నింటిని పొందడం. కొన్ని బంధాలను తెంచుకోడం, కొన్నింటిని అల్లుకోడం. మనిషి జీవితమంటా ట్రాన్సిషన్ అని చెప్పడానికి ప్రయత్నిస్తుందీ కవిత.

గాయం: మానవత్వాన్ని మార్పిడి చేసి, అమర్చుకున్న అలసత్వానికి విరుగుడు లేదంటారు కవి. వైద్యవృత్తిలోని లోపాలను అంతర్లీనంగా ప్రశ్నిస్తుంది ఈ కవిత.

భోపాల్: యూనియన్ కార్బైడ్ ఫాక్టరీ ప్రమాదం ఈ కవితకి నేపధ్యం. తన బిడ్డని రక్షించుకోలేని ఓ తల్లి ఆవేదనని ఈ కవిత చిత్రించింది. ఇది చదివాక మనసు మొద్దుబారిపోతుంది.

శివకాశి: ఇతరుల జీవితాలలో పండగ వెలుగులు నింపేందుంకు, తమ బ్రతుకులని మసి చేసుకునే బాల కార్మికులపై రాసిన కవిత ఇది. ” అతని జీవితంలో/అల్లరిలేదు; ఆటల్లేవు;/తప్పటడుగుల్లేవు;/ తడబడే మాటల్లేవు/” చిన్న చిన్న పదాలలో అక్కడి దృశ్యాన్ని కళ్ళముందుంచారు కవి.

గ్లాస్‌నోస్త్: ఒక్కప్పటి సోవియట్ యూనియన్ సంస్కరణల గురించి రాసిన కవిత ఇది. రష్యా గురించి ప్రజలు ఊహించుకున్న ఘనతంతా నిజం కాదని కవి అంటారు.
“ఇప్పుడు తెర తీసేశారు/ ఇక యే దాపరికమూ లేదు! /ఈ రహస్యం/ ఇంత వికృతంగా ఉంటుందని/ నేననుకోలేదు./ నేనిన్నాళ్ళూ కొలిచిన వేలుపు/ అసలు రూపం ఇదని /నేనూహించను కూడా లేదు” అని అంటారు.

మోళీ: ఇళ్ళలో ఆడవాళ్లపై జరిగే గృహహింసని ప్రస్తావిస్తుంది ఈ కవిత. కాపురం మగాడికి మోళీ ఆటలాంటిదని, అది అద్భుతంగా సాగుతోందని జనాలని నమ్మించడానికి కుటుంబ హింసని ఆయుధంగా వాడుకుంటారని అంటారు కవి.

దూరం: ఈ కవిత స్నేహితుల మధ్య దూరాన్ని ప్రస్తావిస్తుంది. కాలక్రమంలో గాఢమైన స్నేహమైనా బీటలు వారుతుందని, స్నేహితులు పునఃపరిచయం చేసుకోవాల్సిరావచ్చని చెబుతుందీ కవిత. అయినా పాత జ్ఞాపకాలు వాడిపోవని అంటుంది.

చలనచిత్రం: అతి వేగంగా సాగిపోయే జీవితాన్ని కాప్చర్ చేయడం సాధ్యమేనా? జీవితపు కనిపించని ప్రవాహపు కదలికలో ఉన్న అందాన్ని, దేనితో కేప్చర్ చెయ్యమంటావని కవి ప్రశ్నిస్తారు.

ఇంకా ఎన్నో చక్కని కవితలున్న ఈ పుస్తకం డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. వెల రూ. 30/- మార్మికమైన అనుభూతులను ఆస్వాదించడానికి ఈ పుస్తకాన్ని సొంతం చేసుకోండి.

కుండీలో మర్రిచెట్టు On Kinige

కొల్లూరి సోమ శంకర్

Related Posts: