శంకర్ దాదా
నాలుగు అడుగుల ఎత్తుకు గాలిలోకి లేచి, బలంగా తన ఎడమ పాదాన్ని విసిరాడు ఇన్స్పెక్టర్ వినోద్.
ఎగిరి ఆవతల పడిపోయింది సుక్కూర్ చేతిలోకి కత్తి,తీవ్రాతి తీవ్రంగా గాయపడింది అతని ముఖం. చేతులతో ముఖాన్ని కప్పుకుని, పొర్లిగింతలు పెట్టడం ప్రారంభించాడు.
ముందుకు వంగి, అతని జుట్టును పట్టుకున్నాడు ఇన్స్పెక్టర్ వినోద్. ముళ్ళకంపను ఈడ్చినట్లు నేలమీద బరబరా ఈడ్చుకుంటూ తన జీప్దగ్గరికి తీసుకుపోయాడు. గలగలమని శబ్ధాలు చేస్తూ, అతి వేగంగా ప్రవహిస్తున్న ఒక డ్రయినేజ్ కాలువ పక్కన ఆగి ఉన్నది అతని జీప్.
హేండ్ కర్చిఫ్లను ముఖాలను అడ్డుగాపెట్టుకుని, అనీజీగా అక్కడ నిలబడి ఉన్నారు అని కానిస్టేబిల్స్ నలుగురు. సుక్కూర్ని చూసి నోళ్ళు వెళ్ళబెట్టారు వారందరూ.
నగరంలో రకరకాలయిన నేరాలను, చేసే విక్టర్ గ్యాంగ్‌కి చెందిన వాడు సుక్కూర్.
అప్పటికప్పుడు కాకపోయినా, ఆ తరువాత రెండు మూడు గంటల్లో సుక్కూర్ని అరెస్ట్ చేశారన్న వార్త అతని బిగ్‌బాస్ విక్టర్ చెవికి చేరకుండా ఆగదు.
చేరిన వెంటనే ఆఘమేఘాల మీద కదులుతాడు అతను.
బిగ్‌బాస్ విక్టర్ కదలటం అంటూ జరిగితే, కథ అక్కడితో ఆగిపోదు. సుక్కూర్ని అరెస్ట్ చేయటంలో ఇన్వాల్వ్అయిన అధికారికి ఆ సాయంత్రం లోపు అందుతాయి బదిలీ అర్డర్స్. అతనితోపాటు పనిచేసిన కానిస్టేబుల్స్‌కి పట్టే దుర్గతిని గురించి అసలు చెప్పవలసిన అవసరమే ఉండదు. డ్యూటీలు దిగి ఇళ్ళకు వెళ్లే సమయంలో చిన్న చిన్న యాక్సిడెంట్ జరిగి కాళ్ళు, చేతులు విరిగిపోవటమో లేక ఏకంగా మొత్తం ప్రాణాలను కోల్పోవటమే తప్పకుండా జరుగుతుంది.
రక్తంలేనట్లు తెల్లగా పాలిపోయిన ముఖాలతో నిలబడి ఉన్న తనకానిస్టేబల్స్ వంక చూసి, చిన్నగా నవ్వాడు ఇన్స్పెక్టర్ వినోద్.
“ మనం ఇతన్ని స్టేషన్‌కి తీసుకుపోయిన వెంటనే ఇతని బాస్ తన లాయర్స్ని మన మీదకి ఉసికొల్పుతాడు కదూ?” అని వారిని అడిగాడు అతను.
అటువంటి సంభాషణలు స్టార్ట్ అయితే, వెంటనే కల్పించుకునేందుకు సిద్ధంగా ఉన్నాడు జీప్ డ్రైవర్.
“ఒట్టిగా ఉసికొల్పటమే కాదు సార్… అసలు మనల్ని ఒక్కమాట కూడా మాట్లాడనీయడు. ఇతన్ని ఎందుకు అరెస్ట్ చేశామో, మనపై అధికారులకు తెలియచేసుకునే టైమ్ కూడ ఉండదు. మనం ఏదో పెద్ద తప్పుచేసినట్లు నిరూపిస్తారు. మన పరువులు తీస్తారు” అంటూ గతంలో ఎదురైన అనుభవాలను గడగడా వల్లించేశాడు.
భరించరాని బాధను పళ్ళబిగువున భరిస్తూ అస్పష్టమైన శబ్ధాలు చేస్తున్న సుక్కూర్ వదనంలో వెంటనే కనిపించింది. ఒక రకమైన మార్పు.
“అర్థం అయింది కదా ఇన్స్పెక్టర్. వదిలేయ్ నన్ను. వదిలేసి నీ దారిన నువ్వు వెళ్ళిపో….” ఉన్నట్టుండి పైకిలేస్తూ ఉచిత సలహా, ఒకదాన్ని ఇచ్చేశాడు.
తన డ్రయివర్ చెపుతున్న మాటల్ని చాలా అటెంటివ్ వింటున్న ఇన్స్పెక్టర్ వినోద్ ఎడమచేయి వెంటనే కదిలింది. గావురుమంటూ మళ్ళీ వెల్లికిలా పడిపోయాడు సుక్కూర్.
“సార్…సార్…ఏమిటి సార్ మీరు చేస్తున్నపని?” ఆందోళన నిండిన కంఠంతో అడుగుతూ ముందుకు రాబోయిన ఒక కానిస్టేబుల్ గుండెలమీద చేయి వేసి బలంగా వెనక్కినెట్టాడు ఇన్స్పెక్టర్ వినోద్.
“సార్! మామాట వినండి సార్…ఒక్కసారి మేము చెప్పినట్లు చేయండి సార్…. ప్లీజ్ సార్” అంటూ అతని శాంతింప చేయటానికి ప్రయత్నించాడు అందరిలోకి పెద్దవాడైన ఇబ్రహీం.
అంతకు ముందు మాట్లాడబోయిన కానిస్టేబుల్ని కనురుకుంటున్నట్లు విరుచుకుపడలేదు వినోద్.
“చెప్పు ఇబ్రహీం, నువ్వు చెప్పదలుచుకున్నదేదో త్వరగా చెప్పు” అన్నాడు మృదుస్వరంతో…
“గత రెండు నెలలుగా, ఈ చుట్టుపక్కల జరుగుతున్న దారిదోపిడీలను గురించి ఎంక్వయిరీ చేయటానికి వచ్చాము మనం. ఈ దోపిడి దొంగలు ఎవరో మనకి తెలియదు. వారిలో ఈ సుక్కూర్ ఉన్నట్లుగా అస్సలు తెలియదు. సరైన ఆధారాలు లేకుండా తన్ని పట్టుకోవడం ఒక తప్పయితే,రక్తం వెలువడేటట్లు కొట్టి స్టేషన్‌కి తీసుకుపోవడం రెండో తప్పు అవుతుంది”.
తన మాటలు సుక్కూర్కి వినిపిస్తున్నాయని తెలిసి కూడా నెమ్మదిగా చెప్పాడు ఇబ్రహీం.
ప్యాంటు జేబులో ఉన్న సిగరెట్ పాకెట్ని బయటికి తీసి, సిగరెట్‌ని వెలిగించుకుంటూ ఇబ్రహీం వైపు తిరిగాడు ఇన్స్పెక్టర్ వినోద్.
“బ్లూకలర్ మారుతీవ్యాన్‌లో ఇటుగా వస్తున్న ముగ్గురు టూరిస్టులను దోచుకుని తీవ్రంగా గాయపరిచినట్లు మూడు రోజుల క్రితం మనకు ఒక రిపోర్ట్ అందింది. అవునా?”
ఆలోచించడంలో మంచి ఎక్స్పర్టని ఇబ్రహీం వూరికే రాలేదు పేరు. “వచ్చింది సార్. ఎనభై వేల రూపాయలు విలువ చేసేకరెన్సీ దోపిడి అయింది. నాలుగు లక్షలు ఉండే కెమేరాలు, వీడియో ఎక్విప్మెంట్ దోచుకోబడ్డాయి”అన్నాడు వెంటనే.
ఆ మాటలు విన్న తరువాత ఇన్స్పెక్టర్ ముఖంలోని ఎక్స్ప్రెషన్స్ ఏ మాత్రము మారకపోవడంతో మరోసారి దొంగిలించబడిన వస్తువుల వివరాలను గబగబా ఎనౌన్స్ చేశాడు ఇబ్రహీం.
“గోల్డ్చైన్స్ రెండు మాయం అయ్యాయి. రిస్ట్‌వాచీ కూడా ఒక్కటి గల్లంతు అయింది. అంటూ అదిరిపడినట్లు వెనక్కి తిరిగి సుక్కూర్ చేతుల వైపు చూశాడు.
మారుతీవ్యాన్‌లో ట్రావెల్ చేస్తున్న టూరిస్టులందరికి రిస్ట్ వాచీలు ఉన్నాయి. వారి జేబులన్నిటిని ఖాళీచేసిన దొంగలు, ఒక టూరిస్ట్ దగ్గర ఉన్న వాచీనే బలవంతంగా తీసుకున్నారు. మిగిలిన వారివి ముట్టుకోలేదు.
‘ నా బర్త్‌డేకి నా తల్లిదండ్రులు స్పెషల్‌గా ఆర్డర్ ఇచ్చి తయారు చేయించిన వాచ్ అది. ఇటీజ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ వాచెస్… ఇటీజ్ యునిక్ రిపోర్టు ఇచ్చేప్పుడు చెప్పాడు ఆ వాచీని కోల్పోయిన టూరిస్ట్.
అదే వాచి ఇప్పుడు తళతళని మెరుస్తూ సుక్కూర్ చేతిని అలంకరించి ఉన్నది. టూరిస్ట్ చెప్పిన పోలికలు కొట్టవచ్చినట్టు కనిపిస్తున్నాయి.
ఆశ్చర్యం నిండిన కనులతో ఇబ్రహీం భుజం తట్టి చిన్నగా నవ్వాడు ఇన్స్పెక్టర్ వినోద్.
“స్పెషల్ ఆర్డర్‌మీద తయారుచేయబడిన వాచి కాబట్టి, ఇటువంటిది మార్కెట్లో ఎక్కడా లభించదనే మాటను మన సుక్కూర్ మర్చిపోయాడు. ముచ్చటగా ఉన్నదని తనే స్వంతం చేసుకున్నాడు. మనకు దొరికిపోయాడు” గుండెలనిండా పొగను పీల్చుకుని, సిగరెట్‌ని అవతలికి విసురుతూ అన్నాడు.
“అయినా సార్ …… మనం మన జాగ్రత్తలో ఉండటం చాలా మంచిది. నా అభిప్రాయం ఏమిటంటే” అని మాట్లాడటం మొదలుపెట్టిన ఇబ్రహీం మాటల్ని మధ్యలోనే కట్ చేసేశాడతను.
“నా మొండితనంతో మీకు అనవసరమైన బాధల్ని క్రియేట్ చేయడం నాకు ఇష్టం లేదు. ఈ సుక్కూర్ సంగతి నేను చూసుకుంటాను.. మీరందరూ అవతలికి వెళ్ళి ఇతని అనుచరులు ఎవరైనా కనిపిస్తారేమో సెర్చి చేయండి….వెళ్ళండి…. మూవ్”అంటూ చకచకా ఖచ్చితమైన ఆర్డర్స్‌ని జారీ చేశాడు.
అటువంటి మాటల్ని రెండోసారి చెప్పించుకునే అలవాటు లేనట్లు ఒక్కసారిగా వెనుతిరిగి, దూరంలో ఉన్న పొదలకేసి పరుగుదీశాడు కానిస్టేబిల్స్.
“వెళ్ళు… నీకు ఒక్కడికే ప్రత్యేకంగా చెప్పాలా? వారితోపాటు వెళ్ళు….” కదలకుండా నిలబడిన ఇబ్రహీంని కూడ కరుకు కంఠంతో హెచ్చరించి, అవతలికి తరిమాడు ఇన్స్పెక్టర్ వినోద్.
డ్రయివర్ ఒక్కడే మిగిలిపోయాడు జీప్ దగ్గర. అనుకోని విధంగా అందరికీ లభించిన అవకాశం తనకు లభించనందుకు బాధపడుతున్నట్లు ముఖం పెట్టాడు.
“మంచినీళ్ళు కావాలి… ఈ చుట్టు పక్కల ఎక్కడైనా దొరుకుతాయేమో చూడు…వెళ్ళు” అంటూ అతడికి మరోపని అప్పజెప్పాడు ఇన్స్పెక్టర్ వినోద్.
అక్కడికి బయలుదేరేముందు జీప్‌లో పెట్టిన వాటర్‌బాటిల్ మూత తీయకుండా అలాగే ఉండటాన్ని మరిచిపోలేదు జీప్ డ్రైవర్. అయినా సరే అందరిలా తనూ దూరంలో ఉన్న పొదలకేసి పరుగుతీశాడు.
ఎర్రనేలమీద వెల్లికిలా పడిఉన్న సుక్కూర్వైపు ఒకసారి చూసి, వున్నట్లుండి కదిలాడు ఇన్స్పెక్టర్ వినోద్. బూటుకాలిని వెనక్కిలాగి అతని తొడలమీద బలంగా తన్నాడు.
అటువంటి దెబ్బను తట్టుకోవడానికి సిద్ధంగాలేడు సుక్కూర్… గావురుమని అరిచి పక్కకు దొర్లాడు.
“నిన్ను స్టేషన్‌కి తీసుకుపోయిన మరుక్షణం నీ బిగ్‌బాస్ పంపిన లాయర్లు వచ్చి బయటికి తీసుకుపోతారని మా వాళ్ళు అంటున్నారు. నిన్ను ఇంటరాగేట్ చేసేందుకు తగిన వ్యవధికూడా ఉండదని చెబుతున్నారు….. అందుకే ఇఫ్పుడు మొదలుపెట్టాను. స్టేషన్‌కి వెళ్ళకుండానే నీ అంతు చూస్తాను….” అంటూ జీప్ వెనుకభాగంలో ఉన్న ఒక లాటీని అందుకుని మర్దన కార్యక్రమాన్ని సీరియస్‌గా అమలు చేశాడు. నాలుగే నాలుగు నిముషాలు తట్టుకోగలిగాడు సుక్కూర్. ఐదో నిమిషంలో తనకు తెలియకుండానే నోరు తెరిచి కేకలుపెట్టాడు.
“నీ గోల వినేందుకు ఈ చుట్టుపక్కల ఎవరూలేరు… దోపిడీసొత్తు ఎక్కడ ఉన్నదో చెప్పు…. నీతోపాటు ఎవరెవరు దోపిడీలో పాల్గొన్నారో వివరించు…” అంటూ కొట్టినచోట కొట్టకుండా వళ్ళుహూనం చేసేశాడు.
“నువ్వు ఏం చేసినా నా చేత మాట్లాడించలేవు….ఈ వాచీ ఆధారంగా నన్నేదో దొంగగా నిరూపించాలని చూస్తున్నావు.. ఇది నాకు నిన్న సాయంకాలం రోడ్డుమీద దొరికింది…” అంత బాధలోను, వెక్కిరింపుగా మాట్లాడకుండా ఉండలేకపోయాడు సుక్కూర్.
ప్యాంటు బెల్టుకు తగిలించి ఉన్న సర్వీస్ రివాల్వర్మీద చేయివేశాడు వినోద్.
“అన్యాయం, అక్రమం…. నువ్వు అనుభవిస్తావ్… నన్ను చంపిన తరువాత నువ్వు కూడా చచ్చిపోతావ్…” కంచు కంఠంతో అరిచాడు సుక్కూర్.
ఎన్ని దెబ్బలు కొట్టినా తన పెదవులు విప్పకపోయేసరికి, ఇన్స్పెక్టర్ సహనం అంతరించిపోయిందని భయపడ్డాడతను.. ఎన్కౌంటర్ చేసి ఆ తరువాత అందుకేవో కారణాలు చూపించుతుండని భ్రమపడ్డాడు.
ఆ భ్రమ అతన్ని గొంతెత్తి అరిచేటట్లు చేసింది….” రక్షించండి నన్ను కాపాడండి…బచావ్…బచావ్” అంటూ చెవులు చిల్లులుపడేలా కేకలు పెట్టాడు.
ప్యాంటుజేబులో నుంచి ఇంకో సిగరెట్తీసి వెలిగించుకుంటూ, ఓపికగా ఆ కేకల్ని భరించాడు ఇన్స్పెక్టర్ వినోద్. “అరవటం, కేలు పెట్టడం వృధా అని నీకు తెలుసు. నీ గోడు వినేందుకు ఎవరూ ఈ చుట్టు పక్కల సిద్ధంగా లేరు…. మర్యాదగా నా ప్రశ్నలకు సమాధానం చెప్పు అన్నాడు రెండు నిముషాల తరువాత.
“చెప్పకపోతే ఏం చేస్తావ్?” ఎన్‌కౌంటరా?” అడిగాడు.
అవునని తల ఊపలేదు వినోద్. అడ్డం తిప్పాడు.
“నీ వంటి బద్మాష్లను ఎన్కౌంటర్ చేసి నేను కోర్టుల చుట్టూ తిరగలేను. ఎన్కౌంటర్ కంటే బలమైన పని చేస్తాను” అన్నాడు.
“ఏమిటాపని?” అడిగాడు సుక్కూర్ భయంగా.
“నిన్ను తీసుకుపోయి డ్రయినేజి కాలువలో ముంచుతాను….” కామ్‌గా ఎనౌన్స్ చేశాడు వినోద్. “అరెస్టు చేయబోతుండగా ఎదరుతిరిగి పారిపోవటానికి కాలువలో దూకావని చెపుతాను. ఎవరూ కాదని అనలేరు….”
తన చెవుల్ని తనే నమ్మలేనట్లు విచిత్రంగా చూశాడు సుక్కూర్.
లాటీతో కొట్టి కొట్టి ఆవేశం అధికం అయి, మతిస్థిమితం తప్పలేదు కదా! లాటీ చేయలేని డామేజి మురుగుకాలువ చేస్తుందా?
సుక్కూర్ ఆలోచనలు తనకు అర్థం అయినట్లు చిన్నగా నవ్వుతూ అతని షర్ట్‌ను బిగించి పట్టుకుని, మరోసారి ఈడ్చుకుంటూ తీసుకుపోయి, మురుగుకాల్వ సమీపంలో వదిలాడు వినోద్. మురుగుశాతం చాలా అధికం అవడం వల్ల నీలిరంగు నురగల్ని వెలువరిస్తున్నాయి ఆనీళ్ళు. దుర్గంధం అన్బేరబుల్గా ఉన్నది. పది క్షణాలు కూడా గడవకముందే కళ్ళుగిర్రున తిరుగుతున్న అనుభూతి సుక్కూర్కి కలిగింది.
“సిటీలోని మలినాలు మాత్రమే కాదు. సిటీ ఆవలి పక్కన ఉన్న ఫ్యాక్టరీలోని మురికి కూడా ఈ నీళ్ళల్లో కలుస్తుంది. పదినిముషాలపాటు ఈ నీటిలో నిలబడితే కుష్టువ్యాధి వచ్చినట్లు కొరుక్కుపోతాయి నీ అవయవాలు…..” అంటూ సుక్కూర్ని చటుక్కున నీటిలోకి నెట్టబోయాడు ఇన్స్పెక్టర్ వినోద్.
రోజు చూసే ఆ డ్రయినేజ్ వాటర్‌కి అతను చెపుతున్న శక్తిఉన్నదంటే నమ్మబుద్ధి కాలేదు సుక్కూర్కి, వెనక్కి జరిగే ప్రయత్నం చేయలేదు.
అతన్ని నెట్టడానికి వినోద్ ఎంచుకున్నది గలగలలాడుతూ ప్రవహిస్తున్న నీటి కాలువ కాదు. నురుగు తుట్టెలతో అసహ్యకరంగా ఉన్న ఒక పల్లపు ప్రదేశాన్ని, ప్రవాహంలో కలువకుండా నిలబడి ఉన్నది ఆ పల్లంలోని నీరు….మామూలు నీటి మాదిరిగా పలుచగా లేదు. ఆముదం మాదిరి చిక్కబడి ఉన్నది.
సుక్కూర్ ఎడమచేయి ఆ నీటిలో మునిగేట్లు నెట్టాడు వినోద్. రెండు నిమిషాలపాటు ఏమీ కాలేదతనికి, మూడో నిముషంలో గాయం మీద టించర్ పడినట్లు చురక్కుమన్నది చేయి. అదిరిపడి అప్రయత్నంగా చేతిని వెనక్కి లాగుకున్నాడతను. మండుతున్న వేడినీరు పడ్డట్లు ఎర్రగా కందిపోయింది ఆ చేయి.
“చూశావా… మరో పదినిముషాలు ఉంటే ఏమౌతుందో అర్థం అయిందా?” అడిగాడు వినోద్.
అదిరిపోయాడు సుక్కూర్…. కుష్ఠువ్యాధి వచ్చి కాళ్ళు చేతులు నాశనం అయిపోయినవారి ఆకారాలు మనస్సులో మెదిలేసరికి నశించింది అతని ధైర్యం.
“వద్దు….వద్దు” అని అరుస్తూ వెనక్కి జరగబోయాడు.
అదిమి పట్టుకుని, అతన్ని నీటికి మరింత దగ్గరిగా నెట్టాడు వినోద్. “చెపుతాను…చెపుతాను” తనకి తెలియకుండానే పెదవులు విప్పాడు సుక్కూర్.
దారుణమైనటువంటి మలినాలను కలిగి ఉన్న ఆ మురుగుకాలువకు కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ, అతని వదిలిపెట్టాడు వినోద్.
క్షణం కూడా ఆలస్యం చేయకుండా అతనికి కావల్సిన వివరాలన్నిటినీ చెప్పేశాడు సుక్కూర్.
“నన్ను వదిలేయ్….నన్ను ఈ నీటి దగ్గర్నించి అవతలికి తీసుకుపో” అని వేడుకున్న అతన్ని లేపి జీపు దగ్గరికి నడిపించాడు వినోద్.
జీపు వెనుకభాగంలోకి అతన్నినెట్టి అక్కడ రెడీగా ఉన్న ఒక ఇనుపరింగ్కి అతని ఎడమచేతిని ఎటాచ్ చేశాడు ఇన్స్పెక్టర్ వినోద్. ముందు సీట్లో ఉన్న వాటర్బాటిల్ని అందుకుని తను నీళ్ళుతాగాడు. అతని చేతా తాగించాడు. జీప్ డ్రయివర్ని అతని మంచినీళ్ళకోసం పంపించిన మాట సుక్కూర్కి జ్ఞాపకం వచ్చి, విచిత్రంగా చూశాడు.
ఆ చూపుల్ని గురించి పట్టించుకోలేదు వినోద్. ప్యాంటు జేబులో నుంచి సిగరెట్ పాకెట్ని తీసి సిగరెట్ వెలిగించుకుంటూ, తాపీగా నిలుచున్నాడు. పదినిముషాల తరువాత ఒకరి వెనుక ఒకరుగా అక్కడికి వచ్చాడు అతని కానిస్టేబుల్స్.
“ఎవరూ అగుపించలేదు సాబ్, మనల్ని చూడగానే అందరూ మటుమాయం అయినట్లున్నారు” అంటూ రిపోర్టు చేశారు.
“మీరు ఇక్కడే ఉండి ఈ హీరోని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండండి. నేను పదినిముషాల్లో వస్తాను” అంటూ వారందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి, ఇబ్రహీంని మాత్రం తనతో రమ్మని సైగ చేశాడు వినోద్.
“సుక్కూర్ ఏమైనా చెప్పాడా సాబ్?” అతని వెనుక అడుగులు వేస్తూ, మెల్లగా అడిగాడు ఇబ్రహీం.
గండరగండడు అని పేరు పొందిన సుక్కూర్ పెదవులు విప్పి మాట్లాడటం జరగదని అతని ఉద్దేశం….
అతని ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా పొదల్లో అడుగుపెట్టాడు వినోద్. పాము మెలికలు తిరుగుతున్నట్లు వంకరటింకరగా ఉన్న ఒక కాలిబాటను అనుసరించి, అరఫర్లాంగు దూరం పోయాడు.
నలభై యాభై ఇళ్లు మాత్రమే కలిగిన ఒక చిన్నకుగ్రామం ఉన్నది అక్కడ.
కానిస్టేబుల్స్ రిపోర్టు చేసినట్లు నిర్మానుష్యంగానే అగుపిస్తోంది అది ఇప్పుడు.
గ్రామం మధ్యలో ఉన్న పెద్ద కల్లుపాక ముందు ఆగి, పాకలో నిలబెట్టి ఉన్న పెద్ద కల్లుబానవైపు చేయివూపాడు వినోద్. బానను ఎత్తి పక్కన పెట్టాడు ఇబ్రహీం. కింద ఉన్న ఇసుకను పక్కకు లాగాడు.
ఆరు అంగుళాలలోతులో అతనికి ఆగుపించింది ఒక చెక్కపలక. దాన్ని తొలగించగానే కనిపించింది ఒక రేకుపెట్టె.
టూరిస్టులు పోగొట్టుకున్న కరెన్సీ అంతా ఆ పెట్టెలో ఉంది. దాంతోపాటు గోల్డ్చైన్స్, కూడా అందులోనే ఉన్నాయి.
ఆశ్చర్యంగా చూడబోయిన ఇబ్రహీంని అక్కడ నుంచి కల్లుపాక వెనుకభాగంలో ఉన్న కుంకుడు చెట్టు దగ్గరికి తీసుకుపోయాడు ఇన్స్పెక్టర్ వినోద్.
ఆ చెట్టుకున్న పెద్ద తొర్రలో నుంచి టూరిస్టులు కోల్పోయిన కెమెరాలను, వీడియో ఎక్విప్మెంట్ను బైటికి తీయించాడు.
అక్కడితో ఎండ్ అయిపోలేదు ఆ రికవరీ కార్యక్రమం అక్కడికి పాతిక అడుగుల దూరంలో ఉన్న మరో పాకలోంచి, మూడు లక్షలు విలువచేసే మరికొన్ని బంగారు నగలు బైటకి వచ్చాయి.
“పోయిన రెండు మూడు నెలల్లో ఈ చుట్టుపక్కల జరిగిన దారిదోపిడీలకు సంబంధించిన సొత్తు ఇది….” సపరేట్గా లిస్ట్ అవుట్ చేసి, అందరికీ తెలియచేయాలి… వీటి ఓనర్స్‌ని ఐడెంటిఫైచేసి ఫ్రష్‌గా రిపోర్టులు తీసుకోవాలి….అర్థం అయిందా?” సిగరెట్ వెలిగించుకుంటూ అన్నాడు వినోద్.
రెండు మూడు పొదల్లో వెదికి, గట్టిగా ఉన్న కాన్వాస్ బేగ్నొకదాన్ని సంపాదించాడు ఇబ్రహీం. తమకు దొరికిన సొత్తును ప్యాక్ చేసి భుజం మీద వేసుకున్నాడు.
జీప్ దగ్గర నిలబడి అసహనంగా చూస్తున్న కానిస్టేబుల్ కళ్ళు ఆశ్చర్యంతో వెడల్పు అయ్యాయి. అతను తీసుకువచ్చే జీప్‌లో పెట్టిన ఆ బేగ్‌ని చూసేసరికి.
తలవంచుకుని కూర్చున్న సుక్కూర్ వంక, తన వంకా వాళ్ళు మార్చి మార్చి చూస్తూ ఉండటాన్ని గమనించి కూడా, గమనించనట్లే గంభీరంగా జీప్‌లో కూర్చున్నాడు ఇన్స్పెక్టర్ వినోద్. జీప్ని కదిలించి వేగంగా నడిపాడు డ్రయివర్.
రెండు గంటల తరువాత సిటీలో ప్రవేశించి, తమ స్టేషన్ ముందు ఆపాడు.
సుక్కూర్ని లాకప్‌లోకి నెట్టించి, రికవరీ కార్యక్రమం తరువాత చేయవలసిన పనులన్నిటినీ పర్ఫెక్ట్గా చేసి బద్ధకంగా ఒళ్ళు విరుచుకున్నాడు ఇన్స్పెక్టర్ వినోద్.
“నేను ఇంటికి పోతాను. ఏదైనా అవసరం అయితే వెంటనే కబురుచేయండి “ అంటూ ఒక గంట తరువాత తాపీగా స్టేషన్లో నుంచి బయటికి వచ్చాడు.
రెడీగా ఉన్న జీప్‌లో కూర్చోకముందే వేగంగా వచ్చి స్టేషన్ ముందు ఆగింది ఒక ఆటో… అందులోనుంచి కిందికి దూకాడు అయిదేళ్ళ వయసున్న అతని కుమారుడు కిరణ్. బుడిబుడి నడకలతో కిందికి దిగి, అతన్ని అనుసరించి వచ్చింది మూడేళ్ళ ఆర్తి.
“పరిగెత్తకండి..పడిపోతారు దెబ్బలు తగులుతాయి” ఆందోళన నిండిన కంఠంతో హెచ్చరిస్తూ వారి వెనుకగా ప్రత్యక్షమైంది అతని భార్య నీలిమ.
వేగంగా వచ్చి తన పాదాలను చుట్టుకున్న బిడ్డలనిద్దరినీ ఒకేసారి పైకి ఎత్తి గుండెలకు అదుముకుంటూ అర్థాంగివైపు ప్రశ్నార్థకంగా చూశాడు వినోద్.
“స్టేషన్‌కి వస్తే మీరు ఇంటిని గురించి, ఇంట్లో వాళ్ళని గురించి మర్చిపోతారని నాకు తెలుసు. అందుకే వచ్చాను” చిన్నగా నవ్వి, అన్నది ఆమె.
మరికొంచెం అయోమయంగా చూడబోయిన వినోద్‌కి జ్ఞాపకం వచ్చింది అసలు విషయం. అతని బిడ్డ ఆర్తి బర్త్‌డే ఫంక్షన్ ఆ మరునాడు ఉన్నది. అందుకు చేయవలసిన ఏర్పాట్లు చాలా ఉన్నాయి.
“పిల్లలిద్దరికీ కొత్తడ్రెస్లు ముందు తీసుకోవాలి. ఆర్తికి గోల్డ్‌చైన్ కావాలి. పార్టీకి అవసరమైన స్నాక్స్‌కి, డ్రింక్స్‌కి ఆర్డర్ ఇవ్వాలి. .ఈ విషయాలన్నిటినీ తీరికగా చర్చించుకోవడానికి మీరు త్వరగా ఇంటికి రావాలి” అని ఆరోజు ఉదయం డ్యూటీకి బయలుదేరే ముందు ఒకటికి పదిసార్లు చెప్పింది అతని భార్య.
“అయామ్‌సారీ నీలూ…. అనుకోని విధంగా ఒక కేసును అటెండ్ కావాల్సివచ్చింది. ఆ సందడిలో నువ్వు చెప్పింది మర్చిపోయాను” తన పొరపాటును నిజాయితీగా ఒప్పుకుంటూ అన్నాడతను.
“ఆ సంగతి నాకు తెలుసు కాబట్టే ఆటోలో బయలుదేరి వచ్చారు. ఇప్పటికైనా మీకు తీరికైతే, అలా ఒక రౌండ్వేసి రావచ్చు” అన్నది అతని భార్య.
“యువ్వార్ గ్రేట్ నీలూ! లెట్జ్ గో….” అంటూ బిడ్డలిద్దరినీ తిరిగి ఆటోలో కూర్చోబెట్టాడు వినోద్.
“ఆటో ఎందుకు సార్? మన జీప్‌లో వెళ్ళచ్చుకదా” అని అనబోయి, అతను చురుకుగా చూడటంతో ఆ మాటల్ని మధ్యలోనే మింగేశాడు జీప్ డ్రయివర్.
ఆ స్టేషన్‌కి వచ్చిన మరుక్షణం నుంచే పరమ కరోడా అనిపేరు తెచ్చుకున్న ఇన్స్పెక్టర్ సాబ్ తన ఆటోలో కూర్చునేసరికి ముచ్చెమటలు పట్టేశాయి ఆటో డ్రయివర్‌కి.
“త్వరగా పోనీ….అనవసరంగా ఆరాటపడకు” అతని గాభరా గమనించి మృదువుగా హెచ్చరించాడు వినోద్.
పోతున్న ప్రాణాలు తిరిగివచ్చినట్లు తేలికగా నిట్టూరుస్తూ ఆటోని కదిలించాడు డ్రయివర్. పదినిమిషాల తరువాత ఒక జ్యూయలరీ షాపు ముందు ఆపాడు.
ఆర్తిని ఎత్తుకుని, కిరణ్ చేయిపట్టుకుని షాపులోకి తీసుకుపోయాడు వినోద్. అతన్ని చూడగానే స్వయంగా వచ్చి గౌరవంగా విష్ చేశాడు షాపు యజమాని, తానే రకరకాలయైన నగల్ని చూపించాడు.
ఖరీదైన రాళ్ళు పొదిగిన ఒక నెక్లెస్‌ని చూసి ముచ్చటపడింది ఆర్తి. ఆ పిల్ల బయటికి చెప్పకముందే ఆ విషయాన్ని గమనించాడు కిరణ్.
“ఇది చాలా బాగుంది. తీసుకుందామా డాడీ?” అంటూ తండ్రి ముఖంలోకి చూశాడు.
ఆ మాటలకు వినోద్ సమాధానం చెప్పకముందే కల్పించుకున్నాడు షాపు యజమాని.
“బాబు సెలక్షన్ చాలా భేషుగ్గా ఉన్నది. ఇరవైవేల ఏమంత ఖరీదు కాదు. తీసుకోండి సాబ్….” అంటూ ఆ నగను తీసి కౌంటర్లో పెట్టాడు.
“వద్దు….” ఖచ్చితమైన కంఠంతో అన్నది నీలిమ. “చిన్నపిల్లలకు అంత ఖరీదు నగలు ఇప్పుడు అనవసరం…మూడు నాలుగువేలకు మించిపోవడం నాకు ఇష్టం లేదు” అంటూ ఒక సన్న చైన్‌ని సెలెక్ట్ చేసింది.
బయటికి పేచీపెట్టి అల్లరిచేయకపోయినా ఆర్తి ముఖం చిన్నబోవడం వినోద్‌కి కనిపించింది.
“హౌ ఎబౌట్ ఇట్ నీలూ? కాస్ట్ ఉయ్ ఎఫోర్డ్ ఇట్?” షాపు యజమానికి వినపడకుండా లోగొంతుకతో భార్యను ప్రశ్నించాడు అతను.
“డెఫినెట్‌గా ఎఫోర్ట్ చేయలేము. ఇప్పుడు అంత ఖర్చుపెట్టుకుంటే ఈ సమ్మర్లో మనం ఎక్కడికీ పోకుండా ఇంట్లోనే కూర్చోవాల్సి వస్తుంది. బర్త్‌డే ఫంక్షన్‌ని కూడా డైల్యూట్ చేయాల్సి వస్తుంది. ఖచ్చితమైన కంఠంతో భర్త వినోద్‌తో అన్నది నీలిమ.
ఆ మాటలు తనకు వినిపించకపోయినా, వారి తనర్జనభర్జనలు ఎందుకో అర్థం చేసుకొని దంతాలన్నీ కనిపించేలా నవ్వాడు షాపు యజమాని.
“ఇప్పుడు మీ దగ్గర రెడీకేష్ లేకపోయినా ఫరవాలేదు మేడమ్…. తీరికగా, తాపీగా చెల్లించవచ్చు.. బిడ్డ ముచ్చటను కాదనకండి” అంటూ ఆర్తి ఎంచుకున్న నగనే మరోసారి ముందుకు నెట్టాడు.
ఆశగా చూడబోయిన చెల్లెలి చేతిని గట్టిగా పట్టుకుని వెనక్కిలాగాడు కిరణ్. “మమ్మీ చెప్పింది కరెక్టు.. నువ్వు మరేదీ మాట్లాడకు” చెవిదగ్గర నోరుపెట్టి పెద్ద ఆరింద మాదిరి సలహా ఇచ్చాడు.
తన అన్న చెప్పిన మాటను జవదాటడమనే అలవాటు ఆర్తికి లేదు. “నక్లెస్ వద్దు మమ్మీ….. దాని కంటే చైనే బాగుంది. అదే తీసుకుంటాను” ముద్దు ముద్దు మాటలతో ముచ్చటగా ఆర్తి.
ఆప్యాయంగా కిరణ్ భుజాన్ని అదిమాడు వినోద్. ఆర్తి బుగ్గను పుణికి తన భార్యవంక చూశాడు.
తన బేగ్లో నుంచి కరెన్సీని బయటికి తీసి తను సెలెక్ట్ చేసిన చైన్‌కి బిల్లు చెల్లించింది నీలిమ.
“ఇన్స్పెక్టర్ అయిఉండి ఆఫ్టరాల్ ఇరవైవేలు చేసే నెక్లెస్‌ని తీసుకోవడానికి వెనుకాముందూ ఆలోచిస్తున్నాడు. కారణం ఏమై ఉంటుంది?”. తన షాపులో పనిచేసే గుమాస్తానొకతన్ని అడిగాడు షాపు యజమాని.
“చాలా స్ట్రిక్ట్ అని అంటున్నారు అందరూ. పైసలకు కక్కుర్తిపడే ఘటం కాదని చెపుతున్నారు…” భార్యాపిల్లలతో ఆటోలో కూర్చుంటున్న ఇన్స్పెక్టర్ వినోద్వైపు చూస్తూ చెప్పాడు ఆ గుమాస్తా.
“పైసలకు కక్కుర్తిపడకుండా ముక్కుకు సూటిగా పోయేవాళ్ళు, మన నగరంలో ఎంతకాలం బతకగలరు? ముందు పెద్దపోజు పెడతారు… నెమ్మదిగా అన్నింటికీ అలవాటు పడతారు…”తన అనుభవాలను తలచుకుంటూ కామెంట్ చేశాడు షాపు యజమాని.
ఆ రాత్రి బిడ్డలిద్దరూ నిద్రపోయిన తరువాత నీలిమను అడిగాడు వినోద్.”నెక్లెస్ తీసుకుంటే బాగుండి ఉండేది కదా….. మరి ఎందుకు వద్దన్నావ్?”
“ఈ సంవత్సరం మన దగ్గర ఖచ్చితంగా పన్నెండు వేలు మాత్రమే ఉన్నాయి. బర్త్‌డే ఫంక్షన్‌కి అన్ని ఖర్చులు కలిపి ఏడువేలు అవుతాయి…మిగిలిన డబ్బుతో సమ్మర్లో రెండుమూడు రోజులు ఎక్కడికైనా వెళ్ళి రావచ్చు. ఉన్నవన్నీ ఖర్చుపెట్టుకుని అప్పులపాలు అవడం నాకు ఇష్టం లేదు” అన్నది నీలిమ.
“నెక్ట్స్ ఇయర్ ఆర్తిని స్కూల్లో చేర్చాలి… ఈసిటీలో డొనేషన్స్ చాలా ఎక్కువ. మనం ప్రాబ్లమ్‌ని ఫేస్ చేయక తప్పేటట్టులేదు సాలోచనగా అన్నాడు వినోద్.
“వచ్చే సంవత్సరం ఎదురయ్యే ఇబ్బందుల్ని గురించి ఇప్పటి నుంచి వర్రీ అవడం దేనికి? ఇన్స్పెక్టర్గారి ఆరోగ్యం చెడుతుంది…”నవ్వుతూ అన్నది నీలిమ.
తనుకూడా నవ్వేశాడు వినోద్. ఇక లైటును ఆఫ్‌చేసి బెడ్‌మీద మేనువాల్చబోతున్న సమయంలో వినవచ్చింది కాలింగ్‌బెల్ మోత. అటువంటి డెవలెప్మెంట్స్కి బాగా అలవాటుపడిపోయి ఉండటం వల్ల కొద్దిపాటి చిరాకును కూడా ప్రదర్శించలేదు నీలిమ.
“వెళ్ళండి…. మీ కానిస్టేబిల్స్ ఎవరో వచ్చారు” అంటూ తనులేచి ఆఫ్ చేసిన టైల్‌ని తిరిగి ఆన్చేసింది.
ముఖద్వారం తెరిచిన వినోద్‌కి, వినయంగా నిలబడిన ఇబ్రహీం అగుపించాడు.
“విక్టర్ పంపిన మనుషులు కొందరు స్టేషన్దగ్గరికి వచ్చారు సార్ వాళ్ళ వాలకం చూస్తుంటే మాకు అనుమానంగా ఉన్నది…
End of Preview.
Rest of the book can be read @ http://kinige.com/kbook.php?id=195
Related Posts: