రాలిన కథా కుసుమం

తన రచనలలో మార్మికతకు పెద్దపీట వేసి, కేవలం 15 కథలతోనే చదువరులను అభిమానులుగా మార్చుకున్న త్రిపుర 24 మే 2013 న దివంగతులయ్యారు.

సెప్టెంబరు 2, 1928 నాడు జన్మించిన రాయసం వెంకట త్రిపురాంతకేశ్వర రావు (ఆర్.వి. టి. కె. రావు) ఉరఫ్ త్రిపుర, తన మొదటి కథ 31-5-1963 నాటి ఆంధ్రపత్రికలో ప్రచురించారు. 2012-13 నాటికి త్రిపుర సాహితీసృజనకి యాభై సంవత్సరాలు పూర్తవుతాయి.

త్రిపుర కథల విలక్షణత అయన ఎత్తుగడలో ఉంటుంది, మొదటే అర్థం కాలేదని పుస్తకం పక్కన పడేస్తే మాత్రం కొన్ని అద్భుతమైన కథలని కోల్పోయిన వారవుతారు. మొదట అర్థం కానట్టు అనిపించినా, చదివే కొద్దీ కొత్త భావాలేవో అనుభవంలోకి వస్తున్నట్లు, మళ్ళీ మళ్లీ చదవాలనుకుంటారు పాఠకులు. కథలు సంక్లిష్టంగా అనిపిస్తాయి, వాటి పరిథి పెద్దది – ఫ్లోరిడా, వారణాశి, కేరళ, రంగూన్, థాయిలాండ్, సరిహద్దు ప్రాంతాలు – ఎన్నో చుట్టి వస్తాయి యీ కథలు. జెన్ బౌద్ధం మొదలు నక్సలిజం దాకా అనేక శ్రేణుల్లో తత్త్వచింతన ఈ కథల్లో ఉంది. చదివేకొద్దీ, మరింతగా చదివించే గుణం ఉన్న కథలివి. ఈ కథల్లో సర్రియలిజం, ట్రాన్స్‌పరెంట్ చీకటీ ఉండి అంతర్ముఖీనమైపోయే ఒక కన్ఫెషనల్ ఎలిమెంట్ కనపడుతుందని సుధామ అంటారు.

త్రిపుర కథలే కాకుండా కవితలూ అద్భుతంగా ఉంటాయి. తన 47వ పుట్టిన రోజు సందర్భంగా ” సెగ్మెంట్స్” అనే ఆత్మకథాత్మక దీర్ఘకవితని రాసారు. దీన్ని మరో ప్రముఖ కవి వేగుంట మోహన్ ప్రసాద్ త్రిపుర స్వశకలాలు పేరుతో తెలుగులోకి అనువదించారు. ఫ్రాంజ్ కాఫ్కాకి వీరాభిమాని అయిన త్రిపుర ఆయన ప్రేరణతో, “త్రిపుర కాఫ్కా కవితలు” రాసారు. కాఫ్కా రచనల్లోని నిగూఢత్వం ఈ కవితల్లోనూ గోచరిస్తుంది. ఈ పుస్తకాన్ని “సాహితీమిత్రులు” ప్రచురించారు. 1980 – 1988 మధ్యలో త్రిపుర రాసిన 16 కవితలని “కవిత్వం ప్రచురణలు” వారు “బాధలూ -సందర్భాలూ” అనే శీర్షికతో నవంబరు 1990లో ప్రచురించారు.

“త్రిపుర కథలు, కవితలు, సంభాషణలు, మౌనం ఇవి వేరు వేరు కావు. అవన్నీ కలిసి అల్లే దారులు ఎంతో విస్తారము, సాధారణమైన అనుభవాల కంటె లోతు, అపరిచితమైన సృజనావరణానికి దిక్సూచికల వంటివి” అని అంటారు కనకప్రసాద్.

చక్కని సాహిత్యం ఆస్వాదించాలనే తెలుగు పాఠకులకు ఒయాసిస్సు లాంటివి ఈ త్రిపుర రచనలు.

తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేయడంలో తనవంతు పాత్ర పోషించి, కథనరంగం నుంచి నిష్క్రమించిన త్రిపురకి హృదయపూర్వక నివాళి అర్పిస్తోంది కినిగె.

Related Posts:

త్రిపుర రచనలు

తెలుగు సాహిత్యంలోకి ఓ గుప్పెడు కథలు, కవితలు గెరిల్లాలా విసిరేసి అదృశ్యమైన రచయిత త్రిపుర. 2012-13 నాటికి త్రిపుర సాహితీసృజనకి యాభై సంవత్సరాలు పూర్తవుతాయి. కేవలం 15 కథలతోనే తెలుగు సాహితీరంగంలో తనకంటూ ఓ స్థానం సంపాదించుకుని, తనదైన ముద్ర వేసిన రచయిత త్రిపుర.

సెప్టెంబరు 2, 1928 నాడు జన్మించిన రాయసం వెంకట త్రిపురాంతకేశ్వర రావు (ఆర్.వి. టి. కె. రావు) ఉరఫ్ త్రిపుర, తన మొదటి కథ 31-5-1963 నాటి ఆంధ్రపత్రికలో ప్రచురించారు. ఆ తరువాత 7 కథలు భారతిలో ప్రచురితమయ్యాయి. రాసి కన్నా వాసి మిన్న అని విశ్వసించి 1963 – 1973 మధ్య కాలంలో 13, 1990-91 మధ్యలో 2 కథలు… మొత్తం 15 కథలు వ్రాసారు. వీటిలోని విషయం, శైలి, గాఢత విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి, పలువురిని త్రిపుర అభిమానులుగా మార్చాయి.

మొదటే అర్థం కాలేదని పుస్తకం పక్కన పడేస్తే మాత్రం కొన్ని అద్భుతమైన కథలని కోల్పోయిన వారవుతారు. మొదట అర్థం కానట్టు అనిపించినా, చదివే కొద్దీ కొత్త భావాలేవో అనుభవంలోకి వస్తున్నట్లు, మళ్ళీ మళ్లీ చదవాలనుకుంటారు పాఠకులు. కథలు సంక్లిష్టంగా అనిపిస్తాయి, వాటి పరిథి పెద్దది – ఫ్లోరిడా, వారణాశి, కేరళ, రంగూన్, థాయిలాండ్, సరిహద్దు ప్రాంతాలు – ఎన్నో చుట్టి వస్తాయి యీ కథలు. జెన్ బౌద్ధం మొదలు నక్సలిజం దాకా అనేక శ్రేణుల్లో తత్త్వచింతన ఈ కథల్లో ఉంది. చదివేకొద్దీ, మరింతగా చదివించే గుణం ఉన్న కథలివి.

“ఇవి కథలా?కవితలా? కథల్లాంటి కవితలా? కవితల్లాంటి కథలా?లేక లాక్షణికంగా రెండు ప్రక్రియల మధ్యగా ఉండే మరో కొత్త ప్రక్రియా?” అనే తర్జనభర్జనలు పాఠకులకి తప్పవని పాలగుమ్మి పద్మరాజు గారు అన్నారు.

ఈ కథల్లో సర్రియలిజం, ట్రాన్స్‌పరెంట్ చీకటీ ఉండి అంతర్ముఖీనమైపోయే ఒక కన్ఫెషనల్ ఎలిమెంట్ కనపడుతుందని సుధామ అంటారు. త్రిపుర కథలని డిసెంబరు 2011లో పర్‌స్పెక్టివ్ ప్రచురణలు వారు పున్మర్ముద్రించారు.

త్రిపుర కథలే కాకుండా కవితలూ అద్భుతంగా ఉంటాయి. తన 47వ పుట్టిన రోజు సందర్భంగా “సెగ్మెంట్స్” అనే ఆత్మకథాత్మక దీర్ఘకవితని రాసారు. దీన్ని మరో ప్రముఖ కవి వేగుంట మోహన్ ప్రసాద్ త్రిపుర స్వశకలాలు పేరుతో తెలుగులోకి అనువదించారు. ఈ పుస్తకాన్ని త్రిపుర శిష్యుడు ప్రదీప్ చౌదరి ప్రచురించారు. ప్రముఖ జర్మన్ రచయిత ఫ్రాంజ్ కాఫ్కాకి వీరాభిమాని అయిన త్రిపుర ఆయన ప్రేరణతో, “త్రిపుర కాఫ్కా కవితలు” రాసారు. కాఫ్కా రచనల్లోని నిగూఢత్వం ఈ కవితల్లోనూ గోచరిస్తుంది. ఈ పుస్తకాన్ని “సాహితీమిత్రులు” ప్రచురించారు. 1980 – 1988 మధ్యలో త్రిపుర రాసిన 16 కవితలని “కవిత్వం ప్రచురణలు” వారు “బాధలూ -సందర్భాలూ” అనే శీర్షికతో నవంబరు 1990లో ప్రచురించారు.

“త్రిపుర కథలు, కవితలు, సంభాషణలు, మౌనం ఇవి వేరు వేరు కావు. అవన్నీ కలిసి అల్లే దారులు ఎంతో విస్తారము, సాధారణమైన అనుభవాల కంటె లోతు, అపరిచితమైన సృజనావరణానికి దిక్సూచికల వంటివి” అని అంటారు కనకప్రసాద్.

త్రిపుర కథలని ఆంగ్లంలోకి తర్జుమా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయపడ్డారు ప్రముఖ విశ్లేషకులు రామతీర్థ.

త్రిపుర సాహిత్యం గురించిన వివరాలు సరే, ఆయన వ్యక్తిగత జీవితం మాటేమిటి? ఆయన బాల్యం ఎక్కడెక్కడ గడిచింది? ఆయన ఏం చదువుకున్నారు? బెనారస్ ఎందుకు వెళ్ళారు? ఎక్కడెక్కడ ఉద్యోగాలు చేసారు? ఆయన భార్యాపిల్లల వివరాలేంటి? ఏ మాత్రం నిలకడ లేని ఆయనను త్రిపుర రాష్ట్రం ఎలా కట్టి పడేసింది? ఈ వివరాలన్నీ తెలుసుకోవాలనుందా? అయితే, “త్రిపుర జ్ఞాపకాలు” అనే పేరుతో ప్రముఖ జర్నలిస్ట్ గొరుసు జగదీశ్వర రెడ్డి త్రిపుర గారితో చేసిన ఇంటర్వ్యూ చదవండి.

త్రిపుర సాహిత్యం వైపు మళ్ళడానికి ప్రేరణ ఎవరు? కథలని ఆయన ఎందుకు రొటీన్‌గా రాయలేకపోయారు? భారతికి పంపిన కథ ఆంధ్రపత్రికలోను, ఆంధ్రపత్రికకి పంపిన కథ భారతిలోను ఎలా అచ్చయ్యాయి? ఆయన రాసిన రెండు కథలకి స్ఫూర్తి ఎక్కడిది? ఆయనకున్న సాహితీమిత్రులు ఎవరెవరు? కవితల్ని ఏ సందర్భంలో రాసారు? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు పై ఇంటర్వ్యూలో లభిస్తాయి.

చక్కని సాహిత్యం ఆస్వాదించాలనే తెలుగు పాఠకులకు ఒయాసిస్సు లాంటివి ఈ త్రిపుర రచనలు. త్రిపుర కథలు, కవితలను డిజిటల్ రూపంలో పాఠకులకు అందుబాటులోకి తెచ్చింది కినిగె. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్‌ని అనుసరించండి.

త్రిపుర రచనలు

కొల్లూరి సోమ శంకర్

Related Posts:

త్రిపుర కథలు

“విలక్షణతే… ప్రధాన లక్షణం!” అనే శీర్షికతో త్రిపుర కథలపై సుధామ రాసిన సమీక్ష 8 ఏప్రిల్ 2012 నాటి ఈనాడు ఆదివారం అనుబంధంలో ప్రచురితమైంది.

కేవలం 15 కథలతోనే తెలుగు కథా ప్రపంచంలో తనకొక ఉనికికి ఏర్పరుచుకున్న కథకుడు త్రిపుర అని సుధామ పేర్కొన్నారు.

త్రిపుర కథల విలక్షణత అయన ఎత్తుగడలో ఉంటుందని, ఈ కథలకి తర్జన భర్జనలు తప్పవని త్రిపుర గురించి మరో రచయిత చెప్పడాన్ని సుధామ ఉటంకించారు.
రచయితల రచయిత త్రిపుర అని వ్యాఖ్యనించారు సుధామ.

సమీక్ష పూర్తి పాఠం కోసం ఈ లింక్ అనుసరించండి. లేదా పూర్తి సమీక్షని ఈ దిగువ చిత్రంలో చదవచ్చు.

Tripura Kathalu Review by Sudhama Eenadu 8 April 2012

త్రిపుర కథలు డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది.

కినిగె వెబ్ సైట్ నుంచీ ప్రింట్ బుక్‍ని కూడా ఆర్డర్ చేయవచ్చు. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్ చూడండి.

త్రిపుర కథలు On Kinige

కొల్లూరి సోమ శంకర్

Related Posts:

‘చీకటి గదులు’ కథపై పి. వి. కృష్ణారావు అభిప్రాయం

చక్కని తెలుగు సాహిత్యం ఆస్వాదించాలనే తెలుగు పాఠకులకు ఒయాసిస్సు లాంటివి త్రిపుర కథలు. రాసి కన్నా వాసి మిన్న అని విశ్వసించిన త్రిపుర గారు 1963 – 1973 మధ్య కాలంలో 13, 1990-91 మధ్యలో 2 కథలు… మొత్తం 15 కథలు వ్రాశారు. వీటిలోని విషయం, శైలి, గాఢత పలు విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. ఈ కథలు డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తాయి.

ఈ సంకలనంలోని ‘చీకటి గదులు’ కథపై పి. వి. కృష్ణారావుగారి అభిప్రాయం చదవండి.

* * *

“డెప్త్ సైకాలజీకి సత్తావున్న రచయిత ఇచ్చిన సాహిత్య రూపం ఈ చీకటి గదులు. మనో వ్యాపారాల రహస్యాల కోసం, అంతర్బాహిర్జగత్తుల అనుసంధానం కోసం నిరంతరం అన్వేషించే ఓ ఆలోచనాపరుడి స్థితి వర్ణణ అద్బుతమైన నేపధ్యంతో సాగి పోతూంటే కళ్ల ముందు గెలక్సీలు కదుల్తాయి. భావాల మెరుపులకి భాష ఉరుములకి చలిస్తూ, వివరణ అందని చోట ప్రక్షేపణతో (projection) సమాధాన పడుతూ కథ ముగించే సరికి ఆలోచనలు పాత్రల్ని అధిగమించి రచయిత చుట్టూ తిరుగుతాయి.

సలిపే పంటిని నొక్కినా, అచేతనాన్ని తరచినా ధ్యేయం ఒక్కటే. రిలీఫ్. సాహిత్య కళారూపాల సృష్టిలో సైతం కెథారసిస్ వుంటుంది. ఇమడని వర్తమానంలో భాస్కరం, జీవితంలో పరీక్షా సమయం వచ్చినప్పుడు, కోరివచ్చిన కళ్యాణితో మనిషిగా ప్రవర్తించడు. ఆ తిరస్కారంతో ఎన్నుకున్న జీవితంలో సుఖపడలేక, తెగ్గొట్టుకొని తిరిగి వస్తున్న కళ్యాణిని దయతో, తన జీవితంలో మార్పుకోసం కూడా స్వీకరిద్దామని సంకల్పిస్తాడు. కానీ, కసిగా బ్రతికేసే అతని మిత్రుడు శేషు వల్ల అది జరగదు.

ఈ కథాంశం పునాదిగా త్రిపుర నిర్మించిన మనోజ్ఞహర్మ్యాన్ని రేడియం దారుల్లో నడచి అవలోకిస్తాం. వ్యక్తుల ఇన్స్యులేషన్ని, మెంటల్ ప్రావిన్సెస్‌ని సింబలైజ్ చేసే చీకటి గదుల తలుపులు ఆలోచనలతో, అనుభవాలతో మూసుకోవడం…. తెరచుకోవడం… గమనిస్తాం.

నాకు త్రిపుర అన్నా, ఆయన రచనలన్నా వండర్!”

పి. వి. కృష్ణారావు

త్రిపుర కథలు On Kinige

Related Posts:

‘సఫర్’ కథపై స్మైల్ అభిప్రాయం

చక్కని తెలుగు సాహిత్యం ఆస్వాదించాలనే తెలుగు పాఠకులకు ఒయాసిస్సు లాంటివి త్రిపుర కథలు. రాసి కన్నా వాసి మిన్న అని విశ్వసించిన త్రిపుర గారు 1963 – 1973 మధ్య కాలంలో 13, 1990-91 మధ్యలో 2 కథలు… మొత్తం 15 కథలు వ్రాశారు. వీటిలోని విషయం, శైలి, గాఢత పలు విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. ఈ కథలు డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తాయి.

ఈ సంకలనంలోని ‘సఫర్’ కథపై స్మైల్ గారి అభిప్రాయం చదవండి.

* * *

“ఒక విప్లవ కారుడి కథ యిది కొంత మనిషి కథ, చాలా ఎక్కువగా మనసు కథ. ఇతనికి భార్యా, పిల్లలూ వున్నారు. స్టీరియో సంగీతం, రికార్డులు వున్నాయి, అతను వున్న ప్రదేశానికి రెండు వేల మైళ్ళ దూరంలో, బాబీ, మన్నాసింగ్, మోసీన్, అనిల్, త్రిపాటీ, అందరూ రాజకీయాల్తో ప్రమేయం వున్నవాళ్ళే- దృక్పథాల్లో కొంచెం తేడాతో, బాబీ ట్రేడ్ యూనియనిస్ట్, మన్నాసింగ్ సాయుధ విప్లవాన్ని నమ్మిన నక్సలైట్, బాబీ భార్య మున్నీ, ఓ పిల్లాడి తల్లి, మున్నీ అంటే విప్లవ కారుడుకి విపరీతమైన ప్రేమ- లోపల్లోపల. జీవితంలో వీళ్ళందరి ప్రయాణమే – సఫర్.

ఇదీ యీ కథ ఔట్ లైన్. స్వగతంలో కథ సాగుతుంది కాబట్టి ‘అనగనగా’ కథల్లా మొదలవదు. ‘అందరూ సుఖంగా వున్నారు’ అంటూ అంతమవదు. మొదటి వాక్యం నుంచే విప్లవ కారుడి, మానసిక ప్రపంచంలోకి వెళ్ళాలి మనం. ఇతనికి బాబీ భార్య మున్నీ అంటే చాలా ప్రేమ అని కూడా వెంటనే తెలుస్తుంది మనకి. ఆవిడకీ ఇతనంటే అభిమానం వున్నట్టే కన్పిస్తుంది. ఇతనికి విపరీతమైన గిల్టీ ఫీలింగ్. స్నేహితుడికి ద్రోహం చేస్తున్నానేమోనని. దూరంగా వున్న తన వేయి కళ్ళ సుశీలకి ద్రోహం చేస్తున్నానేమోనని. విప్లవానికి ద్రోహం చేస్తున్నట్లు అతను అనుకుంటున్నట్లు కన్పించదు – విచిత్రం! ఎందుకంటే – ‘ఏ దేశంలోనైనా. ఏ మనిషేనా, ఏ కారణానికేనా రోదిస్తుంటే నీ హృదయం వింటుంది, నీ మనసు దానికి కంపిస్తుంది’ – అని అనుకుంటాడు. కథంతా కూడా, ఇతని ఆలోచన అంతా కూడా – మున్నీ చుట్టే తిరుగుతూ . మున్నీ అంటే ‘దాహం’ తన ‘దాహంలో ద్రోహం’ అనుకుంటాడు- విస్కీ మత్తులో. అతను చాలా చీకటిగా ఆలోచించ గలడన్న సంగతి మనకి కథ మొదటే తెలుస్తుంది. ‘నువ్వు సీజర్‌వి కావు’. అని అనుకుంటాడు తన గురించి మొట్టమొదటే – వెంటనే ‘జూడాస్‌వి అవగలవు కాని, అది కూడా యిప్పటి దాకా’ అని వెంటనే అనుకుంటాడు. ఈ రెండు ముక్కల్లో అతని మానసిక స్థితిని తెలుసుకోవచ్చు. విస్కీతో తనలో ఎన్నో గదుల్ని ఆవిష్కరించుకుంటాడు. లోనికెళ్తాడు. వస్తాడు – గ్లూమీగా? మున్నీ కావాలి – వద్దు – కావాలి – వద్దు – స్నేహితుడికి ద్రోహం చెయ్యాలా?వద్దా? చేస్తేయేం ? వద్దు చెయ్యలేను. జూడాస్‌వి అవగలవు కాని, అవవు, ‘అది నీ డెస్టినీ.’ అని జాలిపడి సరిపెట్టుకుంటాడు. మానసికంగా అదొక డెస్టినీ. ఇదే కాదు అతని డెస్టినీ. భౌతికంగా యింకోటి కూడా వుంది. అది ‘దైన్యపు రంగుల్లో’ కన్పించే భారత దేశం. దాన్ని ఓ దరి చేర్చడం, దానికి ఓ దారి చూపించడం ఆ ప్రయత్నంలో ప్రయాణం! యితనూ, యింకా ఇతని ఇతర అండర్‌గ్రౌండ్ కామ్రేడ్స్. అతనికి విప్లవమూ కావాలి, మున్నీ కావాలి. ‘ఇయ్యి. నీలోనిదంతా ఇయ్యి’- అని విషాదంగా అనుకుంటాడు. బాబీ కుటుంబ స్వచ్ఛమైన పాలు- “ఆ పాలలో నీ…” అని అసంపూర్తిగా, అయిష్టంగా తన గురించి జాలిగా అనుకుంటాడు. యిదంతా ఒక ముడి ఎవరూ విప్పలేరు. అని సమాధాన పర్చుకుంటాడు. ఇలా కథంతా కూడా ఇతని గిల్టీ ఫీలింగే. దేశానికి మార్గాలు ఏర్పరిచిన వాడు తను – ఓ కుటుంబం ప్రయాణించే దారిలో అడ్డుగా పడిన వృక్షంలా యేమిటిది? మెహ్రోత్రాలో రాజకీయ జూడాస్‌ని పసికట్టాననుకున్న అతను, తన జీవితంలో తనదైన ద్రోహచింతనని తియ్యగా చేదుగా అనుభవిస్తాడు. దేశానికి మార్గాలు చూపిస్తున్న తను, ఆ మార్గంలో ప్రయాణం చేయాలి కనుక – ఆ మార్గం నుంచి, వ్యామోహమార్గంలోకి చీలిపోకూడదు కనుక-మున్నీని వదలి పోవాలి. బాబీని వదలిపోవాలి. గిల్టుని, సిన్‌ని వదలిపోవాలి. ఓ జవాబును వెతుక్కుంటూ వెళ్ళిపోవాలి. వెళ్ళిపోతాడు. ‘తుఫాన్-మెయిల్లో’ వెళ్ళాల్సినవాడు ఓ మామూలు మెయిల్లోనే వెళ్ళిపోతాడు. ప్రయాణం సాగుతుంది. సఫర్. అది భౌతికమూ మానసికమూ.

అతని ఏ శరీర సౌఖ్య లోపం వల్ల ఇంత చీకటి ఆలోచనలు వచ్చాయో, యింత వూగిసలాట వచ్చిందో మనం గ్రహించ గలం. చాలామంది విప్లవ కారుల జీవితాల్లో చాటున కన్పించే నిజమే యిందులోనూ కన్పిస్తుంది. విప్లవకారులూ మనుషులే కాబట్టి యిలాంటి యిబ్బందులూ వస్తాయి. కొందరు సరిపెట్టుకుంటారు, కొందరు సరిపెట్టుకోరు. కొందరు ప్రయాణం సాగిస్తారు, కొందరు మానేస్తారు. కొందరు వీటన్నిటితోనూ పడుతూనో లేస్తూనో ప్రయాణం సాగిస్తారు. జీవితంలో యిలాంటి వాళ్ళని యెందర్నో మనం ఎరుగుదుం? ఈ కథలో విప్లవ కారుడు మనసులో ఎన్న చక్కర్లు కొడతాడు. చీకటి గదుల్లోకి వెళ్లివస్తాడు. బాధ పడతాడు, బయట పడతాడు. ప్రయాణం సాగిస్తాడు.

త్రిపురగారు ఆయనకే చేతనైన ఆయన పద్ధతిలో కథని ప్రయాణం చేయిస్తారు. ఓ చిన్న కొండెక్కడం లాంటిది ఆయన కథ చదవడం. కొండెక్కిన తర్వాత ఎంత రిలీఫో, ఎంత గాలో, ఎంత దృశ్యమో. సాఫీగా, తాపీగా సాగే కథలకి అలవాటు పడ్డ వాళ్ళు కూడా త్రిపుర గారి కథల్లోకి వస్తే, కథ అయ్యేంత వరకూ బయట పడలేరు. ఆ గ్లూమ్‌ని, ఆ స్టయిల్‌ని, ఆ వాతావరణాన్ని వొదిలి రాలేరు. ఆయన కథల ‘సఫర్’లో పడిన వాళ్ళ కెవరికైనా తెలుస్తుంది.”

స్మైల్

త్రిపుర కథలు On Kinige

Related Posts:

‘వంతెనలు’ కథపై వి. మోహనప్రసాద్ అభిప్రాయం

చక్కని తెలుగు సాహిత్యం ఆస్వాదించాలనే తెలుగు పాఠకులకు ఒయాసిస్సు లాంటివి త్రిపుర కథలు. రాసి కన్నా వాసి మిన్న అని విశ్వసించిన త్రిపుర గారు 1963 – 1973 మధ్య కాలంలో 13, 1990-91 మధ్యలో 2 కథలు… మొత్తం 15 కథలు వ్రాశారు. వీటిలోని విషయం, శైలి, గాఢత పలు విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. ఈ కథలు డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తాయి.

ఈ సంకలనంలోని ‘వంతెనలు’ కథపై వి. మోహనప్రసాద్ గారి అభిప్రాయం చదవండి.

* * *

ఆర్. వి. టి. కె. రావ్ గారూ,

మీ కథ ‘వంతెనలు’ నాకెందుకు నచ్చిందంటే ఇది తెలుగు కథ కాదు కావున. ఏదో ఇటాలియన్ కాసిల్ పురాతన సాలె గూళ్ళ శూన్య అస్థిపంజరాల్లోకి తీసికెళ్ళింది కావున. వారణాసిలో వున్నప్పుడు గులాబీలు మంచు జడికి తడిసినపుడు నా రైన్ కోట్‌లో నేనూ ఒక ఉత్తరం కుక్కుకుని డబ్బాలో పడేయటానికి వెళ్తూన్న ఆ రాత్రులు గుర్తుకుతెచ్చింది గావున.

కవి కాని వాడు, జీవితంలో కవి కాని వాడు కథ రాయకూడదు. ఒకానొక వాతావరణాన్ని సృష్టించడానికే. సి. విటమిన్ మాత్రల గార్బినాల్ టాబ్లెట్ల ఖుర్కీ పదున్ల కవర్ ఎప్పుడో పోయిన పిస్టల్ గురి తప్పని cogito, ergo sum ల అనాచ్ఛాదిత ఆత్మ పోరాటపు affaire de coer ని చిత్రించారు. ఆ చీకటి, ఉంటుందనుకొన్న లేని వెన్నెల, మంచు, జడివాన, వెదుళ్ళ వంతెన, జవహర్ వంతెన కావల ఈవల, గోనె సంచుల కాపరాలు, చీకట్లో మెరుపు, ఇలాంటి వాతావరణాన్ని ఆవరణని మనసులో కొద్దిమందే-బుచ్చిబాబు చండీదాస్. కొలకలూరి. స్మైల్, బీనాదేవి నగ్నముని చిత్రించగలరు. మీరు కథ చెపుతున్నప్పుడు చెవులకు కళ్లుంటాయి. కళ్లకి చెవులుంటాయి. కృష్ణ బలదేవ్ వైద్ ఒకడు అలా చెప్తాడు.

అవును. మీరు కైన్, రాజు ఏబెల్. అందుకనే మీర్రాసిన ఆ ఉత్తరం – రాజుని తిడ్తూ – విమల ప్రభాదేవి బంగళాలో ఉండిపోయింది. ‘Am I my brother’s keeper?’ తిట్టుకుని రాసిన ఆ ఉత్తరం ఆ ‘రాజు’ కిపుడేమవుతూందో పది సంవత్సరాల తర్వాత మీ భవిష్యద్వాణి ఎపుడో చెప్పింది.

“I did not know then what was burning my brother and into what dreams he was pouring his life” అన్నారు మీరే మీ ‘segments’ లో.
‘వంతెనలు’ కథలో ఘటన, సంఘటనల కంటే సంఘర్షణ ముఖ్యం. భావ పర్యవసన్నత ముఖ్యం. ప్రేరణ జీవితంలోంచి వచ్చిందే. భ్రమ ఎలానో వాస్తవికత కూడా కెలిడియోస్కోప్ లాంటిదే. history లోంచి వచ్చిన storyకి మీరిచ్చిన ట్రీట్‌మెంట్ మెటానిమిక్ ట్రీట్‌మెంట్. మీ కథంతా ఒక expression of character. ఇందుకు సాక్ష్యమా!

“setting may be the expression of human will. It may, if it is a natural setting, be a projection of the will. Between man and nature there are obvious correlatives” (Rene Vellek & Austin warren)

అదండీ కథ!

మహారాజు కుమార్ బహదూర్, విమల ప్రభాదేవి బ్లూమూన్ బంగళా పోరికో ముందు డాంటీ ఇన్ఫ్‌ర్నో ముందు ‘Ia sciate ogni speranza voich’ entrate’ రాసినట్లుగా (ఇందులో కాలిడిన వాళ్ళు చచ్చారే!) ఉంది మీ ఆశ.

జాహ్నవి ముందే, సీజర్ ముందే విమ్మీని en deshabille (నగ్నంగా) చూపిస్తే బావుండేది. అపుడే మీకున్న కసి, అసహనం, (అయిష్టం) చచ్చిపోలేదు గాని జీవితంలో మిగిలింది ఏమీ లేదు. chere hezila femme (చూడు హృదయపు లోతుల్లో మునిగిన అమ్మాయిని) అందేది.

‘విరబోసుకున్న జుత్తు భుజాల మీంచి నల్లటి జలపాతం లాగా మెరుస్తూ వెర్రిగా పడుతూన్న’ జుట్టుని కొప్పట్టుకుని లాగి చిక్కటి చీకటి వానలోకి లాగి పారేస్తే వంతెన లుండవు గార్డినాల్ టాబ్లెట్లు, విస్కీ సీసాలు, ఖుర్కీలు, పిస్టల్స్ ఉండవు. లక్షల చేసే అందం, 20 ఏళ్ళ కిందట ఊరికే వచ్చిన అందం, రెండుసార్లోడిపోయిన మూడోసారి గెల్చిన రాజకీయ శక్తి, 17 సంవత్సరాల జాహ్నవికున్న – మీకు సంశయమైన సోల్, మీరే గొప్పయి విమ్మీ తల్లి కూడా కాని రంజన్ ఏమీ ఉండవు. ఇదంతా ఒట్టి నిరర్ధకమైన ఆత్మ పోరాటం. మీ అంతట మీరనవసరంగా మీలోకి ఖుర్కీ పొడుచుకున్నారు. నిష్కారణమైన offaire d’ honneur. అందమైన వాళ్ళని వికృతంగా చంపాలి. పోన్లెండి ఆ బ్లూమూన్‌లో విమ్మీ, మహారాజు కుమార్‌లు చేతుల్లో విస్కీ గ్లాసుల్తో నిదానంగా వాళ్లని వాళ్ళే మెత్తగా పొడుచుకు చస్తున్నారు.

Aristocracy సాలెగూళ్లోకి ఇరుక్కు పోయిన యే రచయితయినా సుఖవ్యాధుల్తో తీసుకు చచ్చిపోయిన బాదెలేర్ లానే “అద్దం ఎదురుగా నిలబడి నిన్ను నేనే పోల్చుకుని ఇది నువ్వు అని సందేహం లేకుండా చెప్పలేని” స్థితిలోకి, “చీకటికీ వెల్తురుకి మధ్యన వంతెన ఉంటుందో లేదో” ననే సందేహ స్థితిలోకీ వచ్చి వంతెన కింద చీకట్లో ప్రవహిస్తున్న చిక్కటి నెత్తురు ప్రవాహాన్ని చూస్తూ నిల్చుంటాడు.

34 ఏళ్ళ క్రితం ఒరిస్సా కొండల్లో నాన్న తన ప్రియురాలు పద్మాలయని చంపింది మీ చేత సొర బీడీ కాల్పించినందుకు; విమ్మీ తన 8దో ఏట సాధువు చేత చురక వేయించుకున్నదీ తను సిగరెట్ కాల్చినందుకు. ఈ కథని తెలుగు పాఠకులు అర్థం చేసుకుంటారా?

‘వంతెనలు’ కథ వ్యక్తిగత సామాజిక నేర భావాల మధ్య ఊగులాడుతూంటుంది. అది కూలిపోయే వంతెన, కింద నెత్తురు వాగు, నీడల్లో ధ్వజమెత్తిన ‘రాజు’ లాంటి వీరులదా రక్తం.

వి. మోహనప్రసాద్

త్రిపుర కథలు On Kinige

Related Posts:

‘కనిపించని ద్వారం’ కథపై ఆర్. ఎస్. సుదర్శనం అభిప్రాయం

చక్కని తెలుగు సాహిత్యం ఆస్వాదించాలనే తెలుగు పాఠకులకు ఒయాసిస్సు లాంటివి త్రిపుర కథలు. రాసి కన్నా వాసి మిన్న అని విశ్వసించిన త్రిపుర గారు 1963 – 1973 మధ్య కాలంలో 13, 1990-91 మధ్యలో 2 కథలు… మొత్తం 15 కథలు వ్రాశారు. వీటిలోని విషయం, శైలి, గాఢత పలు విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. ఈ కథలు డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తాయి.

ఈ సంకలనంలోని ‘కనిపించని ద్వారం’ కథపై ఆర్. ఎస్. సుదర్శనం గారి అభిప్రాయం చదవండి.

* * *

జీవితంలో కనిపించని అర్థమే ‘కనిపించని ద్వారం’ కథ. నారాయణ జీవితాన్ని గూర్చి వేసిన ప్రశ్న “ఎందుకు?” దానికి సమాధానం ‘కెరటాల హోరులో అపస్వరాల అలజడిలో, లోన, లోలోన నిశ్శబ్దం’ అది ఒక రకం సమాధానమే కాని, నారాయణలాంటి వాళ్ళు కోరే ‘అర్ధవంత’మైన సమాధానం కాదు. అందుకే రెండవసారి ప్రశ్నిస్తాడు: “ఎందుకు!” – అప్పుడే విరిగి బద్దలయిన కెరటం, రాయి చుట్టూ. సుడి తిరిగింది రాయి చుట్టూ, ఆహ్వానిస్తూ, తెల్లటి కుచ్చిళ్ళు రాయి చుట్టూ పరిచి, తల్లి మారాము చేసే పిల్లవాణ్ణి ఒడిలోకి ఆహ్వానించినట్లు. కాని నారాయణ గడుగ్గాయి. మళ్ళీ మూడోసారి “ఎందుకూ?” అని అరిచాడు.- ‘శబ్దం గొంతుకలోంచి, యూస్టేషియన్ నాళాల్లోంచి, చెవుల్లోకి, మూయబడిన చెవుల్లోకి వెళ్ళి ప్రతిధ్వనులు వెతుక్కుంది’. కోపంగా ‘తంతాను… పో అని ఎడమకాలు ఎత్తి, విసురుగా ముందుకు విసిరి…. గెంతేడు నవ్వే కెరటపు హోరులోకి’ అది నారాయణ అంతం.

గోపీచంద్ వ్రాసిన ‘అసమర్దుని జీవయాత్ర’లో సీతారామారావు అంతం యిటువంటిదే! ‘ఎందుకు?’ అనే ప్రశ్న నేర్పినందుకు నాన్న గారికి అంకితం యీ నవల అన్నాడు గోపీచంద్. ఈ కథలో నారాయణ మీద తండ్రి ప్రభావం చాలా వుంది. తండ్రి మీద ద్వేషమా? అని ప్రశ్నించుకుంటాడు తండ్రి మరణం తర్వాత వారసుడుగా యింటికి తిరిగి వచ్చిన యేకాకి నారాయణ. ద్వేషం కాదు, తండ్రి వ్యక్తిత్వానికి – ఆయన తీపి మాటలు, పాప్యులారిటీ, హ్యూమర్, వైటాలిటీకి – తన వ్యక్తిత్వం, అడుగడుగునా ‘ద్రోహం’గా నడిచిన తన జీవితం, ఒక ‘రియాక్షన్’ కాబోలు అనుకుంటాడు! ఆ సమాధానం రుచించదు. సిగార్ పెట్టెలో సెల్లోఫెన్ కవర్ ఉన్న సిగార్ తన జాగాలో తాను ఉన్నది. సెల్లోఫేన్ కవర్ లేని సిగార్ అడ్డంగా ఉన్నది, మొదటి సిగార్ తన తండ్రి వ్యక్తిత్వం, జీవితం, రెండోది తనది! సమాజంలో యిమిడిన జీవితం ఆయనది, యిముడని జీవితం తనదీ! హృదయగతంగా తండ్రికి తనకూ గల ఈ తాదాత్మ్యం తెలిసిరాగానే వెక్కి వెక్కి ఏడుస్తాడు. అప్పుడే అతనిలో ‘యేదో’ తెగింది, దాక్షిణ్యం లేకుండా తెగింది. ఏమిటీ తెగింది? జీవితం తోటి బంధం. తండ్రి మరణం నారాయణ జీవితాన్ని అర్థశూన్యం చేసి, నిస్పృహలోకి తోసివేసింది. ‘నేను ఎవరు?’ అని ప్రశ్నించుకుంటాడు. అద్దంలో చూచుకుంటే తన కళ్ళలో నిస్పృహ. ‘మంచం లేని ఖాళీ జాగా’ అంటే తండ్రి మృతి ఏర్పరచిన ఖాళీ జాగా, నారాయణ అన్వేషణలో కీలకమైనదిగా గుర్తించాలి. గత జీవితాన్ని ఎంత తిరగవేసినా, ఆ ఖాళీ జాగా పూరించే స్థితి లేకపోవడమే నారాయణ ఆత్మ హత్యకు, కథ ముగింపుకి కారణమవుతున్నది.

గోపీచంద్ ఒక నవలలో విడమర్చిన యితివృత్తాన్ని త్రిపుర ఒక కథలో కుదించారు. నారాయణ అసమర్థుడు కాడు. జీవితంలో సమర్థుడే. కాని తండ్రి తోటి అనుబంధమే అతని జీవితాన్ని నడిపించడం వల్ల, తండ్రి మృతి కలిగించిన అస్తిత్వసంక్షోభం (Existential crisis) అధిగమించరానిదై ఆత్మహత్యకు దారితీసింది. నారాయణకు జీవితంలో మరో వ్యక్తితో ( ప్రేయసి, స్నేహితుడు) ప్రేమానుబంధం ఏర్పడి నట్లయితే ఈ సంక్షోభాన్ని అధిగమించే ‘ద్వారం’ లభించివుండేది. కాని అటువంటి అనుబంధం యేర్పడని విధానంలో,(ద్రోహం చెయ్యడంలో తెలివినీ ఆధిక్యతనూ నిరూపించుకోవడమే లక్ష్యంగా) అతని జీవితం నడవడం వల్ల ఈ సంక్షోభం వచ్చినప్పుడు అతణ్ణి రక్షించే సాధనం లేక పోయింది. అతనికి ‘ద్వారం’ కనిపించలేదు. ఆ ద్వారం ప్రేమ. జీవితానికి అర్థాన్ని హేతువాదం కాదు, ప్రేమే యివ్వగలదు!

ఆర్. ఎస్. సుదర్శనం

త్రిపుర కథలు On Kinige

Related Posts:

‘రాబందుల రెక్కలచప్పుడు’ కథపై వడ్డెర చండీదాస్ అభిప్రాయం

చక్కని తెలుగు సాహిత్యం ఆస్వాదించాలనే తెలుగు పాఠకులకు ఒయాసిస్సు లాంటివి త్రిపుర కథలు. రాసి కన్నా వాసి మిన్న అని విశ్వసించిన త్రిపుర గారు 1963 – 1973 మధ్య కాలంలో 13, 1990-91 మధ్యలో 2 కథలు… మొత్తం 15 కథలు వ్రాశారు. వీటిలోని విషయం, శైలి, గాఢత పలు విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. ఈ కథలు డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తాయి.

ఈ సంకలనంలోని ‘రాబందుల రెక్కలచప్పుడు’ కథపై వడ్డెర చండీదాస్ గారి అభిప్రాయం చదవండి.

* * *

ఈ “రాబందుల రెక్కల చప్పుడు” తీరూ
ధోరణీ నా కిష్టం. మంచి ‘నడక’ వుంది. ప్రతిదీ
కథగా భావించే లెక్కన యిది కథేమో గానీ
నా లెక్కన కాదు. మిది యే లెక్క, అని
అడిగితే, వాదించటం నాకు రాదు. (నాకు విశ్లేషణ,
వివరణ చాతకాదు) దీన్ని కథ అనే పక్షంలో,
మంచికథ. వో ‘స్థితి’ చిత్రణకు కథ అని నేను
భావించను. కథకానిది, యెంతో బావున్నా బావుంటుందే
గానీ, కథ కాదు.”

వడ్డెర చండీదాస్

త్రిపుర కథలు On Kinige

Related Posts:

‘జర్కన్’ కథపై నిఖిలేశ్వర్ అభిప్రాయం

చక్కని తెలుగు సాహిత్యం ఆస్వాదించాలనే తెలుగు పాఠకులకు ఒయాసిస్సు లాంటివి త్రిపుర కథలు. రాసి కన్నా వాసి మిన్న అని విశ్వసించిన త్రిపుర గారు 1963 – 1973 మధ్య కాలంలో 13, 1990-91 మధ్యలో 2 కథలు… మొత్తం 15 కథలు వ్రాశారు. వీటిలోని విషయం, శైలి, గాఢత పలు విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. ఈ కథలు డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తాయి.

ఈ సంకలనంలోని ‘జర్కన్’ కథపై నిఖిలేశ్వర్ గారి అభిప్రాయం చదవండి.

* * *

“ఎర్రభిక్కు ‘త్రిపుర’

చేతిలో మోస్తున్న రాయి ‘జర్కన్’

దాదాపు పదహారుసంవత్సరాల క్రితమే ‘భారతి’లో వచ్చిన ‘త్రిపుర’ కథలు చదువుతుంటే ఒక విచిత్రమైన అనుభవం కలిగేది. ఆ త్రిపురనే ఇంగ్లీషు బోధిస్తున్న ఆర్. వి. టి. కె. రావుగా విశాఖ నుంచి వెళ్ళి అంత దూరం త్రిపుర రాజధాని అగర్తలాలో నివశిస్తున్నాడని తెలిసి మరీ ఆసక్తి కలిగించింది నాకు ఆ రోజుల్లో. 1987లో ఆయన ‘చీకటి గదులు’ ఆ తరువాత తళుక్కున మెరిసి గుండెపై నుంచి గీసుకుపోయిన ఆయన కథానిక ‘జర్కన్’ నన్ను మరింత త్రిపుర కథలకు దగ్గర చేసింది.

అరుదైన మనోతత్వ వేత్తగా – నిరాసక్తుడుగా త్రిపుర ఈనాటికీ తనను తాను వెతుక్కుంటూనే వున్నాడు. ప్రతి కథలో ఆయన ఫస్ట్ పర్సన్ సింగులర్‌గా జీవించాడు, ఆయన అన్వేషణ మెట్లు మెట్లుగా ఒక్కొక్క కథలో ప్రగాఢమైన, మరింత లోతుగా ఆలోచించమని చెబుతూనే ఒక విషాదంలోకి నెట్టివేసి నెమ్మదిగా అభినిష్క్రమణ సాగిస్తుంది.
బౌద్ధ – జైన అనాసక్తతత్వం లోంచి పుట్టి, ఈ ప్రపంచంలో ‘అహింస’తో సాధ్యం కానప్పుడు ‘హింస’తోనైనా విప్లవాభిముఖంగా కొనసాగాలని త్రిపుర ధ్వనిప్రాయంగా తమను వ్యక్తీకరించుకున్నాడు. అందుకే ఆయనను నేను ‘రెడ్ భిక్కు’ అని పిలిచే వాణ్ణి! క్రమంగా ఆ ఎరుపు ‘సఫర్’గా సాగుతూ ‘కనిపించని ద్వారం’ వెనకాల వుండి పోయింది – అది వేరే సంగతి!!

ఈ కథలో ‘భాస్కర్’ రూపంలో కథకుడు ఒకచోట ఇలా అంటాడు- “విలువల ప్రమేయం లేదు నాకు. స్థిరంగా నిలబడి, నలుగురి మధ్యా వుండి, మనుష్యులతో వస్తువులతో సంబంధాలు – మమతలు పెంచుకొంటున్న వాళ్ళకు విలువలు” కాని ఈ దేశంలో జీవిస్తున్న రచయిత ఈ మట్టి మనుషుల నికృష్ట జీవితాలు చూసి ‘వీరాస్వామి’ పాత్రలో ఒక నూతన విలువ అంటే ఒక మహత్తరమైన ఆశయం కోసం త్యాగం తప్పదనే నిజాన్ని అంగీకరించక తప్పదు. అందుకే త్రిపుర మరో చోట అంటారు-

“తనను తాను తెలుసుకోవాలి. తనకేది కావాలో తెలుసుకోవాలి. తెలుసుకోవచ్చని తెలుసుకోవాలి. తనలోంచి తాను వేరుబడి తనను వేరే చూసుకోవడం నేర్చుకోవాలి. ఆ క్షణంలో అతను ఏమిటి చేయాలో అతని గమ్యం ఏమిటో అతనికి తెలుస్తుంది.”

విలువైన వజ్రపు రాళ్ళ మధ్య ‘జర్కన్’ అనేది విలువైన రాయి. సాన పెట్టబడక ముందు మామూలు రాయి. కాని, ‘అనుభవం’ ఆచరణతో మరొక్కసారి కోసం, ప్రయోజనం కోసం జీవిస్తున్నామనే స్పృహ, స్వార్థపూరితుడైన మనిషిని సానబెడుతుంది. ఒక్క ‘జర్కన్’ రాయిగా మారుస్తుంది.

త్రిపురగారు ‘ఇంపల్స్’ (Impulse)తో రాస్తారు. బౌద్ధ భిక్కులా దేశమంతా తిరిగి, అనుభవాల్ని కథల్లో అమర్చి తిరిగి దూరమై పోతారు. కథా కథన శైలిలో ‘చలం’కు చాలా దగ్గర వాడిలా కనబడతారు. ఇంగ్లీషు నుడికారం తెలుగుగా మారి చివరగా ఆయన అనుభవమనే రక్తంలోంచి చురుకైన భాష పుట్టుకొచ్చింది. ‘ఆలోచన’ నుంచి ‘తెలుసుకోడానికి’ గెంతగలిగితేనే చేరగలమని త్రిపుర అంటున్నారు ఈ కథలో- కాని ఆ అఖాతాన్ని దాటడానికి సరియైన పంథా అనుభవమనే వంతెన వేసుకోక తప్పదనే వాస్తవాన్ని త్రిపుర నిరాకరించరనే అనుకుంటాను.”

నిఖిలేశ్వర్

త్రిపుర కథలు On Kinige

Related Posts:

‘కేసరివలెకీడు’ కథపై భరాగో అభిప్రాయం

చక్కని తెలుగు సాహిత్యం ఆస్వాదించాలనే తెలుగు పాఠకులకు ఒయాసిస్సు లాంటివి త్రిపుర కథలు. రాసి కన్నా వాసి మిన్న అని విశ్వసించిన త్రిపుర గారు 1963 – 1973 మధ్య కాలంలో 13, 1990-91 మధ్యలో 2 కథలు… మొత్తం 15 కథలు వ్రాశారు. వీటిలోని విషయం, శైలి, గాఢత పలు విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. ఈ కథలు డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తాయి.

ఈ సంకలనంలోని ‘కేసరివలెకీడు’ కథపై భరాగో గారి అభిప్రాయం చదవండి.

* * *

“1964-
అప్పుడు నేను జ్యోతి, భారతి-ఆ రెండే చూసే వాణ్ణి.
‘భగవంతం కోసం’ అనే కధ పడింది, ‘చూశారా?’ అని అడిగే వాణ్ణి.
‘ఎవర్రాసేరు?’అనే వారు. ‘త్రిపుర’ అనేవాణ్ణి ఆయనతో ఎన్నాళ్ళ నుంచో పరిచయం వున్నవాళ్ళా. ‘పోనిద్దురూ’ అనేవారు.
ఎవరు? అక్షరాల దగ్గర్నుంచీ ఆంధ్ర… వరకూ చదివే ‘యావ’ రేజి పాఠకులు కాబోలు-
1966-
జగన్నాధరావుగారు పరిచయమై సాహిత్య చర్చమీద మేం గడిపిన ఓ రాత్రి – రెండో మూడో ఐంది టైం…. ‘నేనీ మధ్య వో గ్రేట్ రైటర్ని డిస్కవర్ చేసేను’ అన్నారు. ‘త్రిపుర’ అంటారేమోనని ఆశపడ్డాను.
ఫలించిన ఆశల్లో అదొకటి.
1967 చివర్లో-
నేను ఒక పత్రిక కోసం ‘త్రిపుర’ గారికి ఉత్తరం రాసి తెప్పించిన ‘కనిపించని ద్వారం’ అనే కథని నా చేత్తో నేనే బలాత్కారంగా తిప్పి పంపవలసి రావడం (బాస్ నాటక కథ) నా జర్నలిస్టిక్ కెరీర్లో నా కెదురైన అనేక కీడులలో కేసరి వంటిది.
1970 లో –
త్రిపుర గారే పరిచయమయ్యారు. ఈ పదేళ్ళలో ఐదారు సార్లు కలిశాను. భయం భయంగా మాట్లాడేను. ఆయన కొంపదీసి ఆయన పాత్రల్లో దేన్లాగో మాట్లాడుతారో, మర్డర్ చేస్తారో అన్నట్లు. ఆయన కథల్లో అది వాస్తవిక చిత్రాల్లా బొమ్మకట్టి మాట్లాడ్డం రాదాయనకి. ఆయన కథల్లో వున్న సినిసిజంలో చాలా శాతం మాత్రం కనబడేది.
కేసరివలె కీడు గురించి రాయమన్నారు అత్తలూరి నరసింహారావు గారు. ఫ్రంట్‌లో డ్యూటీలో వున్న మిలిట్రి వాళ్ళ వీకెండ్ జీవితశకలం. దాంట్లో ఏదైనా కథుందేమోనని నేనెన్నడూ వెతకలేదు. ఆయన రచనలన్నిట్లాగే (అన్నీ ఎన్ని కనుక?- అలాంటి వాళ్లు ఎక్కువ రాయరు కద!)- ఇదీ ఒక సర్రియలిస్ట్ పెయింటింగే. రెడ్డి మనోనేత్రంతో రికార్డు చేసుకున్న శ్నాప్‌షాట్స్ ఎక్కువ గజిబిజి లేకుండా అంటించిన ఆల్బం ఈ కథ.
అయితే ఇందులో మందుగుండు పొడిగా ఉండి, శతఘ్నలు సిద్ధంగా పేర్చివుండి, తెల్లటి దీపాల్ని నల్లటి కాగితాలు వికృతంగా కప్పేస్తూ వుండి సీసం వర్షించబోతు వుండినా-
చిన్నారి అలాగే నిలబడి వుంటుంది.
అది నాకిష్టం.”

భరాగో

త్రిపుర కథలు On Kinige

Related Posts: