రాజా హైదరాబాదీ ”పాగల్‌ షాయర్‌”

ఇతను నిన్నమొన్నటి వరకు కవిగా ”ఆశారాజు”. ఇతని అసలు పేరు కూడ అదే. కలం పేరు వేరే లేదు కదాయని ఏదో కొంత కొరతగా భావించి ఈ మధ్య ”రాజా హైదరాబాదీ” యని కలంపేరు మార్చుకున్నాడు. ఇతని ”పాగల్‌ షాయర్‌” చదివితే ఇతను ఎన్నుకున్న కలం పేరు బాగా కుదిరిందని అనిపించింది నాకు. ఒక కవి యొక్క తుది మెట్టు తనను తాను మరచి పోవడమే, అతని కవితలో ”కవిత్వం”, అంటే ”రసం” తప్ప మరొకటి ఉండకపోవడం. అదే ఒకవిధంగా ”భక్తి స్థితి” కూడ. భక్తి స్థితికి రానిదే ఒక కవి ”రసస్థితి”కి రాలేడు. దానినే కదా మనం ”ఋష్యస్థితి” యని కూడ అంటుంటాం. ఈ స్థితిలో కవి ”హేతువు”ను దాటి వెళ్తాడు. కేవలం ప్రేమికుడు అవుతాడు. అతనికి ప్రేమ తప్ప మరేదీ కనిపించదు. ”విషయం”, ”వస్తువు” అతనికొక మిష, కవిత్వమొక ”నిషా”. అతికి ప్రేమే విషయం, ప్రేమే వస్తువు, ప్రేమే భక్తి. ఈ స్థితి ”పూర్ణ విలీన స్థితి”, హేతువును దాటిన ”విశ్వాస స్థితి”. ఈ స్థితిలో ఇక ప్రశ్నలు, జవాబులు ఉండవు. ఇది ”పూర్ణ జ్ఞానోదయ స్థితి”. ఇదే రసస్థితి కూడ. అలాంటి స్థితిలో ఒక కవి కవిత్వం రాయడు, కవిత్వమే అతనిని రాయిస్తుంది. ఇదే మన ”పాగల్‌ షాయర్‌” రచించిన ‘రాజా హైదరాబాదీ’ స్థితి.

దేశాన్ని అందరూ ప్రేమిస్తారు, వారు పుట్టిన మెట్టిన భూమిని, నేలను. కాని, ఆ ప్రేమను వ్యక్తీకరించంలో ఎంత తేడా! ప్రఖ్యాత కళాకారుడు ”పికాసో” అంటాడు ”నేను చూచిందే కళగా నిర్మిస్తాను”యని. కాని, ఆ చూడడంలో ఎంత తేడా ! ఆశారాజు హైదరాబాదును ఎంతో ప్రేమించాడు. ఎంత ప్రేమించాడో తెలియాలంటే అతని ”పాగల్‌ షాయర్‌” చదవండి మీకే తెలుస్తుంది. అసలు ఆశారాజు ఒక గొప్ప ప్రేమికుడు. దేనిని ప్రేమించినా అలాగే ప్రేమిస్తాడు, ఏది రాసినా అలాగే రాస్తాడు. అతను ప్రేమించకుండ రాయలేడు, ప్రేమ కొరకే రాస్తాడు కాని కేవలం విషయం కొరకు కాదు. అందుకే ఆతని కవిత ”అచ్చం కవిత” (pure poetry) అవుతుంది. వస్తువుంటుంది కాని, వస్తువును మించిన ప్రేముంటుంది, భక్తి ఉంటుంది, ప్రేమరసం, భక్తిరసముంటుంది. అతనికి సిద్ధాంతమంటూ ఏదైనా ఉంటే నా ఉద్దేశ్యంలో అది ప్రేమసిద్ధాంతమే, భక్తి సిద్ధాంతమే, మానవీయ సిద్ధాంతమే. ఈ మధ్య ”సెట్లర్స్‌” యను పదం ఒకటి వినిపిస్తోంది హైదరాబాదు నగరంలో పదే పదే. దానిని వేరు వేరు అర్థాల్లో వాడుతున్నారు వాడేవారు. ఆశారాజు ఒక సెట్లర్‌కు, ఒక అసలు వానికి ఉండే తేడా చూపిస్తారు అడుగడుగునా ”పాగల్‌ షాయర్‌”లో. నీవు ఒక కాందిశీకుని లాంటివాడివో, వలసవాది లాంటివాడివో, సెట్లర్‌ లాంటివాడివో లేక ఈ హైదరాబాద్‌లో నివసించే వారిలో నీవూ ఒక అసలు సిసలైన వాడివో తేల్చుకోవాలంటే ”పాగల్‌ షాయర్‌” చదివితే తెలుస్తుంది.

ఒక సెట్లర్‌ది కేవలం ఉద్యోగ పిచ్చే, వ్యాపార పిచ్చే, ఆస్తి పిచ్చే, ఆదాయపిచ్చే కాని, రాజా హైదరాబాదీ లాంటి మాతృపిచ్చి, పితృపిచ్చి, పుట్టిన మెట్టిన పిచ్చి కాదు, కానేరదు. అసలు సిసలైన వానిది మట్టి వాసన పిచ్చి. ఒకనాడు నోబుల్‌ ప్రైజ్‌ గ్రహీత ‘పర్ల్స్‌ ఎస్‌.బక్‌’ వ్రాసిన ‘గుడర్త్‌’లోని కర్షకుని పిచ్చి. అలాంటి వాడు ఆ భూమికి విలువ తప్ప ఖరీదు కట్టడు. అతను అతని నేలను అమ్ముకోవడం అతనిని అమ్ముకోవడం లాంటిదిగా భావిస్తాడు.
అతని నేలలో అతడు అతని అస్తిత్వాన్ని చూస్తాడు. అలాంటివాడు సెట్లర్‌ లాంటివాడు కాడు, ఈ గడ్డవాడౌతాడు, ఈ నగరం వాడౌతాడు, ఈ నేలవాడౌతాడు, ఇచటి అసలు సిసలయిన వాడవుతాడు. అలాంటివారు ఎవరైనా వారిని ఎవ్వరూ ‘సెట్లర్‌’గా, కాందిశీకునిగా, వలసవచ్చినవానిగా చూడరు. ఆశారాజు ”రాజా హైదరాబాదీ” అలాంటి అసలు సిసలైన వాడు.

డా. కొండలరావు వెల్చాల

(జయంతి త్రైమాసిక పత్రిక, జులై – సెప్టెంబరు 2010 సంచిక)

* * *

”పాగల్‌ షాయర్‌” కవితాసంకలనం డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్‌ని అనుసరించండి.

పాగల్ షాయర్ On Kinige

Related Posts:

నా అక్షరాలు వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలు.

నా కవిత్వం కాదొక తత్వం
మరికాదు మీరనే మనస్తత్వం
కాదు ధనికవాదం, సామ్యవాదం
కాదయ్యా అయోమయం, జరామయం.

గాజు కెరటాల వెన్నెల సముద్రాలూ
జాజిపువ్వుల అత్తరు దీపాలూ
మంత్ర లోకపు మణి స్తంభాలూ
నా కవితా చందనశాలా సుందర చిత్ర విచిత్రాలు.

అగాధ బాధా పాథః పతంగాలూ
ధర్మవీరుల కృత రక్తనాళాలూ
త్యాగశక్తి ప్రేమరక్తి శాంతిసూక్తి
నా కళా కరవాల ధగద్ధగ రవాలు

నా అక్షరాలు కన్నీటి జడులలో తడిసే దయాపారావతాలు
నా అక్షరాలు ప్రజాశక్తుల వహించే విజయఐరావతాలు
నా అక్షరాలు వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలు.

- బాల గంగాధర తిలక్

Now Amrutam kurisina ratri eBook is available from Kinige. Visit http://kinige.com/kbook.php?id=672 for more details.

Related Posts:

జలగీతిక

నీరు, జలము, పానీ, తన్నీర్, వాటర్ ఇలా ఏ పేరుతో వ్యహహరించిన నీరు మానవాళికి అమూల్యమైనది.

నీరు ఉచితంగా లభిస్తున్నా, దాన్ని విచక్షణా రహితంగా వినియోగిస్తుండడం, వృథా చేస్తుండడం వలన ఎన్నో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. భూమి మీద ఉన్న మొత్తం జలరాశిలో మనకు ఉపయోగపడుతున్నది అతి తక్కువ. అలా మనకి ఉపయోగపడే కొద్దిపాటి నీరు కూడ అన్ని ప్రాంతాల్లో సమంగా లభ్యం కావడం లేదు. లభించే కొద్దిపాటి మంచినీటిని కూడ మనము అవగాహన లేక దుర్వినియోగం చేస్తుంటాం. మరోప్రక్క పెరుగుతున్న జనాభా, తరుగుతున్న అడవులు, మారుతున్న వాతావరణ పరిస్థితులు ఈ జల సంపదను మరింత కుచించుకుపోయేలా చేస్తున్నాయి.

మానవ జీవితానికి త్రాగునీరు, సాగునీరు రెండూ ఎంత ముఖ్యమో, నీటిని, నీటి వనరులని సంరక్షించుకోడం మానవాళి మనుగడకి అంతే ముఖ్యం. భవిష్యత్తులో జరిగే యుద్ధాలన్నీ నీటి కోసమేనని నిపుణులు అభిప్రాయపడుతున్న విషయం తెలిసినదే.

కాబట్టి జల వినియోగంలో మార్పులు అవసరం. నీటి పొదుపు పాటించం, వృథాను అరికట్టం, భూగర్భజలాల్ని పెంచుకోవడం వంటి చర్యలు చేపట్టాలి. ఈ దిశగా ప్రజలని సమాయత్తం చేయడానికి కావలసిన ఎన్నో అంశాలు ఈ జలగీతిక అనే పుస్తకంలో ఉన్నాయి.

రచయిత ఎ. వరప్రసాదరావు గారు నీటికి సంబంధించిన అనేక అంశాలను సరళమైన భాషలో సులభశైలిలో ఆసక్తికరముగా రచించారు.

ఉదాహరణకి ఈ కవిత చూడండి:
“నీరు, నిప్పు, నింగి, నేల, గాలి / ప్రాణికి ప్రకృతి ఇచ్చిన ప్రసాదం/ అవి సంరక్షించు – నిన్ను రక్షించు/పలుకు తేనెలఊట ప్రసాదరావు మాట”

నీటిని సంరక్షించుకునే విధానాన్ని, ఏ విధంగా మనం నిత్యము స్నానపానాదులలో నీటిని వృధా చేస్తున్నామో సోదాహరణముగా వివరించి పొదుపు చేసే మార్గాలు కూడ తనే వివరించారు.
అదే విధంగా భూగర్భములో యింకుప్రాంతాల్లో నీరు యెట్లు లభిస్తుందో, నీటి యాజమాన్యములో శాస్త్రీయత లోపిస్తే ఏయే అనర్థాలు సంభవించే ప్రమాదం ఉంటుందో ఈ కవితల ద్వారా వివరించారు.

“నీటి నిర్వహణ గురించి రాసిన రాతలు / నీటియాజమాన్యం కొరకువేసిన బాటలు / అమలుచేయక అగునులే నీటిపై రాతలు /పలుకు తేనెలఊట ప్రసాదరావు మాట”

నీటి గురించి ఎంతో సమాచారం, ఎన్నో అదనపు వివరాలు ఉన్న ఈ పుస్తకం డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్‌ని అనుసరించండి.

జలగీతిక On Kinige

కొల్లూరి సోమ శంకర్

Related Posts:

నక్షత్ర దర్శనం

ప్రముఖ నటుడు, రచయిత తనికెళ్ళ భరణి రచించిన పుస్తకం – నక్షత్ర దర్శనం. ఇందులో పాత, కొత్త సినీతారల గురించి, వివిధ రంగాలలో లబ్దప్రతిష్టుల గురించి కవితలు రాసారు భరణి. తన జీవితంలో తనకు నచ్చిన వ్యక్తులను, తనపై ప్రభావం చూపిన వ్యక్తులను కవితాత్మకంగా తలచుకున్నారు భరణి ఈ పుస్తకంలో.

ఎన్టీయార్ గురించి రాస్తూ, “తనే ముందు లేచి, భాస్కరుడిని లేపుతాడు శశిని చూడకనే పడుకునే పసిమనస్సువాడు!” అని అంటూ ఎన్టీయార్ క్రమశిక్షణని ప్రస్తావించారు.

“ఆయన అనర్ఘళ వచోధార ధవళేశ్వరం దాటిన గోదర్లా ఆయన అసమాన నటనా వైదుష్యం హిందూ మహాసముద్రంలా” అంటూ ఎస్వీఆర్ గళాన్ని, నటనని ప్రశంసించారు.

మహానటి సావిత్రి గురించి చెబుతూ”త్రికాలాలకి అతీతమైన త్రివిక్రమ స్వరూపం నటరాజుకి స్త్రీ రూపం” అని అంటారు.

“నువ్వు భద్రకాళిలా కనిపించే భారతివి నువ్వు పులితోలు కప్పుకున్న గంగిగోవువి, నువ్వు ఆడ హీరోవి” అని భానుమతి గురించి చెబుతారు భరణి.

ప్రముఖ గాయని ఎం. ఎస్. సుబ్బులక్ష్మి గురించి రాస్తూ, “ఎమ్ ఎస్ అంటే మంగళ స్వరం, ఎమ్ ఎస్ అంటే మెస్మరిజం” అని రాయడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదనిపిస్తుంది.

విశ్వనాధ వారిని, శ్రీశ్రీని పోలూస్తూ, ఇద్దరు ఇద్దరేనని, ఇద్దరికీ రెండు చేతులు కలిపి పాదాభివందనం అంటారు భరణి. ఇద్దరివీ భిన్న దృక్పథాలైనా, సాహితీవేత్తలు ఇరువురినీ సమానంగా గౌరవించారు భరణి.

“ఆయన వాయులీనం వాయిస్తూ మైమరిచిపోతాడు, మనం వాయులీనంలో విలీనం అయిపోతాం” అంటారు ద్వారం వెంకటస్వామి నాయుడి గురించి రాస్తూ.

శ్రీరంగం శ్రీనివాసరావు శ్రీశ్రీ అయితే, గుడిపాటి వెంకటచలం స్త్రీస్త్రీ అంటారు భరణి చమత్కారంగా.

దాశరథి గురించి రాస్తూ ఆయన కలం లలితమైన గీతాలనే కాదు, నిప్పులను సైతం కురిపించగలదని అంటారు. దాశరథికి జ్ఞానపీఠ లభించనందుకు బాధపడతారు.

“శ్రమించిన కొద్దీ పైకొస్తారు, శ్రమించకపోతే పైకెళతారు” అంటూ అక్కినేని సినీరంగంలో కష్టపడి ఎదిగిన తీరుని వివరిస్తారు.

చిరంజీవి , బ్రహ్మానందం, రేఖ, చార్లీచాప్లిన్, గురుదత్, రేలంగి, అల్లు రామలింగయ్య, సూర్యకాంతం, రమణారెడ్డి, రాఘవేంద్రరావు, జంధ్యాల, ఘంటసాల , పి. సుశీల, జేసుదాసు, ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, ఇంకా ఎందరో సినీ ప్రముఖుల గురించి చిన్న చిన్న పదాలతో అందమైన కవితలు రాసారు.

భరణి ఈ పుస్తకంలో ఓ గమ్మత్తైన ప్రయోగం చేసారు. బాపూజీకి, బాపుకి మధ్య పోలికలు చూపారు.

ఇంకా మంగళంపల్లి బాలమురళీకృష్ణ, తబలా విద్వాంసుడు జాకీర్ హుస్సేన్, ఉస్తాద్ హరిప్రసాద్ చౌరాసియా, పండిట్ రవిశంకర్, వయొలిన్ విద్వాంసుడు కన్నకుడి వైద్యనాథన్ గురించి చక్కని కవితలు రాసి వారి వైదుష్యానికి నమస్సులు తెలిపారు.

దేవులపల్లి కృష్ణశాస్త్రి, శ్రీశ్రీ, ఆరుద్ర, వేటూరి సుందరరామ్మూర్తి, జాలాది, సినారె, పరుచూరి బ్రదర్స్ వంటి రచయితలపైన అద్భుతమైన కవితలు రాసారు.

ఆయా రంగాలలో తమ కృషితో విఖ్యాతులైన వీరందరి గురించి చదువుతుంటే వారి పట్ల గౌరవభావం కలిగి, ఏదైనా సాధించేందుకు ప్రేరణ లభిస్తుందనడంలో సందేహం లేదు.

నక్షత్ర దర్శనం కినిగెలో డిజిటల్ రూపంలో లభిస్తుంది. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్‌ని అనుసరించండి.

నక్షత్ర దర్శనమ్ On Kinige

కొల్లూరి సోమ శంకర్

Related Posts:

“మానస సరోవరం” పై డా. సి.నారాయణరెడ్డి అభిప్రాయం

“శ్రీ గజానన్ తామన్ గారికి,
నమస్కారం.
మీరు ఆప్యాయంగా పంపిన “మానస సరోవరం” అందింది.

మాత్రాచ్ఛందో భరితంగా గేయం రచించినా, వచన కవిత రాసినా మీ సృజనాత్మకత ప్రతి కవితలో అగుపిస్తున్నది.

మీ గేయరచనా పటిమకు”నేటి నా గీతం” అనే కవిత ప్రబల సాక్ష్యం. మీ కవితల్లో వస్తు వైవిధ్యం ఉంది. అభివ్యక్తి గాఢత్వం ఉంది. చాలా సంతోషం.

అక్కడక్కడ కొన్ని వచనకవితలున్నా, మీ రచన వివిధ గేయగతుల్లో సాగింది. వైదికాంశాలను, పౌరాణికాంశాలను భూమికలుగా తీసుకొని మీరు చక్కని కవితలు రచించారు. కొన్ని కొన్ని కవితల్లో భావుకతతోపాటు, సామాజిక చేతన కూడా వుండడం ప్రశంసనీయం.

మీ
సి.నారాయణరెడ్డి

* * *

గజానన్ తామన్ రచించిన “మానస సరోవరం” డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. వివరాలకు ఈ క్రింది లింక్‌ను అనుసరించండి.

మానస సరోవరం On Kinige

Related Posts:

కైవల్యం” కవితాసంపుటిపై సమీక్ష

సుప్రసిద్ధ రచయిత్రి శ్రీవల్లీ రాధిక గారి కవితా సంకలనం “కైవల్యం“పై కౌముది అంతర్జాల మాసపత్రిక, ఫిబ్రవరి 2012లో సమీక్ష ప్రచురితమైంది.

అర్ధవంతమైన కవితలు, అర్ధమయ్యే కవితలు, ఆలోచించి వ్రాసిన కవితలు, ఆలోచింపజేసే కవితలు…వ్రాసే అతికొద్ది మంది ఆధునిక కవయిత్రులలో రాధికగారు ఒకరని సమీక్షకులు అభిప్రాయం వ్యక్తం చేసారు. ఈ సంకలనంలోని కవితల్లో చాలా భాగం వాస్తవ చిత్రణతో మొదలై ఆధ్యాత్మిక భావనలను అల్లుకుని ఒక చక్కని ముగింపుతో పూర్తవుతుందని; ఏ కవితా అలవోకగా చదివి మరిచిపోయేది కాదని సమీక్షకులు పేర్కొన్నారు. పుస్తకానికి ముందుమాట వ్రాసిన అద్దేపల్లి రామ్మోహనరావుగారి మాటలు, చివరి అట్టపై ఆశీస్సులందించిన సామవేదం షణ్ముఖశర్మగారి మాటలు అక్షరసత్యాలని సమీక్షలులు పేర్కొన్నారు.

పూర్తి సమీక్షకై ఈ లింక్‍ నొక్కండి

కైవల్యం కవితాసంపుటి డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. వివరాలకు ఈ క్రింది లింక్‍ని అనుసరించండి.

కైవల్యం On Kinige

కొల్లూరి సోమ శంకర్

Related Posts:

“ఆకాశం” కవితాసంపుటి గురించి బి.వి.వి. ప్రసాద్ …

మీరు కవిత్వ ప్రేమికులై, కొంతసేపైనా మనశ్శాంతిని కలిగించగల కవిత్వం కావాలనుకొంటే ఆకాశం చదవండి.

‘ఆకాశం’ కవిత్వం అతి సున్నితమైన జీవన స్పర్శ నుండీ, ప్రగాఢమైన తాత్విక చింతన నుండీ వ్యక్తమైంది. దీనిని నేను పాఠకుడికి కేవలం కావ్యానందం ఇవ్వటం కోసం రాయలేదు. ఈ కాలం సాహిత్య వాతావరణంలో బాగా ప్రచారంలో ఉన్న సామాజిక, రాజకీయ స్పృహతోనూ రాయలేదు.

నా జీవితానుభావాన్నుండి, చింతన నుండీ నేను జీవితం అంటే ఏమిటి అనుకొంటున్నానో, జీవిత లక్ష్యం ఏమిటి అనుకొంటున్నానో, మరింత ఉన్నతమైన, ఉదాత్తమమైన జీవితానుభవం కావాలంటే మనం ఎలా అనుభూతించాలో, ఆలోచించాలో, వేటిని ధ్యానించాలో, వేటిని ఉపేక్షించాలో నాకు చాతనైనంత వరకూ చెప్పటానికి ప్రయత్నించాను. అయితే సౌందర్యావిష్కారం కవిత్వ ప్రధానధర్మమని నమ్మటం వలన చాతనైనంత సౌందర్య స్పృహతోనే రాశానని, చాలావరకూ సఫలమయ్యాననీ చెప్పగలను.

ఇటువంటి కవిత్వాన్ని మార్మిక కవిత్వంగా పిలవటం సాహిత్య ప్రపంచంలో వాడుక. అంటే జీవన మౌలిక సత్యాలను వెదికేది, అనుభవంలోకి తెచ్చే ప్రయత్నం చేసేది అని. టాగోర్, సూఫీ కవులు, కన్నడ శివకవులు, కొన్ని సందర్భాలలో మన అన్నమయ్య, వేమన, పోతనలు, ఖలీల్ జిబ్రాన్ ఈ తరహా కవిత్వం రాసిన వారిలో కొందరు. జపాన్‍కు చెందిన హైకూ కూడా ఇటువంటి కవిత్వమే.

కాలం గడిచే కొద్దీ చింతన కన్నా, అనుభవానికి ప్రాధాన్యత పెరుగుతోంది. అందువలన కవిత్వం కూడా, కొన్ని ఆలోచనలను ప్రోది చెయ్యటం కన్నా, సరాసరి అనుభూతినీ, అనుభవాన్నీ ఇవ్వటానికే ప్రయత్నం చెయ్యవలసి ఉంటుందని నా భావన. అందువలన నా కవిత్వం అనుభూతీ లేదా అనుభవ ప్రధానంగా ఉంటూ వచ్చింది నా వచన కవిత్వంలోనూ, హైకూలలోనూ కూడా. అయితే ఇటువంటి కవిత్వం రాయటానికి కవికి ఎంత సాంద్రమైన అనుభవాన్ని పొందే శక్తీ, అభివ్యక్తి నైపుణ్యమూ కావాలో, పాఠకుడికి కూడా ఆ శక్తులు అంతగానూ కావాలి. తేలికైన మాటలలో చెప్పాలంటే, జీవితం లోని విషయాల పట్ల మాత్రమే కాకుండా, మొత్తం జీవితం పట్ల శ్రద్ధ కావాలి. కనీసం తనతో తాను నిజాయితీగా ఉండగల స్వచ్చత కావాలి.

కవినో, కవిత్వాన్నో తెలుసుకోవటం కోసమో, కాలక్షేపం కోసమో కాకుండా, మీ హృదయం నిజంగా జీవితానుభవాల వల్ల బరువెక్కి ఉంటే, మీ మనసే మీకు పిచ్చి గీతలు గీసిన కాగితంలా కనిపిస్తూ, అసహనానికి గురి చేస్తుంటే, జీవితం ఏమిటి, ఎందుకు వంటి ప్రశ్నలు మిమ్మల్నిలోపల ఎక్కడో ముల్లులా గుచ్చుతూ ఉంటే, ఈ కవిత్వం తప్పక చదవమని చెబుతాను. ఇది తప్పక మీ లోలోపలి శాంతికీ, స్పష్టతకీ ఒక మంచి స్నేహితుడిలా సహాయం చేస్తుందని హామీ ఇస్తున్నాను.

ఈ పుస్తకం కినిగె.కామ్ లో ఈబుక్ రూపంలో కూడా లభిస్తోంది.

బి.వి.వి. ప్రసాద్
నా బ్లాగ్: http://bvvprasad.blogspot.in/

ఆకాశం On Kinige

Related Posts:

‘మో’లోని ఇంటీరియర్ మోనోలోగ్

‘మో’ పుస్తకం నిషాదంను ప్రముఖ రచయిత సుధామ ఆంధ్రభూమి పత్రికలో సమీక్షిస్తూ…”‘మో’ కవిత్వం అర్థం కాదనే అభియోగం కొత్తదేమీ కాదని అంటారు. కవికీ పాఠకుడికి మధ్య ఎడం ఎందుకొస్తుందో చెబుతూ – “అర్థ బదలాయింపును దబాయించే చేసే మెటాఫర్స్, రూపకాలు కవికి వున్నంత చిరపరిచితంగా చదువరికి ఉండకపోవడమేనని” సుధామ అంటారు.
‘మో’ ది క్లోజ్ ఎండింగ్ రచన అని, అందువల్లే పాఠకుడి ఆలోచనాశక్తికి ఎక్కువ శ్రమ ఇస్తుందని సుధామ అంటారు.
అయితే, శ్రమయేవ జయతే అన్నట్లుగా, పాఠకులు శ్రమిస్తే, మో కవిత్వాన్ని ఆస్వాదించగలరని సుధామ వ్యాఖ్యానిస్తారు.
పూర్తి సమీక్షని ఈ దిగువ చిత్రంలో చదవచ్చు.

 

మో రాసిన నిషాదం డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. వెల రూ.90/- నెలకి రూ. 30/- అద్దెతో కూడా ఈ పుస్తకాన్ని చదువుకోవచ్చు.

నిషాదం (మో) On Kinige

కొల్లూరి సోమ శంకర్

Related Posts:

మిశ్రమ భావోద్వేగాల సమాహారం

కరువు కురిసిన మేఘం” వై. హెచ్. కె. మోహన్‌రావు గారు రాసిన కవితా సంకలనం. ఇందులో 37 కవితలున్నాయి.

“విభిన్నమైన అంశాలపై కవితలున్నా, వాటిల్లో అంతర్లీనంగా ఉన్న వేదనంతా, మనిషి మనిషి కాకుండా పోతున్నాడనే” అని అంటారు శ్రీ శివారెడ్డి ఈ పుస్తకానికి రాసిన ముందుమాటలో.

మోహన్‌రావు గారు తన గురించి చెబుతూ, తనది “క్రింద పడిపోయినవాడి పక్షాన నిలిచే తత్వమని” అన్నారు. తెలుసుకోవాలనే తపన, సాహిత్య పఠనం తనని కవిత్వం రాసే దిశకు నడిపించాయని చెప్పారు.

ఈ సంకలనంలోని ఎక్కువ కవితల్లో రైతుల కడగండ్లను గురించి వర్ణించారు. వాటిల్లో కొన్ని “కరువు కురిసిన మేఘం”, “స్వేదం సహనం వీడక ముందే”, “హాలా’హలధరు’డై”, “పల్లె మేల్కొంటునట్లు…..” “సుంకురాలిన కంకి”.

కరువుకురిసిన మేఘం” కవితలో, “చల్లగా వర్షించే మేఘం నలుపు/మృత్యు సంకేతమని/అది కరువును కురిసిన తరువాత తెలిసింది” అని అంటారు. “పంట పొలాల్లో/పైరుకు జీవంపోసే నది/చుక్క జారకుండా/ప్రాణాలు తీయడం కూడా /నేర్చిందని తెలిసింది” అని రైతుల వ్యధని వ్యక్తం చేసారు.

స్వేదం సహనం వీడక ముందే” అనే కవితలో, కాడిజారిన సేద్యం గురించి బాధ పడుతూ, “అదేమిటో ఎంత వెదికినా/మేఘంలో చిరునామా దొరకని వాన చినుకు/కంటిలో కన్నీరై కనిపించింది/పాతాళం దాకా ఆనవాలు చిక్కని నీటిచుక్క అడ్రస్సూ/అక్కడే దొరికింది” ఎంత ఆర్ద్రత! మనసు చెమ్మగిల్లించే పదాలు ఇవి.

హాలా’హలధరు’డై” అనే కవితలో – సకాలంలో వర్షాలు కురవక రైతులు ఎదుర్కునే ఇబ్బందులను ప్రస్తావిస్తారు, “చినుకు కోసం ఎదురుచూసే ఆ కళ్లు/చేను దు:ఖానికి చెమరిస్తాయి/వర్షించని మేఘాన్ని చూసి కన్నీళ్లు కురుస్తాయి” అని అంటారు. అదే వరదలొచ్చి రైతులు నష్టపోతే, ” పుట్లెన్ని పండించినా ఉట్టిమీదకు పెడ్డరాదు” అని అంటారు.

సుంకురాలిన కంకి” అనే కవితలో “నాగలి తప్ప నాగరికం తెలియని తల్లి/కరువురాగం శృతి చేసుకుంది !” అని చెబుతూ, “గుండె పగిలిన పత్తి/రైతు బ్రతుకును వత్తినిచేస్తే/తలగుడ్డ ‘పాశమై’ వెక్కిరించింది” అంటూ బాధ పడతారు. ఏం చేస్తే సంక్రాంతి పండుగ రైతుల్లో ఉత్సాహం నింపుతుందో ఈ కవితలో చెబుతారు కవి.

పల్లె మేల్కొంటునట్లు…..” అనే కవితలో కష్టాలు పడుతున్న రైతులు చైతన్యవంతులై పట్టణ వీధుల్లో నకిలీమందుల్ని, అందిరాని ధరల్ని నిలదీయాలని చెబుతారు.

ప్రపంచీకరణ ముప్పు గురించి రాసిన కవితలు – “ఒక విధ్వంసానంతరం”, “మనీ+మనీ=మనిషి”, “విషాదాంతం”.

ఒక విధ్వంసానంతరం” అనే కవితలో ప్రపంచీకరణ కొండచిలువలా మింగేసిన తర్వాత, “బ్రతుక్కీ చావుకీ తేడా తెలియని అవాంఛిత స్థితులే గాని/నాలుగు నవ్వులు పూచే ముఖాలేవి ?” అని ప్రశ్నిస్తారు. “ఎక్కడ చూసినా కరెన్సీ కట్టల అభ్యంగనాలే తప్ప/కాస్త ఊరటనిచ్చే ఆలింగనాలే కరువయ్యాయి” అని వాపోతారు.

మనీ+మనీ=మనిషి” అనే కవితలో అంతరించిపోతున్న మానవ సంబంధాల గురించి చెబుతూ, “ప్రపంచం దగ్గరౌతున్న కొద్దీ/మనిషి మార్కెట్‌సరుకులా మారుతున్నాడు/మనిషి కొనుగోలు వస్తువులా మారిన తరువాత/తాను వస్తువుతోనే జీవనం సాగిస్తున్నాడు”అని అంటారు. సున్నితత్వాన్ని కోల్పోడాన్ని చక్కగా వర్ణించారు కవి.

విషాదాంతం” అనే కవితలో ప్రపంచీకరణ గురించి చెబుతూ, “‘’గ్లోబ్’ అంతా కుగ్రామం కావడమంటే బ్రతుకును పాతాళానికి తొక్కడమేనా?” అని ప్రశ్నిస్తారు. “గ్లోబలైజేషన్‌దోపిడి పర్యాయం/పేద దేశాల కొల్లగొట్టే బహిర్‌మార్గం/ప్రపంచీకరణ పరదాస్యమే” అని అంటారు.

అమ్మ ప్రేమ గురించి, మాతృవాత్సల్యం గురించి రాసినవి – “కొంగు సాక్షిగా”, “మమకారానికి సాకారం”.

కొంగు సాక్షిగా” అనే కవిత అమ్మకంటే సొమ్మే విలువని భావించే వారి గురించి రాసినది. ” అమ్మంటే రెండక్షరాల కూర్పు కాదు/కడుపుతీపిలో కారుణ్యం కలిస్తే అమ్మ” అంటూ అద్భుతమైన నిర్వచనం చెప్పారు.

మమకారానికి సాకారం” అనే కవిత అమ్మ గురించి గొప్పగా చెప్పిన మరో కవిత. “అమ్మకు భాష్యం అమ్మే / అమ్మను మించిన జన్మలేదు” అని అంటారు. పిల్లల కోసం తల్లి ఎంతగా ఆరాటపడుతుందో చెబుతూ “నా బ్రతుకుకోసం, ఆమెచేతులెపుడూ పనితో పోటీ పడేవి” అని అంటారు.

గాంధీజీ గురించి, గాంధీ తత్వాన్ని గురించి రాసినవి రెండు కవితలు – “మరో సిద్ధార్థుడు”, “రెక్కలు తెగిన భారతం”.

“సత్యానికి శరీరాన్ని తొడిగితే ఆయన/రూపమొస్తుంది/సత్యాగ్రహానికి అక్షర రూపమిస్తే/ఆయన పేరే ధ్వనిస్తుంది” అని అంటారు “మరో సిద్ధార్థుడు” అనే కవితలో. గాంధీజీని ఇంత చక్కగా వర్ణించిన కవిత మరోకటి లేదంటే అతిశయోక్తి కాదు.

జాతిని సమూలంగా మార్చడానికి గాంధీమార్గం అవసరమని చెబుతూ, “రాచపుండులా మారిన జాతి రుగ్మతకు/మరో శస్త్రచికిత్స జరగాలి” అని అంటూ, “గాంధీ మార్గం విశ్వ నాందీవాచకం కావాలి” అని కోరుకుంటారు “రెక్కలు తెగిన భారతం” అనే కవితలో.

కృష్ణా నదితో తనకున్న అనుబంధాన్ని వివరిస్తూ రాసిన కవితలు – “నదీరాగం”, “కృష్ణతరంగిణి”.

“రాగాలు తీయడం కోయిలకే కాదు/’కృష్ణ’మ్మకి కూడా తెలుసు” అంటారు కవి “నదీరాగం” అనే కవితలో. కృష్ణానది తన ప్రవాహదిశలో ఒక్కో చోట ఒక్కో రాగాన్ని పలికిస్తుందని అంటారు.

నదిలో నీటి ప్రవాహం బాగా ఉన్నప్పుడు పల్లెలెలా ఉండేవో వర్ణిస్తారు, “కృష్ణతరంగిణి” అనే కవితలో. నీటి ప్రవాహం తగ్గిపోతే, రైతుల గుండెలు వడబడుతున్నాయని అంటారు. కరువుని త్రోలగ గలగల సాగమని నదిని కోరుకుంటారు కవి.

ఘనీభవిస్తున్న నదులు” అనే కవితలో మతమౌఢ్యాన్ని నిరసిస్తారు.

తెలుగు భాష గురించి, “అమ్మంటే ఏమిటి మమ్మీ!” అనే కవితలో చక్కగా చెప్పారు.

పైర్లను కబళిస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారం గురించి “రియల్ రోగం” అనే కవితలో హృద్యంగా చెప్పారు.

వివిధ పత్రికల్లో ప్రచురితమై, బహుమతులు పొందిన కవితలివి. పాఠకులలో మిశ్రమ భావోద్వేగాలను కలిగించే కవితలివి. కవితావస్తువు సార్వజనీనమై, భాష సరళంగా ఉండడం వలన ఈ కవితలని ఆసాంతం హాయిగా చదువుకోవచ్చు.

ఈ పుస్తకం డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. వెల రూ.50/-. నెలకి రూ.30/- అద్దెతో కూడా చదువుకోవచ్చు.

కరువు కురిసిన మేఘం On Kinige

కొల్లూరి సోమ శంకర్

Related Posts:

కుండీలో మర్రిచెట్టు

విన్నకోట రవిశంకర్ రాసిన ఈ కవితాసంకలనంలో 29 కవితలున్నాయి. “మానవత్వపు సారాంశాలైన జీవితానుభవాలతో స్పందించే కవితలు ఈ పుస్తకం నిండా వున్నాయని, జీవితానుభవమూ, హృదయానుభూతీ – ఈ రెండు ధృవాల్నీ కలిపి కవిత్వ విద్యుచ్చక్తిని సృష్టించాడు కవీ, విద్యుత్ ఇంజనీరూ ఐన రవిశంకర్” అని ముందుమాటలో ఇస్మాయిల్ గారు చెప్పిన మాటలు ఎంతో నిజం అనిపిస్తుంది ఈ కవితలు చదివితే.

ఇందులోని కొన్ని కవితలను పరిచయం చేసుకుందాం.

హోళీ: వసంతోత్సవం పండుగ సందర్భంగా రంగులతో ఆడుకుంటూ తనలోని భేషజాలని వదిలించుకుని, మనిషి తనని తాను చేరుకోడాన్ని; ఆకులు రాల్చిన చెట్టు మళ్ళీ చిగురించి పూలు పూచడంతో పోల్చారు ఈ కవితలో.

ఉదయాలు: చిన్న చిన్న పదాలలో ఎంతో చక్కని భావల్ని నింపిన కవిత ఇది. ఆశనిరాశల మధ్య జరిగే దోబూచులాటని ఈ కవిత వర్ణిస్తుంది. కల అందమైన భ్రమ కాగా, జీవితం కఠినమైన వాస్తవం అని ఈ కవిత చెబుతుంది.

కుండీలో మర్రిచెట్టు: విశాలంగా, ఊడలు దాల్చి పెరిగే మర్రిచెట్టుని, కుండీలో పట్టేడట్టుగా బోన్సయ్‌గా మార్చేసారని బాధ పడుతూ, నిండైన దాని జీవితాన్ని ఎవరో అపహరించారని వాపోతారు కవి. మనిషి తన స్వార్థం కోసం ఏమైనా చేస్తాడని, అది ఎదుటివారికే ప్రయోజనకరమని వారిని నమ్మిస్తాడని అనే అర్థం గోచరిస్తుంది ఈ కవితలో.

స్త్రీ పాత్ర: తనున్నచోట తన చుట్టూ ఆర్ద్రత ప్రవేశపెడుతుంది స్త్రీ. మహిళలు లేని పరిసరాలని ఊహించడం కష్టం. “హఠాత్తుగా అసంగతంగా మారిన/అక్కడి వాతావరణానికి/ఆమె అర్థం కల్పిస్తుంది” ఎంతో లోతైన అర్థం ఉందీ కవితలో.

నిద్రానుభవం: రాత్రుళ్ళు నిద్ర పట్టకుండా బాధపడేవారికి, అతి తేలికగా నిద్ర పట్టేసే వాళ్ళకి మధ్య తేడాని ఈ కవిత చూపుతుంది. అతి తేలికైన పదాలతో అలవోకగా సాగిన కవిత ఇది.

రామప్ప సరస్సు: తమకి దూరమైన మిత్రుడి స్మృతిలో ఈ కవిత రాసారు రవిశంకర్. ఎంత అందమైన, క్రూరమైన సరస్సో అని బాధ పడతారు.

జ్ఞాపకం: తరచూ విస్మరించే సన్నిహితులను తలచుకుంటూ రాసిన కవిత ఇది. అమ్మని ఉద్దేశించి రాసినా, దీన్ని మనం విస్మరించే వ్యక్తులకు అన్వయించుకోవచ్చు. బంధాలను పునర్దర్శించేందుకు ఉపకరిస్తుంది ఈ కవిత.

ట్రాన్సిషన్: ఈ కవిత మానవ జీవితానికి అద్దం పడుతుంది. జీవితమంటేనే కొన్నింటిన్ పోగొట్టుకోడం, మరికొన్నింటిని పొందడం. కొన్ని బంధాలను తెంచుకోడం, కొన్నింటిని అల్లుకోడం. మనిషి జీవితమంటా ట్రాన్సిషన్ అని చెప్పడానికి ప్రయత్నిస్తుందీ కవిత.

గాయం: మానవత్వాన్ని మార్పిడి చేసి, అమర్చుకున్న అలసత్వానికి విరుగుడు లేదంటారు కవి. వైద్యవృత్తిలోని లోపాలను అంతర్లీనంగా ప్రశ్నిస్తుంది ఈ కవిత.

భోపాల్: యూనియన్ కార్బైడ్ ఫాక్టరీ ప్రమాదం ఈ కవితకి నేపధ్యం. తన బిడ్డని రక్షించుకోలేని ఓ తల్లి ఆవేదనని ఈ కవిత చిత్రించింది. ఇది చదివాక మనసు మొద్దుబారిపోతుంది.

శివకాశి: ఇతరుల జీవితాలలో పండగ వెలుగులు నింపేందుంకు, తమ బ్రతుకులని మసి చేసుకునే బాల కార్మికులపై రాసిన కవిత ఇది. ” అతని జీవితంలో/అల్లరిలేదు; ఆటల్లేవు;/తప్పటడుగుల్లేవు;/ తడబడే మాటల్లేవు/” చిన్న చిన్న పదాలలో అక్కడి దృశ్యాన్ని కళ్ళముందుంచారు కవి.

గ్లాస్‌నోస్త్: ఒక్కప్పటి సోవియట్ యూనియన్ సంస్కరణల గురించి రాసిన కవిత ఇది. రష్యా గురించి ప్రజలు ఊహించుకున్న ఘనతంతా నిజం కాదని కవి అంటారు.
“ఇప్పుడు తెర తీసేశారు/ ఇక యే దాపరికమూ లేదు! /ఈ రహస్యం/ ఇంత వికృతంగా ఉంటుందని/ నేననుకోలేదు./ నేనిన్నాళ్ళూ కొలిచిన వేలుపు/ అసలు రూపం ఇదని /నేనూహించను కూడా లేదు” అని అంటారు.

మోళీ: ఇళ్ళలో ఆడవాళ్లపై జరిగే గృహహింసని ప్రస్తావిస్తుంది ఈ కవిత. కాపురం మగాడికి మోళీ ఆటలాంటిదని, అది అద్భుతంగా సాగుతోందని జనాలని నమ్మించడానికి కుటుంబ హింసని ఆయుధంగా వాడుకుంటారని అంటారు కవి.

దూరం: ఈ కవిత స్నేహితుల మధ్య దూరాన్ని ప్రస్తావిస్తుంది. కాలక్రమంలో గాఢమైన స్నేహమైనా బీటలు వారుతుందని, స్నేహితులు పునఃపరిచయం చేసుకోవాల్సిరావచ్చని చెబుతుందీ కవిత. అయినా పాత జ్ఞాపకాలు వాడిపోవని అంటుంది.

చలనచిత్రం: అతి వేగంగా సాగిపోయే జీవితాన్ని కాప్చర్ చేయడం సాధ్యమేనా? జీవితపు కనిపించని ప్రవాహపు కదలికలో ఉన్న అందాన్ని, దేనితో కేప్చర్ చెయ్యమంటావని కవి ప్రశ్నిస్తారు.

ఇంకా ఎన్నో చక్కని కవితలున్న ఈ పుస్తకం డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. వెల రూ. 30/- మార్మికమైన అనుభూతులను ఆస్వాదించడానికి ఈ పుస్తకాన్ని సొంతం చేసుకోండి.

కుండీలో మర్రిచెట్టు On Kinige

కొల్లూరి సోమ శంకర్

Related Posts: