ఆటిజం గురించి… “ఆటిజం ఒక పరిచయం” పుస్తకం పై సమీక్ష

ఆటిజం‘ ఉన్న పిల్లల్ని పెంచడం కన్నవారికి ఓ సవాలు. ఆ వ్యాధి పట్ల తగినంత అవగాహన ఉండాలి. అవగాహన అన్నది ఆ పసివాడి తోబుట్టువులకూ విస్తరించాలి. ఎందుకంటే, మిగతావాళ్లలా ఆ పిల్లలు గడగడా మాట్లాడలేరు, అడిగినవాటికి జవాబివ్వలేరు, నేస్తాలకు ఫలానా అని చెప్పుకోడానిక్కూడా నామోషీగా అనిపించవచ్చు. దానికితోడు, అమ్మానాన్నలు అవతలివాళ్ల మీదే ఎక్కువ శ్రద్ధపెడుతున్నారన్న అపోహ. ఆ అంశాలన్నింటినీ సోదాహరణంగా వివరించి, పరిష్కారాల్ని సూచించే పుస్తకమిది.

- పవన్,ఈనాడు – ఆదివారం,25-1-2015.

FireShot Screen Capture #107 - 'Eenadu - Latest book releases' - archives_eenadu_net_01-25-2015_Magzines_Sundayspecialinner_aspx_qry=pustaka

ఆటిజం ఒక పరిచయం” పుస్తకం డిజిటల్ రూపంలో కినిగె లో లభిస్తుంది. కినిగె వెబ్‌సైట్ ద్వారా ఆర్డర్ చేసి ప్రింట్ పుస్తకాన్ని తగ్గింపు ధరకి పొందవచ్చు. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్‌ని అనుసరించండి..

ఆటిజం ఒక పరిచయం on kinige

AutismOkaParichayam600

 

Related Posts:

ఆసక్తి రేపే పుస్తకం – “ఇండియాలో దాగిన హిందుస్థాన్ ” పుస్తకంపై సమీక్ష

గతం నుంచి వర్తమానం , వర్తమానం నుంచి భవిష్యత్తు నిర్మితమవుతాయి. చరిత్ర కూడా ఇలాగే అడుగులు వేస్తూ వెళుతు౦ది .ఒక్కోసారి తప్పటడుగులు కూడా . అయితే తప్పటడుగులు వేసిన వారికి తను తప్పిదాలు తెలియకపోవచ్చు . ము౦దు తరాల వారు వాటిని గుర్తిస్తారు . గా౦ధీలో ఉన్న హి౦దుత్వ భావనే దేశ విభజనకు కారణమై౦దని ఆ తరువాత నెహ్రూ దానిని పెంచి పోషించాడని అ౦టారు . పెరి అ౦డర్సన్ ఆ౦గ్లో-ఐరిష్ రచయిత .ప్రముఖ మార్కిష్టు మేధావి . ఆయన గత౦లో ‘ఇండియన్ ఐడియాలజీ’ ఇ౦గ్లిష్‌లో రాసిన పున్తకమే ఇప్పుడు ‘ఇ౦డియాలో దాగిన హి౦దుస్తాన్‘ పేరుతో అనువాదమై వెలువడింది. ఈ పుస్తకంలోని అంశాలను మనం సమర్థించవచ్చు లేదా విమర్శించవచ్చు కాని చర్చి౦చాల్సిన విషయాలు కొన్ని ఇలా ఉన్నాయి.

ఇ౦డియా అన్న భావనే యారప్ ను౦చి స౦క్రమి౦చి౦ది . ఎ౦దుక౦టే అ౦తకు ము౦దు చిన్న చిన్న రాజ్యాల సమూహ౦ . అ౦దుకే బ్రిటీష్ వాళ్ళు సులభ౦గా జయించి ఒక్కటి చేశారు .

లౌకికవాదాన్ని అనుసరించే కా౦గ్రెస్ పార్టీ పగ్గాలు గా౦ధీకి చేతికి వచ్చిన తరువాత పురాణాలు ,మత ధర్మశాస్త్రాలను చొప్పించి ఆయనకు తెలియకుండానే హిందుత్వను అమలు చేశారు . గాంధీ పట్ల ముస్లింల అపనమ్మకానికి ఇది బీజం వేసింది . మున్ముందు ఇది దేశ విభజనకు దారి తీసింది .

1922 లో చౌరీచౌరాలో పోలీసులపై హింస జరిగినందుకు దేశవ్యాప్త ఉద్యమాన్ని నిలుపుదల చేయించిన గాంధీ, రెండవ ప్రపంచయుధ్ధాన్ని సమర్ధించడమే కాక సైన్యంలో చేరమని కూడా పిలుపునిచ్చారు .  ఆయన అహింసాయుధంపై ఆయనకే స్పష్టత లేదు.

అ౦టరానివాళ్ళకు ప్రత్యేక నియోజకవర్గాలను మ౦జూరు చేస్తూ బ్రిటిష్ జారీ చేసిన ఉత్తర్వులను ఉపస౦హరించుకునేలా గా౦ధీ చేశారు . నిస్సహాయ స్థితిలో అ౦బేద్కర్ కూడా గా౦ధీకి లొ౦గిపోయారు . ఈ విషయమై చనిపోయేవరకూ అ౦బేద్కర్ బాధ పడుతూనే ఉన్నారు .

నెహ్రూకి గాఢమైన మత విశ్వసాలు లేకపోయినా అనేక విషయాలలో గా౦ధీ హి౦దుత్వనే ఆయన అనుసరి౦చాడు. కాశ్మీర్ విషయ౦లో నెహ్రూ చేసిన తప్పిదాల వల్లే ఈనాటికీ రక్తం ఏరులై పారుతోంది . వ్యక్తిగత ఇష్టాయిష్టాలను రాజకీయాలకు ముడిపెట్టే అలవాటు నెహ్రూకి ఉ౦ది . బహిర౦గ సభలో నాగాలా౦డ్ ప్రజలు తనకి పిరుదులు చూపి౦చి అవమాని౦చారనే కోప౦తో ఆయన నాగాలా౦డ్ కర్కశంగా ప్రవర్తి౦చారు (గా౦ధీ అన౦తర భారతదేశం పుస్తక౦లో రామచంద్ర గుహ కూడా ఇదే చెబుతారు).

మతతత్వం వల్ల లబ్ది చేకూరుతు౦దనుకు౦టే బిజెపి , కాంగ్రెస్ ఒకే రకంగా వ్యవహరిస్తాయి . 2002 లో గుజరాత్‌లో చనిపోయిన వారికంటే 1984 లో ఢిల్లీలో జరిగిన ఊచకోతలో చనిపోయిన వాళ్ళ సంఖ్యే ఎక్కువ . రాజకీయాలపై ఆసక్తి ఉన్నవాళ్ళందరూ చదవాల్సిన పుస్తకమిది .

 

                                                         – జి.ఆర్.మహర్షి , సాక్షి – సాహిత్యం , 18-10-2014.

IndiaLoDaginaHindusthan

 

ఇండియాలో దాగిన హిందుస్థాన్” పుస్తకం డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. కినిగె వెబ్‌సైట్ ద్వారా ఆర్డర్ చేసి ప్రింట్ పుస్తకాన్ని తగ్గింపు ధరకి పొందవచ్చు. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్‌ని అనుసరించండి.

ఇండియాలో దాగిన హిందుస్థాన్ on kinige

IndialoDaginaHindusthan600

Related Posts:

చదవాల్సిన పుస్తకం: మనీప్లాంట్

ఇతర భాషా కథల్ని తెలుగువారికి పరిచయం చేస్తున్న రచయితల్లో ముందువరుసలోని కథకుడు – కొల్లూరి సోమ శంకర్. సోమ శంకర్ అనువాద కథల సంపుటి – ‘మనీప్లాంట్‘.
కొన్ని ప్రత్యేకతలని సంతరించుకుని, ఒక విలక్షణ గ్రంథంగా మనముందుకొచ్చింది – ఈ ‘మనీప్లాంట్’.

ఈ పుస్తకానికి “వికసించిన అనువాద సృజన” అని గుడిపాటి ముందుమాట ఉంది. పుస్తకంలోని ప్రత్యేకతల్లో మొదటిది ఈ ముందుమాట.

తెలుగులో చక్కని వచనం రాయటం చక్కని కవిత్వం రాయటం కంటే కష్టం. ‘శైలి రచయిత వ్యక్తిత్వం’ అంటారు. కొంతమంది శైలి బాగా incisive గా వుంటుంది. అతి తక్కువ అక్షరాల పదాలు, అతి తక్కువ పదాల వాక్యాలు, భావం వాటి వెంట పరిగెత్తుతుంది. ప్రతిపాదిస్తున్న అంశం మళ్ళీ గాఢంగా అందుతూ వుంటుంది పఠితకి.
ఇంతటి శక్తివంతమైన శైలి తెలుగు రచయితల్లో చాలా తక్కువ మందిలో చూస్తాము.

గుడిపాటి అభిప్రాయభాగాన్ని ఉదహరిస్తున్నాను. చూడండి. “జీవితం అందరికీ ఒకేలా ఉండదు. మనుషులు తార్కికంగా, హేతుబద్ధంగా ప్రవర్తించరు. సహేతుకంగా ఉండాలని ఆశించడం తప్పుకాదు. కానీ ఉండలేకపోవడమే జీవిత వాస్తవం. తమలా ఎదుటివారు ఆలోచించాలని, నడుచుకోవాలని మనుషులు ఆశిస్తూంటారు. కానీ అలా ఎవరూ ఉండలేరు. నిజానికి తాము ఎలా ఉండాలనుకుంటున్నారో అలా కూడా ఉండలేరు. కారణాలేమయినా, మనుషుల్ని ఉద్వేగాలే నడిపిస్తాయి. అందుకే ఒక తీవ్రతలోంచి మరో తీవ్రతలోకి ప్రయాణిస్తారు. ఈ మనిషి చచ్చిపోతే బాగుండును అనుకున్న మనిషి పట్లనే అవాజ్యమైన ప్రేమ కలుగుతుంది. అదెలా సాధ్యమనే ప్రశ్నకు హేతువు సమాధానం చెప్పదు. జీవితమే దాని సరైన జవాబు. ఇలాంటి జీవిత సత్యాన్ని చెప్పే కథలు ఈ పుస్తకంలో ఉన్నాయి”.

భావాస్పదమైన పదాల పోహళింపు, భావ విపులీకరణ – రెండూ అద్భుతంగా నిర్వహించబడిన రచనా పరిచ్ఛేదం ఇది.

ఇక, గుడిపాటి వ్యక్తం చేసిన జీవన తాత్వికతకి వస్తే – ఇది పూర్తిగా భౌతిక వాస్తవికత పునాదిగా కల్గిన అవగాహన. మనిషి బహిరంతర వర్తన, ఆలోచన – వీటికి గల పరిమితి, వీటి మీద external and internal forces ప్రభావాలు – అన్నీ సద్యస్ఫూర్తితో ఆకళించుకుని చెప్పిన ఒక గొప్ప అభిప్రాయంగా అంగీకరిస్తాము దీన్ని.
జీవితం పట్ల ఒక తాత్విక వివేచనని సముపార్జించుకోకుండా, అధ్యయన రాహిత్యంతో కథల్ని పునాదులు లేని మేడలుగా నిర్మించబూనడం – ఆరుద్ర అన్నట్లు ‘బంతి లేకుండా ఫుట్‌బాల్ ఆడడం’ వంటిది. జీవితం, జీవన విధానం, గతి – సరళరేఖ కాదు. దీన్ని గమనించకుండా, ప్రతీ సంఘటనకీ, కథలోని ప్రతీ పాత్రకీ కార్యకారణ సంబంధాల్ని అంటగట్టాలని కృతకమైన రీతికి తలపడడం – కథౌచిత్యాన్ని దెబ్బతీస్తుంది.

గుడిపాటి వ్యక్తం చేసిన అభిప్రాయాలతో ఏకీభవించేవారు – అటు పాఠకుల్లోనూ, ఇటు కథకుల్లోనూ అధిక సంఖ్యలో ఉన్నారు. అయితే ఈ అంశాన్ని ఇప్పుడు గుడిపాటి చెప్పినంత స్ఫుటంగా, ఇంత సరళంగా, ఇంత శక్తివంతంగా – తెలుగు కథా సాహిత్యంలో ఎవరూ చెప్పలేదు. గుడిపాటి చెప్పిన ఈ అంశాన్ని కొత్తకథకులు అర్థం చేసుకోవాల్సిన అవసరం వుంది.

‘మనీప్లాంట్’ పుస్తకంలోని Contents విషయానికి సంబంధించి కూడా కొన్ని ప్రత్యేకతలని చూద్దాం. ‘పట్టించుకోని వాళ్ళయినా వాస్తవాలని ఎదుర్కోక తప్పదు’ అంటాడు ఆల్డస్ హక్స్‌లీ. మనకు బాగా దూరంగా నివసించే ప్రజల గురించీ, వారి జీవన విధానాన్ని గురించీ, స్థితిగతులను గురించీ మనం ఎక్కువగా పట్టించుకోము. కానీ, అవే మనకూ తారసపడవచ్చు. మనమూ వాటిని ఎదుర్కోవలసి రావచ్చు. కనుక, ఆయా స్థితిగతుల్ని మనమ్ ముందుగానే పరిచయం చేసుకొని వుంటే, నిజజీవితంలో ఆయా సంభవాలు ఎదురయితే, వాటిని ఎదుర్కోడం సుళువవుతుంది. అంటే మానసికంగా తయారై వుండటమన్న మాట. ఇతర భాషాసాహిత్య పఠనం ఇందుకు బాగా వుపయోగపడుతుంది. అందునా కథలు – వివిధ జీవన పార్శ్వాల మెరుపుల్నీ, మరకల్నీ, మనకు గాఢతతో అందించగలవు; మన ఆలోచనల విస్తృతికి దోహదం చేయగలవు. ఇదీ అనువాద కథల ప్రయోజనం.

ఈ పుస్తకానికి “అనువాద ‘కథం’బం” ముందుమాట కూర్చిన కె. బి. లక్ష్మి ఇదే విషయాన్ని ఇలా చెప్తున్నారు, “స్నేహాలు, రాగద్వేషాలు, ఈర్ష్యాసుయలు, కలిమిలేములు, కష్టసుఖాలు, వినోద విలాసాలు – వగైరాలు విశ్వమానవులందరికీ సమానమే. ఏ భాష వారు ఆ భాషలో ఘోషిస్తారు”. కనుక, ఆ ఘోషల మూలాల్ని అర్థం చేసుకోడానికి ఈ కథలు తోడ్పడుతాయి.

‘మనీప్లాంట్’ లోని మరో ప్రత్యేకత ఇందులోని కథలన్నీ – వర్తమాన సమాజ జీవన దృశ్యాల సమాహారం. ఎంతో నేర్పుతో – ‘ఈనాటి’ జీవితాల్నీ, వ్యక్తిగత ధోరణుల్నీ, సాంఘికంగా సంక్లిష్టతలని కల్పిస్తున్న రీతి రివాజుల్నీ – ఈ కథల్లో దర్శింపజేసాడు, సోమ శంకర్. కథల్ ఎన్నిక – ఆ విధంగా ఎంతో చాకచక్యంగా నిర్వహించాడు.
“లుకేమియా”తో బాధపడుతున్న క్లాస్‌మేట్ గుండుకు తోడు సహానుభూతితో తానూ గుండు చేయించుకున్న చిన్నపిల్ల సింధు కథ ‘పెరుగన్నం’తో మొదలుపెట్టి, శూన్యభట్టాచార్య పేరుతోనే సున్నాగాడుగా స్థిరపడి – జీరోగా గేలిచేయబడిన ‘శూన్య’ చివరికి గురువుగారి సాంత్వనలో “నేనంటే నాకెంతో గర్వంగా ఉందీ రోజు” అనుకునే స్థితికి ఎదిగిన “సున్నాగాడు” వరకూ – ఒక్కొక్క కథ ఒక్కొక్క మణిపూస.

మారిస్ బౌడిన్ జూనియర్ అనే రచయిత – కథకునికి ఆవశ్యకమైన విశిష్ట దృక్పథాన్ని గురించి రాస్తాడు ఒకచోట. అనువాద కథనే రాస్తున్నా – సోమ శంకర్‌లో ఈ విశిష్ట దృక్పథం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.

మూల కథలోని వాతావరణాన్నీ, పరిసరాలని అవగతం చేసుకుని, మూల కథా రచయిత కంఠస్వరాన్ని గుర్తెరిగి, ఆ భాషాసౌందర్యానికి భంగం కలగకుండా, నుడికారాన్ని చెడగొట్టకుండా – అనువాదం నిర్వహించారు సోమ శంకర్.

కథకుని లక్ష్యశుద్ధీ, చిత్తశుద్ధీ – పుష్కలంగా ద్యోతకమవుతున్న గొప్ప కథా సంపుటి ‘మనీప్లాంట్’. అందుకే ఇది కొని చదివి దాచుకోవాల్సిన పుస్తకం.

విహారి (చినుకు మాసపత్రిక, ఆగస్టు 2008 సంచిక నుంచి)

* * *

“మనీప్లాంట్” డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. మనీప్లాంట్ పుస్తకాన్ని కినిగె వెబ్‌సైట్ ద్వారా ఆర్డర్ చేసి తగ్గింపు ధరకి పొందవచ్చు. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్ చూడండి.

మనీప్లాంట్ On Kinige

Related Posts:

నిజానికివి వేట కథలు (పర్యావరణ కథలు – సమీక్ష)

ప్రఖ్యాత కన్నడ రచయిత కువెంపుగారి కుమారులైన పూర్ణచంద్ర తేజస్వి అనతికాలంలోనే తన రచనల ద్వారా తండ్రిని మించిన తనయుడిగా పేరుపొందారు. పూర్ణచంద్ర తండ్రి ప్రభావం తనమీద పడకూడదన్నట్లుగా రామమనోహర్ లోహియా, లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణగార్ల సమాజవాద సిద్ధాంతాల ఆకర్షణకు లోబడి కులాంతర వివాహం చేసుకుని రైతుపోరాటాల్లో ముఖ్యపాత్ర నిర్వహిస్తూ, ఘోరారణ్యం చెంతన పొలం కొని కాఫీ ఎస్టేట్‌గా దాన్ని మలచి ఎక్కువ శాతం తన హాబీలైన ఫోటోగ్రఫీ, పరిసర అధ్యయనం, భూమిపుత్రుల జీవితాలు, సంగీతం, చిత్రలేఖనం, మొదలైన వాటిలో మునిగి వీలు కుదిరినప్పుడు రచనల్ని చేస్తుండేవారు. కాఫీ ఎస్టేట్ వేసేందుకు వచ్చిన రచయిత తుపాకీ భుజం మీద వేసుకుని రోజంతా టామీ అనే కుక్కతో అడవిలో శికారు చేయడం దినచర్యగా మారింది. అలా అక్కడ ఉంటూ అడవితో పొందిన అనుభవాల్ని ఇలా కథల రూపంలో అందించారు.
మలైనాడులోని అడవి, వన్యప్రాణులు, వేట గురించిన ఆసక్తికరమైన విషయాలను ఈ కథల్లో రికార్డు చేశారు. ఇందులో రచయిత అతని వద్ద పనిచేసే ప్యారడు, మారడు, టామీ అనే పెంపుడు కుక్క ప్రధాన పాత్రలుగా ఈ కథనాలు కొనసాగుతాయి.

ఒక రాత్రి అడవిలో మొరుగుతున్న టామీ అరుపులు విని వెళ్ళిన రచయితకు, అది ‘ఉడుం’తో చేస్తున్న పోరాటం కనిపిస్తుంది. ఆ ఉడుంను పట్టుకుని తాడుతో చెట్టుకి కట్టివేస్తే, అది పాక్కుంటూ చిటారు కొమ్మను చేరుకుంటుంది. తాడుతో దాన్ని ముగ్గురు గుంజినా కిందపడదు. దాంతో ఉడుం పట్టు అంతే ఏమిటో తెలిసివస్తుంది. ఈ కథలో ఉడుం జీవన విధానం గురించి, దానికి సంబంధించిన ఎన్నో విశేషాల గురించి సందర్భోచితంగా వివరిస్తారు. “టామీతో ఒకరోజు” కథలో ఇంగ్లీష్ రీడరిఅన మిత్రుడొకరు శ్రీరామ్‌తో కలసి అడవికి వేటకెళ్ళి అడవి పందిని కొట్టుకొచ్చిన విధానాన్ని కళ్ళకు కట్టినట్లుగా చిత్రీకరించారు. అడవి జంతువులు విపత్కర పరిస్థితులలో అసాధారణంగా మసలుకుంటాయనీ వాటి గురించి, వాటి “దెయ్యం కోడి” లో చూడవచ్చు. ప్రతీ వేసవిలో రచయిత ఇంటివద్ద ఎదురయ్యే పాముల నుంచి ఎన్నో నష్టాలను ఎదుర్కొంటారు. ఒక వేసవిలో నాగుపాము సృష్టించిన భయోత్పాతాన్ని, దాన్ని చివరకు ఎలా పట్టుకున్నారో ఆసక్తికరంగా వివరించే కథ “కాళప్పగారి కోబ్రా”. అయిదు గ్రామాలను పీడించే కోతుల సమస్య గురించి చర్చించిన కథ “గాడ్లి”. రామలక్షమ్మగారి తోట మేనేజర్‌గా పనిచేస్తున్న గాడ్లి కోతులను పారద్రోలడానికి పడిన పాట్లను, ఆయన భంగపాటును ఈ కథ వివరిస్తుంది. ఒక్కొక్క వన్యప్రాణికి ఒక్కొక్క రకమైన విచిత్ర రక్షణ తంత్రం ఉంటుంది. కప్పలు, తాబేలు, అడవిపంది అవలంబించిన రక్షణ విధానాలు “చెరువు ఒడ్డున” గమనిస్తున్న రచయిత దృష్టి నుండి తప్పించుకోలేకపోతాయి. దెయ్యాలు ఉన్నాయో లేవో తేల్చడానికి స్మశానికి వెళ్ళివస్తుండగా, చిన్న గజ్జి కుక్కపిల్ల వెంటబడుతుంది. దెయ్యమే ఆ రూపంలో వస్తుందని, దాన్ని వదిలించుకోవాలని ఎంతగా ప్రయత్నించినా అది వెంటబడడాన్ని “మాయామృగం”గా వర్ణిస్తారు. అనేక సందర్భాలలో ప్రాణులు మరియు వృక్షాలకు సంబంధించిన ఎన్నో కథలు నిదానంగా జనం మనస్సుల నుంచి తొలగిపోయినా, అప్పుడప్పుడు వాటి మీద కలిగే ఇష్టాయిష్టాల నుంచి అవి జనం మనసులో అలాగే ఉండిపోతాయి. కొన్నిసార్లు ఏదో కథలోని దృష్టాంతం నిరూపణగా లేకపోయినా, కొన్ని జంతువుల నడవడిక మీద ఏర్పడే దురభిప్రాయాలు అలాగే ఉండిపోతాయని అనేక ఉదాహరణలో వివరించిన కథ “సైతాన్ నుంచి ప్యారడికైన నష్టం”, “సుస్మిత మరియూ చిన్న పక్షిపిల్ల” కథలు పక్షుల ఫోటోలు తీయడం ఎంత కష్టమో, వాటిని సాకడం కూడా అంతే కష్టమని రచయిత తన అనుభవాలతో వివరిస్తారు. “ఔషద తీగ”, ఇదొక విచిత్రమైన మూలికాతీగ కథ. అడవిలోని దట్టమైన పొదలలో కనిపించే ఈ తీగ అవసరమైన వారికి ఓ పట్టాన కనిపించదు. ఈ తీగ గురించి ఉండే అబద్ధాలు, నిజాలు, కల్పనలోని కథలు…. వీటన్నింటి గురించి రచయిత చేసిన సత్యాన్వేషణే ఈ కథగా రూపొందింది.

ఈ కథలన్నీ అడవి – అటవీ సంపద, వన్యమృగాలపై ఆధారపడిన ప్రజల అవసరాలు, అనుభవాలను తెలియజేస్తాయి. రచయిత వీటిని పర్యావరణ కథలన్నారు. కానీ నిజానికివి వేట కథలు. వేటగాడిగా రచయిత అడవిలోని పరిస్థితులు, వన్యప్రాణుల ప్రవర్తనను విశ్లేషిస్తారు. ఆయన చేసిన పరిశీలనలు మనల్ని ఎంతగానో ఆకట్టుకుంటాయి. పనివాళ్ళల్లో, గ్రామాల్లో వున్న మూఢవిశ్వాసాను హేతువాద దృష్టితో నిగ్గుతేల్చి అసలైన సత్యాన్ని తెలుసుకుంటాడు. సంచార జాతుల వాళ్ళయిన “మాస్తి మరియు బైరడు” వేట నైపుణ్యాలను పరికించినప్పుడు, అల్లం శేషగిరిరావు, డిబింగాడు తప్పకుండా జ్ఞాపకం వస్తారు. కన్నడంలో ఈ పుస్తకం 16సార్లు పునర్ముద్రణకు నోచుకుందట. ఈ పర్యావరణ కథలు కర్నాటకలో ప్రాథమిక స్థాయి నుండి ఇంటర్ వరకూ ఆయా తరగతుల భాషానైపుణ్యాలకు అనుగుణంగా పాఠ్యాంశాలుగా పెట్టారు. ప్రముఖ అనువాదకుడు శాఖమూరు రామగోపాల్ శ్రమించి ఉస్మానియా విశ్వవిద్యాలయ గ్రంథాలయంలో నిద్రాణమైన ఈ కథలను సంపాదించి, అనువదించి తెలుగువారికి అందిస్తున్నారు. అనువాదం చాలా బాగుంది.

కె.పి. అశోక్ కుమార్
పాలపిట్ట జులై 2012 సంచిక

* * *

“పర్యావరణ కథలు” డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. అంతేకాదు, ఈ కథల సంకలనం ప్రింట్ బుక్‌ని ఇప్పుడు కినిగె ద్వారా తగ్గింపు ధరకి తెప్పించుకోవచ్చు. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్‌ని అనుసరించండి.
పర్యావరణ కథలు On Kinige

Related Posts:

పూర్ణచంద్రతేజస్వి “పరిసర కతెగళు” (పర్యావరణ కథలు) : ఓ పరిచయం

మీ చెప్పులను ఎప్పుడైనా కుక్కలు ఎత్తుకెళ్ళాయా? పల్లెటూళ్ళతో మీకు సంబంధం ఉంటే తప్పనిసరిగా ఈ అనుభవం ఎదురయ్యే వుంటుంది. అయితే వాటి బారిన పడకుండా మీ చెప్పులను రక్షించుకోవాలంటే ఏంచెయ్యాలి? ఎడమ చెప్పు కుడివైపునా , కుడిచెప్పు ఎడమవైపునా ఉంచండి. కుక్కలు వాటివైపు వెళ్ళవు. ఎందుకంటారా? అవి దెయ్యం కాలిజోళ్ళని భయపడతాయి. నమ్మబుద్ధవటంలేదా? పూర్ణచంద్ర తేజస్వి అనే ప్రఖ్యాత కన్నడ రచయిత రాసిన ‘పరిసర కతెగళు’ అన్న కన్నడ కథాసంపుటాన్ని తెలుగుచేసి శాఖమూరి రాంగోపాల్ గారు అందించిన ‘పర్యావరణ కథలు‘ చదవండి. అందులో మరడు ఈ సత్యాన్ని శాస్త్రీయదృష్టిగల తేజస్విగారి ముక్కు పట్టుకుని మరీ చెపుతాడు. ఆయన మన చెవి పట్టుకుని ఆ వైనాన్ని ఓ కథచేసి వినిపిస్తాడు.
ఉడుంపట్టు అనటం వినీ ఉంటారు, అనీ ఉంటారు. ఆ పట్టు ఎలాంటిదో ఎంతటిదో మీరు చూసి ఉండరు. అది కళ్ళకు కట్టినట్టు, మనసుకు ‘ఉడుంపట్టు’ పట్టేటట్టూ చెపుతారు తేజస్వి.
కోతులు వచ్చి ఇళ్లమీదా, దొడ్లమీదా పడి నానాయాగీ చేస్తే మీరేం చేస్తారు? వాటిని చంపెయ్యాలనుకుంటారు. అయితే అవి దైవస్వరూపాలు గదా ఎలా చంపుతాం అంటాడు గాడ్లీ. పాపం ఆ మానవుడు అందుకోసం నానాపాట్లూ పడి ఓ బోను తయారుచేస్తాడు. దానితో వాటిని పట్టుకుని తీసుకువెళ్ళి అడవిలో వదిలెయ్యాలని అతగాడి పథకం. పట్టుకుంటాడు. దైవస్వరూపాలు గదా. అందుకోసం వాటికి తిండి ఏర్పాట్లు చేస్తాడు. తీరా తీసుకువెళ్ళి బోను తెరిస్తే, తిండి మరిగిన ఓ కోతి బయటకు వెళ్ళదు. దానిని బయటకు తరమటానికి తను బోనులోకి వెళ్ళేసరికి పొరపాటున అందులో చిక్కుకుపోతాడు. ఆ గాడ్లీ కథ వింటారా అయితే తేజస్విగారి స్వానుభవాలతో నిండి ఈ ‘పర్యావరణ కథలు’ చదవండి.
పర్యావరణం అన్న పదం తెలుగులో ప్రస్తుతం చెలామణీ ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఈ పదం ఒకటి రెండు దశాబ్దాలుగా వినపడుతోంది. ఈ పదం వ్యక్తంచేసే అంశంలో అనేక ఫిర్యాదులు ఉన్నాయి. వన్యజీవుల అంతర్ధానం, వన్య జీవిత విధ్వంసం అందులో ఒకటి. మన అనుభవజ్ఞులైన ప్రాణుల అంతర్ధానానికి కారణం మానవులమైన మన అత్యాశ. మానవీయ దృష్టితో చూచినా, మన బాగుకోసమే అని గ్రహించినా అవి అంతరించిపోకుండా మనం జాగ్రత్త పడాలి. పౌరులు తమ ప్రభుత్వాలనూ, దేశాలు ధనిక దేశాలనూ ఒత్తిడి చేసి తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నద దీని సారాంశం. వనాలు కొట్టివేసి వానలను తగ్గించి, తద్వారా ఉష్ణోగ్రతలలో మార్పులకు కారణమవుతున్నాం. హానికర రసాయనాల వినియోగంతో మరింత వాతావరణ మార్పులకు దోహదం చేస్తున్నాం. పర్యావరణం అనగానే ఈ అంశాలు, వాదనలూ, వివరణలూ మనలో కదులుతాయి. ఈ పుస్తకం శీర్షిక వాటిని ఎంతోకొంత గుర్తుచేస్తుంది. దీనివల్ల పుస్తకానికి అదనపు అమ్మకపు విలువ చేరుతుందా లేక ఆ దృష్ట్యా చదవాలనుకునే వారికి అసంతృప్తి కలిగిస్తుందా అనేది ప్రశ్నార్థకం.
పోతే- కన్నడిగుల రాష్ట్రకవిగా గౌరవింపబడే కువెంపుగారి కుమారుడు పూర్ణచంద్ర తేజస్వి. 1938లో పుట్టిన వీరు 2007లో కీర్తిశేషులయారు. కవిత్వం, కథ, నవల, నాటకం, యాత్రాసాహిత్యం, అనువాదాలు, విమర్శ, శాస్త్ర -కల్పన (scientific fiction) వంటి అనేక ప్రక్రియలలో సాహిత్య కృషిచేశారు. “అబచూరిన పోస్టాఫీసు” అన్న వీరి కథా సంపుటాన్ని కన్నడ ప్రగతిశీల (progressive) సాహిత్యానికి ఆరంభంగా భావిస్తారు. ఈ పేరుతోనూ, “తబరినకతె” అన్న పేరుతోనూ విడుదలైన సినిమాలు అనేక పురస్కారాలు అందుకున్నాయి. ఈయన చదువు ముగించుకుని లోహియా ప్రభావంతో వ్యవసాయం చేయటానికి పశ్చిమ కనుమలలో తేయాకు తోట కొని వ్యవసాయం చేశారు. అక్కడి అనుభవాలతో తను పరిసరాల ప్రేమికునిగా మారానని, ఆ మారిన విధానాన్ని ఈ కథలలో అర్థంచేసుకోవచ్చని తేజస్వి తన పుస్తకంలోని మొదటి రచనలో ఇలా చెపుతారు. “నేను చెప్పే చిన్నా, చితకా నా స్వంత అనుభవాలలోని సంఘటనలకు, పర్యావరణంకు ఏదో సంబంధాన్ని నేరుగా చూపించలేనండి! అయితే నా బతుకు బాటలో ఇది (ఈ రాతలు) నేను నడచివచ్చిన దారి అని మాత్రం చెప్పగలనండి”. వానలమయమైన పశ్చిమ కనుమలలోని ఓ కుర్రవాని దృష్టినుండి చెప్పిన తొలి కథతోనే రాజ్యోత్సవ పురస్కారం అందుకుని తండ్రి ఛాయనుంచి బయటపడిన తేజస్వి ఈ కథా సంపుటం పదహారు ముద్రణలకు పైగా అమ్ముడుపోయింది “కర్వలు” అనే వారి నవల 26 ఏళ్ళు గడిచినా ప్రతివారం అమ్ముడుపోయే తొలి పది పుస్తకాలలో ఒకటి అంటారు.
ఈ సంపుటంలోని కథలలో పాత్రలు మళ్ళీ మళ్ళీ వస్తుంటాయి. ఇది మనలని పాత్రలకు, కథా వాతావరణానికీ అలవాటు చేస్తుంది. తెలియని విషయాలపట్ల, వ్యక్తుల పట్ల, జీవిత వివరాల పట్ల మనలో ఓ పీపింగ్ టామ్ ఉంటాడు. తేజస్వి దీనిని చక్కగా వాడుకుంటారు. సాహసాలు, అడవులు, వేట వంటి వస్తువులతో తెలుగులో కథలు రాకపోలేదు. ఈ వాతావరణంతోనే మనకు సి.రామచంద్రరావు ఇంతకన్న నేర్పరితనంతో కథలు చెప్పారు. వేట ఇతివృత్తంగా పూసపాటి కృష్ణంరాజు, పతంజలి, అల్లం శేషగిరిరావు వంటి వారు రాసారు. ఏమైనా ఈ పుస్తకంలా అవి పదహారు ముద్రణలు పొందలేదని మనం ఒప్పుకోవాలి. పుస్తకాలు కొని చదవటంలోనూ, మంచి రచయితలకు తమ సృజనతో కడుపు నింపుకునే అవకాశం ఇవ్వటంలోనూ, కన్నడిగులు మనకన్న చాలా ముందున్నారన్నది మనం తలొంచుకుని ఒప్పుకోవలసిన విషయం. కనీసం ఈ పుస్తకం విషయంలోనైనా మనమీదున్న ఈ చెడుపేరు తప్పించుకోటానికి దీనిని కొని చదువుదాం. తెలుగులో మనం చదవాలన్న ఆశతో దీనిపై కాలాన్నే కాక ధనాన్ని వెచ్చించిన శాఖమూరి రాంగోపాల్ గారికి కొని, కృతజ్ఞతలు చెపుదాం.
ఈ పుస్తకం అనువాదం గురించి కూడా ఓమాట అనుకోక తప్పదు. కథా వాతావరణానికి భాష అమిరినా, చదువుకోటానికి కాస్త అడ్డుపడుతుంటూనే ఉంటుంది. కొన్ని కన్నడ పదాలు ప్రతిభటన (ప్రతిఘటన) వంటివి వాడకుండా ఉంటే బాగుండేది.
అలాగే దాదాపు అన్ని కథల వెనుకా ఉస్మానియా విశ్వవిద్యాలయం లైబ్రరీనుండి నిద్రాణమైన కథలు అనటం సరిగా లేదు 16 ముద్రణలు పొందిన కథాపుస్తకాన్ని వెతికి తీసాననటం అనువాదకుని కృషిగా చెప్పవచ్చుగాని, పుస్తకానికి శోభనివ్వదు.

వివిన మూర్తి
(ప్రజాసాహితి మే,2012 సంచిక నుంచి)

* * *

” పర్యావరణ కథలు” డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. ఈ క్రింది లింక్‌ని అనుసరించండి.

పర్యావరణ కథలు On Kinige

Related Posts: