‘సుబ్బారాయుడి రహస్యజీవితం’ కథపై అత్తలూరి నరసింహారావు అభిప్రాయం

చక్కని తెలుగు సాహిత్యం ఆస్వాదించాలనే తెలుగు పాఠకులకు ఒయాసిస్సు లాంటివి త్రిపుర కథలు. రాసి కన్నా వాసి మిన్న అని విశ్వసించిన త్రిపుర గారు 1963 – 1973 మధ్య కాలంలో 13, 1990-91 మధ్యలో 2 కథలు… మొత్తం 15 కథలు వ్రాశారు. వీటిలోని విషయం, శైలి, గాఢత పలు విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. ఈ కథలు డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తాయి.

ఈ సంకలనంలోని ‘సుబ్బారాయుడి రహస్యజీవితం’ కథపై అత్తలూరి నరసింహారావు గారి అభిప్రాయం చదవండి.

* * *

” ఇన్‌ఫిరియారిటీ కాంప్లెక్సులో తడుస్తున్న వ్యక్తి వేదనల వంతెనలు దాటడానికి తానొక గొప్పవాడిగా, మహారాజుగా భావించుకుంటూ పగటి కలల్లో కరిగిపోతూ వుంటాడు. ఇలాంటి ఫాంటసీల్లో కరుగుతూ, కదులుతూ వుంటే ఇన్‌ఫిరియారిటీకి సంతృప్తి పరిమళం అంటుతుంది. ఈ తరహా వ్యక్తి రెండురకాల కలల్లో కాళ్ళు పెడుతూవుంటాడు. మొదటిది బాధ పడే కల, రెండోది విజేత అయ్యే కల. రెండింటిలోనూ అతనే హీరో. మనలో ఎక్కువ మంది ఈ రెండో రకం హీరోలమే. ఈ కథలో సుబ్బారాయుడు కూడా విజేత కలలే కంటాడు – మార్కెట్‌లో కమలాలు, ద్రాక్షలు చూసినప్పుడు: బీరకాయల బేరంలోను: ఏంబులెన్స్ కనబడినపుడు: లాయర్ నేమ్ ప్లేట్ కళ్ళ బడినపుడు: సైన్యంలో చేరండని బోర్డు చూసినపుడు. కానీ వాస్తవం మౌనంగా గుచ్చుకుంటుంది మామిడి పళ్ళ అమ్మి గదమాయింపు, బీరకాయల అమ్మి హెచ్చరిక, రిక్షావాడు కసురుకోవటం తోటి, అన్నిటి కన్నా వాస్తవాతివాస్తం కట్టుకున్న పెళ్ళాం నరసమ్మ సుబ్బారాయుడు తెచ్చిన బీరకాయల్ని చూసి అన్న మాటలు. ఆ మాటల్లోని వాస్తవం తగిలి సుబ్బారాయుడు క్రూసిఫై అయిపోయినట్టు ఫీలవుతాడు.
అమెరికన్ హాస్య రచయిత జేమ్స్ థర్బర్‌ని అనుసరించిన ఈ కథ – సగటు మనిషి జీవితంలోని ఫాంటసీని, వాస్తవానికి దూరమవటాన్ని అద్భుతంగా కొలుస్తుంది.”

అత్తలూరి నరసింహారావు

త్రిపుర కథలు On Kinige

Related Posts:

‘ప్రయాణీకులు’ కథపై వాకాటి పాండురంగారావు అభిప్రాయం

చక్కని తెలుగు సాహిత్యం ఆస్వాదించాలనే తెలుగు పాఠకులకు ఒయాసిస్సు లాంటివి త్రిపుర కథలు. రాసి కన్నా వాసి మిన్న అని విశ్వసించిన త్రిపుర గారు 1963 – 1973 మధ్య కాలంలో 13, 1990-91 మధ్యలో 2 కథలు… మొత్తం 15 కథలు వ్రాశారు. వీటిలోని విషయం, శైలి, గాఢత పలు విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. ఈ కథలు డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తాయి.

ఈ సంకలనంలోని ‘ప్రయాణీకులు’ కథపై వాకాటి పాండురంగారావు గారి అభిప్రాయం చదవండి.

* * *

“ఎవడి జీవితం వాడికో పజిల్. పదబంధ ప్రహేళిక. గళ్ళ నుడికట్టు.

‘క్లూ’ దొరికిన క్షణం ఆకాశం; దొరకని యుగం అథఃపాతాళం. ఈ పజిల్‌ను శబ్దార్థ చంద్రికతో సాధించే వారు కొందరు, కేవలం పెన్సిలు ముక్కతో చేసే వారు కొందరు,’క్లూ’ ల కోసం టార్చిలు వేసే వారింకొందరు, ‘శ్రీ మహాలక్ష్మీ’ అంటూ ముడుపు కట్టి రంగంలోకి దిగే వారు కొందరు. దీనిని చదరంగం బల్లగా ఆడేవాళ్ళు కొందరు. దీన్ని మడిచేసి ఇలాటిదొకటి లేదనట్లుగా బతికేసేవాళ్ళు చాలా కొందరు….

అన్ని గళ్ళూ ఎప్పటికి పూర్తి అయ్యేను? బహుమతి ఏమిటి? అసలు ‘కీ’ సొల్యూషన్ అంటూ ఉందా? అర్థంలేదు కాబోలు, అంతం లేదు కాబోలు. అలాగని మనసు వూరుకుంటుందా? చెయ్యని దానిని చెయ్యమంటుంది. చేసిన దానిని ‘అబ్బే’ చేయకుండా ఉండాల్సింది అంటుంది, మనో ఫలకంప్యూటర్ లోకి ఎవరో, ఎప్పుడో, ఎక్కడో ‘ప్రోగ్రాం’ చేసిన కార్డు ఒక్కొక్కటి ‘డిసైఫర్’ అవుతున్నకొద్దీ భోగం, రోగం, యోగం పడతాయి పూర్ మానవుడికి.

జ్ఞాపకాలు తరుముతోంటే అడుగులు పడని దారుల వెంట పరుగులు తీస్తాడు. ‘అదిగో అవతల వాడెవడో వెడుతున్నది రాజ మార్గమేమో? నే తొక్కినది మందమతుల సందు కాబోలు’ అన్న సందియం పీడిస్తుంది. కాని కాలం – ట్రాఫిక్ ఎప్పుడూ వన్-వే యే: ఇక్కడ ‘బావా ఎప్పుడు వచ్చితివీవు’-ఒక్కసారే పాడతారు. నోవన్స్ మోర్! నో ఎన్ కోర్! జీవితం కొవ్వొత్తి ఒక్కసారే వెలుగుతోంది: చివరకు జ్ఞాపకాల ముద్దలు నిర్జీవంగా, అస్తవ్యస్తంగా పేరుకుంటాయి. ఏడ్వాలో నవ్వాలో తెలియదు.

సరేలెమ్మని కాంచనమాల కోసం బయలు దేరినవాడు కనకాలుతో స్థిరపడతాడు. కలెక్టర్ కావలసిన వాడు క్లర్క్ అవుతాడు. కాని, జీవితం రైలులో ఏదో ఒక పెట్టెలోనో, ఒక స్టేషన్ లోనో కాంచన మాల, దాని మొగుడూ ఊడిపడతారు. తలుపులు తెరుచుకుంటాయి. అలారం మోగుతుంది. కొవ్వొత్తి మైనపు ముద్దు అసహ్యంగా కదులుతాయి. ‘నిజంగా నేనొక నిధిని కోల్పోయానా?’ వాడెవడో ఈ క్షణం హీరోలా మరు క్షణం నీరోలా, ఇంకోక్షణం నారోలా కన్పిస్తాడేం? నిన్నటి అద్దం మీది ఆ వికారం నా మొహమేనా? నా పెరటి కోకిల గానం ఇంత వికృతంగా వుందేం?…. అన్నీ సందేహాలే!

అలాంటి అతలా కుతలంలో, సదసత్సంశయంలో పడిన ‘భాస్కారియో’ కథ ‘ప్రయాణీకులు’.

తనొకప్పుడు కోరిన శాంత (కళ్యాణి?)ను తన జీవితంలోంచి నడిపించుకు వెళ్ళిపోయిన నాగుపాము లాటి మిత్రుడు ‘శేషియో’ హఠాత్తుగా ఏరుపోర్టులో ఊడిపడి
“శాంత ఒక జబ్బు. దాన్నుంచి నిన్ను విడుదల చేశాను. ఆ జబ్బును నేను త్వరలోనే వదల గొట్టుకున్నాను.” అన్నా-

మళ్ళీ ఇంకో సారి తన జీవితంలోకి ఎలాటి రిగ్రెట్సూ లేకుండా, ఝామ్మున, రాజాధి రాజులా వెళ్ళి పోబోతున్న శేషాచలపతి తన భార్య గురించి చెబుదామని-
“సుశీలను చూడలేదు నువ్వు. ఎంతో ‘ఇద’వుతుంది” అని భాస్కరం అంటే “ఎవరా బిచ్? నీ భార్యా!” అని తలమీద కొట్టి, వెళ్ళిపోయి, కాక్‌పిట్‌లో కూర్చుని. ప్లేన్ లో వేగంగా సాగి నల్లటి మేఘాల్లోకి శేషాచలపతి దూసుకుపోగా –
క్రింద నిలబడిపోయిన భాస్కరం కథ ఇది.

మనసు విలవిలలాడినా, ఏమీ అనని, ఏమీ చెయ్యని, అలాగని వూర్కోలేని దేవదాసులాంటి భాస్కరం కథ ఇది.

అనుభవాలను, జ్ఞాపకాలను, అబ్జర్వేషన్లను, వర్తమానాన్ని ఎర్నెస్టు హెమీంగ్వే ఇంగ్లీషు లాటి తెలుగులో ‘శాండ్విచ్’ చేసి- అలతి మాటలతో, అందమైన పొత్తికడుపు మడతల వంటి ఇమేజరీలతో, డ్రెస్టెన్ బౌల్ లో వడ్డించిన ‘పరవాణ్ణం’ ఇది.

-అయితే 1964 లో రాసిన ఈ కథను చదవడానికి ముందుగా, ఆయన 1967 లో రాసిన ‘చీకటి గదులు’ చదివితే ఈ కథలోకి మనం బాగా వెళ్ళగల్గడం అన్నది – తెలుగు కథల్లోకి హెచ్. జి. వెల్స్ ‘టైమ్ మెషీన్’ రావడం లాంటిది!

ఇంతటి పనితనపు కలము మూగబోయిందెందుకు?

‘వారా’ల పత్రి ‘కలి’యుగం అని కాదు కద?”

వాకాటి పాండురంగారావు

త్రిపుర కథలు On Kinige

Related Posts:

‘భగవంతం కోసం’ కథపై రామమోహన్ రాయ్ అభిప్రాయం

చక్కని తెలుగు సాహిత్యం ఆస్వాదించాలనే తెలుగు పాఠకులకు ఒయాసిస్సు లాంటివి త్రిపుర కథలు. రాసి కన్నా వాసి మిన్న అని విశ్వసించిన త్రిపుర గారు 1963 – 1973 మధ్య కాలంలో 13, 1990-91 మధ్యలో 2 కథలు… మొత్తం 15 కథలు వ్రాశారు. వీటిలోని విషయం, శైలి, గాఢత పలు విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. ఈ కథలు డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తాయి.

ఈ సంకలనంలోని ‘భగవంతం కోసం’ కథపై రామమోహన్ రాయ్ గారి అభిప్రాయం చదవండి.

* * *

“ఇంటలెక్చువల్స్‌గా చెప్పుకోదగిన తెలుగు కథా రచయితలు తక్కువ. అంతర్జాతీయ స్థాయిలో ఇవి మా తెలుగు కథలని మనం అందించగలిగినవీ తక్కువ. శ్రీ ‘త్రిపుర’ ను giant among the intellectual writers అని గట్టిగా చెప్పవచ్చు. ‘భగవంతం కోసం’ కథానిక ఇతివృత్తమూ, శిల్పమూ చక్కగా సమ్మిశ్రితమైన కళాఖండం.

శ్రీ ‘త్రిపుర’ యీ కథానికలో మనస్సు లోలోతులకు అట్టడుగున వున్న ఆణి ముత్యాల్ని, అసందర్భపుటా లోచనల్ని, ఒంటరితనపు భయంకరత్వాన్ని, మనిషి ఎవరికీ ఏమీ కాని ఏకాంతంలోని నిశ్శబ్దాన్ని పట్టుకున్నారు. మనస్తత్వ చిత్రణలో తెలుగులో ఇంతవరకూ వచ్చిన కథానికల్లో ‘భగవంతం కోసం’ ‘ది బెస్ట్ స్టోరీ’ అని నా నమ్మకం. ‘భగవంతం కోసం’ కథను నిశితంగా పరిశీలించి చూస్తే ఎన్నెన్ని అద్భుతాలు!

బలిసిన ఊరకుక్కలాంటి బస్సు, లెప్పర్ గాంగ్ పాటలు పాడుతూ చేపలని పట్టె వలలాగ పోవటమూ, రూపం పొందిన న్యుమోనియాలాంటి యిల్లు, గోడలమీద సర్రియలిస్టిక్ మచ్చలు, ఆశాకిరణంలా అరటి చెట్టు – ధైర్యంగా , అమాయకంగా, పిచ్చిది, గాజు పెంకులు రుద్దినట్లున్న మేనేజర్ ముఖం. గొంగళి పురుగులు కనిపిస్తే చాలు – చేత్తోనే అలా నలిపే బుజ్జిగాడు, హోటల్ వెనక రౌరవం, బరువైన రెప్పల కింద రెండు బలిసిన కుక్కలు, కళ్ళుమూస్తే పెద్ద గబ్బిలాల రెక్కలు, ప్రపంచపు అరటి పండుని వొలిచి చేతులో పెడ్తున్న అనుభూతి, ఆకాశంలో నక్షత్రపు జల్లు – ఎన్నెన్ని పదచిత్రాలు! వీటితో పాటు మనస్సును కోసేస్తూ మెత్తగా దూసుకుపోయే భావనాపటిమా మన అస్థిగతమై ‘కడదాకా’ మనతో వచ్చేస్తాయి.

భగవంతం పేరు వినగానే పిలకలు, కిఱ్ఱు చెప్పులు, చెవులకి కుండలాలూ, అరవేసిన అంగవస్త్రాలూ కన్పించటం – ఉన్నిథన్ పేరులో కొబ్బరితోటలు, మెల్లగా బేక్ వాటర్స్‌లో బరువుగా పోయే పడవలు – నల్లటి వంకుల జుత్తుల మెరుపులు, లవంగాలు, ఏలకులు, కోప్రా సుగంధాలు మనస్సులో మెదలటం, మనస్సులో మెదిలే అస్పష్ట భావ సంచలనానికి గొప్ప రూప చిత్రాలు. హోటల్లో చుట్టూవున్న మనుష్యుల మాటల్లో అర్థరహితమైన, అర్థవంతమైన అసందర్భపు ప్రేలాపనలు చుట్టు ముట్టేసి గుండెకు గాలం వేసి లాగేస్తాయి.

కథలో వచ్చిన కాఫీ – కాఫీ కాదు – మొదట అది “ఉత్తవేడిగా ఉన్న గోధుమరంగు” – ఆ తర్వాత అది “ఉత్తవేడి రంగు గోధుమ ఊహ”- ఇంత సర్రియలిస్టిక్‌గా వచ్చిన కథానిక మరేదీ తెలుగులో! సెమికోలన్ ఎక్స్‌క్లమేషన్ మార్కులూ విడదీసి రమ్మనటం, హెమింగ్‌వే వాక్యం లాగ నీట్‌గా- బ్రిస్క్‌గా- వోవర్‌టోన్స్ యేమీ లేకుండా వెళ్ళాడనటం ‘త్రిపుర’ గారి శిల్ప నైపుణ్యానికి గొప్ప నిదర్శనాలు.

“చెత్తని మెక్కి కప్పల్ని తిన్న పాముల్లా పోయే జనాన్ని చూస్తే అసహ్యం- ఈ పుట్టే అసహ్యం అంటే ఎంతో ఇష్టం” ఈ మాటల్ని బట్టి ‘త్రిపుర’ cynic అనీ, frustrated అనీ అనుకొనే ప్రమాదముంది. కాని మనిషిని ద్వేషిస్తూ ప్రేమించే గుణం – పిల్లల్ని బుగ్గలు సాగదీసి ఏడ్పించి ముద్దు పెట్టుకునే తత్వం ‘త్రిపుర’ కథల్లో వుంది.

మంచి కథకు, కవిత్వానికీ భేదముంటుందనుకోవటం భ్రమ. ‘త్రిపుర’ గారి కథానికలు అజంతా, బైరాగి, పఠాభి వంటి ఉత్తమ కవుల కవితల్ని చదువుతున్న అనుభూతి కలిగిస్తాయి. ‘త్రిపుర’ ఊహ నైశిత్యం తళత్తళల బాకులా గుండెల్లో గునపం పోటై గుచ్చుకుంటుంది. “తట్టుకోగల చావ వుంటే” త్రిపుర గారి భావనా పరిధిలోకి ప్రవేశించండి. సుందర సురూప ప్రపంచాన్ని కాక మామూలు రచయిత లెవ్వరూ కలలోనైనా కానని చీకటి కోణాలను, మనిషిలోని వెధవాయత్వాన్ని, అశక్తతనూ యేమైనా అతన్ని వీడని మానవత్వాన్ని దర్శించండి. ‘త్రిపుర’ కథలు చదివాక మనిషింటే కథాసాహిత్యమంటే పిచ్చి ఇష్టం కలుగుతుంది.”

రామమోహన్ రాయ్

త్రిపుర కథలు On Kinige

Related Posts:

‘హోటల్లో’ కథపై అబ్బూరి గోపాలకృష్ణ అభిప్రాయం

చక్కని తెలుగు సాహిత్యం ఆస్వాదించాలనే తెలుగు పాఠకులకు ఒయాసిస్సు లాంటివి త్రిపుర కథలు. రాసి కన్నా వాసి మిన్న అని విశ్వసించిన త్రిపుర గారు 1963 – 1973 మధ్య కాలంలో 13, 1990-91 మధ్యలో 2 కథలు… మొత్తం 15 కథలు వ్రాశారు. వీటిలోని విషయం, శైలి, గాఢత పలు విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. ఈ కథలు డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తాయి.

ఈ సంకలనంలోని ‘హోటల్లో’ కథపై అబ్బూరి గోపాలకృష్ణ గారి అభిప్రాయం చదవండి.

* * *

” ‘హోటల్లో’ అన్న యీ రచన నిజానికి కథ గాని కథ. కదలకుండా కదిలించే కథ.

చాలా మామూలుగా – మనం నిత్యం జీవితంలో చూసే దృశ్యాలనే అతి మామూలుగా చూపించడం ఈ కథలోని ప్రత్యేకత.

ఈ కథలో కనిపించే హోటల్లో ఎన్ని బల్లలున్నాయో వక్కయొక్క బల్ల దగ్గర ఎంతమంది భోక్తలున్నారో, వాళ్ళ తీరని ఆకలి – అంటే ఎంత తిన్నా తీరని ఆకలి. సర్వర్లూ, ప్లేట్ల గ్లాసుల గలగలలూ, ఇవే చూపిస్తున్నాడు రచయిత.

సాహిత్యం, రాజకీయాలు, పాలనా యంత్రాంగంలోని అవినీతి అన్నీ వినబడతాయి – హోటల్లో కూర్చున్న మనుషుల నోళ్ళల్లో నలుగుతూన్న పలహారాల మూలుగుల్లో-

అన్నీ దృశ్యాలే – కొండని దగ్గర్నుంచి మరీ దగ్గర్నుంచి చూస్తే కొండలో కొంత భాగమే చూడగలం. కొండ ఆకారాన్ని అంచనా కట్టాలంటే బాగా దూరంగా పోవాలి. రచయిత మనల్ని హోటలుకు మరీ దగ్గరగా – ఉహూఁ హోటల్లోకే సరాసరి పాఠకుల్ని తీసుకెళ్ళాడు. సీటు లేని ప్లేటు లేని అగంతకులం మనం.

రష్యన్ మహా చలన చిత్రకారులు పుడోవ్కిన్, ఐసెన్ స్టీన్ తమ చిత్రాలలో వాడిన ‘మాన్తాజ్’ (Montage) టెక్నిక్ ఈ కథ చదువుతూంటే గుర్తుకొస్తుంది.

పరస్పర విరుద్ధాలయిన రెండు దృశ్యాలను వొకదాని తరవాత వొకటిగా చూపించడమో, వొక దృశ్యం మీద మరొక దృశ్యాన్ని ఆరోపించడమో చేసి – చూపిన దృశ్యాలకు విరుద్ధమయిన భావాన్ని కలిగించడం ఈ టెక్నిక్ లోని ప్రత్యేకత.

ఈ కథలో కనిపించే అలాంటి భావం యేదో నేను చెప్పను.

కాని కథకుడు చెప్పేశాడు వొకచోట. దాన్ని వెతికి పట్టుకోవలసిన బాధ్యత పాఠకులదే. అందుకు పాండిత్యమూ, సహృదయతా ససేమిరా పనికిరావు. మానవత్వం కావాలి అదొక్కటే దీపం ఈ కథలో ప్రయాణించడానికి”.

అబ్బూరి గోపాలకృష్ణ

త్రిపుర కథలు On Kinige

Related Posts:

‘పాము’ కథపై చాగంటి తులసి అభిప్రాయం

చక్కని తెలుగు సాహిత్యం ఆస్వాదించాలనే తెలుగు పాఠకులకు ఒయాసిస్సు లాంటివి త్రిపుర కథలు. రాసి కన్నా వాసి మిన్న అని విశ్వసించిన త్రిపుర గారు 1963 – 1973 మధ్య కాలంలో 13, 1990-91 మధ్యలో 2 కథలు… మొత్తం 15 కథలు వ్రాశారు. వీటిలోని విషయం, శైలి, గాఢత పలు విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. ఈ కథలు డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తాయి.

ఈ సంకలనంలోని ‘పాము’ కథపై ప్రముఖ రచయిత్రి చాగంటి తులసి గారి అభిప్రాయం చదవండి.

* * *

” త్రిపుర రాసిన ఈ కథలో పాత్ర శేషాచలపతిరావు బతుక్కి అర్థం కనపడక, అంతా శూన్యం అనిపించి, క్షణానికి క్షణానికీ, మధ్య సంబంధం లేకుండా, చేసే ఓ పనికి మరో పనికీ పొంతన లేక బతుకుతూ బాల్య స్మృతులు వెంట తరుముతూ ఉంటే తిరిగి ఆ బాల్యంలోకి వెళ్ళి పోవాలని అనుకుంటూ విషపూరితమైన పాములా చుట్టూ వున్న వాళ్ళని కాటేస్తూ ఉంటాడు. మోసం చేస్తాడు. దగా చేస్తాడు. ఇంఫాల్ లో మార్షల్ అయి ముప్ఫై యేళ్ళొచ్చినా బతుకులో యే స్థిరత్వం కనపడక, డబ్బులేక, ఉద్యోగం చేసే టెంపర్‌మెంట్ లేక యేదో పేరుకి మాత్రం యూనివర్సిటీలో చదువుకోడానికి చేరతాడు. అతనిలో హింసా ప్రవృత్తి అందర్నీ హతమార్చాలన్న కసి, కోసం గట్టిగా ఉంటాయి. హిట్లరులా నియంతలా ప్రవర్తించాలని అనుకుంటాడు. బెలూచిస్తాను, జర్మనీ తన స్పిరిట్యుయల్ హోమ్స్ అనుకుంటాడు. రోజుకో కొత్త మనస్థత్వంతో కొత్త వేషంతో చుట్టూ ఉన్న వాళ్ళని మోసం చేస్తూ ఉంటాడు.

ఆ వేళ ‘అలఖ్ నిరంజన్’గా యూనివర్సిటీ లైబ్రరీ నుంచి ఛాసర్ పుస్తకాన్ని దొంగిలించి తన జూనియర్ ఉమాడేకి యిస్తాడు. బైరంఖానుగా అమెరికన్ దంపతులను కాశీలో గల్లీలు తిప్పుతూ వాళ్ళ వాలెట్‌ని కొట్టేస్తాడు. బారుకి వెళ్ళి చిత్తుగా తాగుతాడు. అలఖ్ నిరంజన్ అవతారం అయిపోయింది. ఇంక రేపు సాల్వడార్ డాలీని అవుతాను అనుకుంటాడు. (“సాల్వడార్ డాలీ” అధి వాస్తవిక చిత్రకారుడు).

ధనస్వామ్యంలో మనుష్యుల్లో ఉన్న ఎక్కువ తక్కువలను బట్టి ఇలాంటి విష ప్రవృత్తి అనేకుల్లో వృద్ధి చెందుతున్నాది. ఈ నాగరికతలో మరో స్వభావంగా, ఇంకో అవలక్షణంగా హిప్పీలుగా మారడం కనబడుతుంది. ఎల్. ఎస్. డి. వంటి మత్తు పదార్ధాలు తిండం, నేరస్తుడిగా మారడం, నేర ప్రవృత్తిని పెంచుకోవడం ప్రపంచంలో సామాన్యంగా కనబడుతుంది. ఈ కథలో శేషాచలపతిరావులోని పాములాంటి ప్రవృత్తి బహు చక్కగా నిరూపించబడ్డాది. ఈ విధమైన మానసిక విశ్లేషణాత్మకమైన రచనలు తెలుగులో బహు తక్కువగా ఉన్నాయి. అయితే మానవ ప్రవృత్తి ఈ విధంగా ఎందుకు అయిందో, ఆ స్వభావానికి కల కారణాలేమిటోనని ఆ మూల కారణాల్లోకి పోయి రాస్తే ఇటువంటి కథలు సమాజంలో మార్పుకి, అలాంటి మానవ స్వభావాన్ని సరిదిద్దడానికి తప్పకుండా ఎంతో ఉపయోగపడతాయి. శేషాచలపతిరావు ప్రవృత్తి అలా తయారవడానికి మూలకారణాల్లోకి పోయి కథ రాసి ఉంటే ఈ కథ విలువ ఇంకా అనేక రెట్లు పెరిగి ఉండేది.

విదేశీయులు చాలా జాగ్రత్తగా ఉంటారు. ముక్కూ మొహం తెలియని బైరంఖానుకి తమ డబ్బున్న వాలెట్ ఎంతమాత్రం యివ్వరు. జనం రద్దీ తోపులాటలో ఆ అమెరికన్ జేబులోంచి వాలెట్‌ని కొట్టేసినట్టు రాస్తే సరిగా ఉండేది.

బాల్యం మంచిదిగా తర్వాత జీవితం చెడ్డదిగా శేషాచలపతికి కన్పట్టుతున్నట్టు కథలో స్పష్టంగా ఉంది. బాల్యంలోకి పోవాలన్న తపన కనపడుతుంది. బాల్య జీవితంలో తనని సంతుష్టి పరిచినది యేదో, తర్వాత జీవితం ఎందుకు ఎడారిలాంటి యదార్థం అయిందో పాఠకులకి తెలియచెపితే కథకి ఇంకా విలువ పెరిగి ఉండేది.

ఈ పాము స్వభావం కల మనుషులు లోకంలో ఉన్నమాట వాస్తవం. యదార్థ జీవితంలో కనిపించే ఆ పాత్రని రచయిత సరిగ్గానే పట్టుకున్నారు”.

చాగంటి తులసి

త్రిపుర కథలు On Kinige

Related Posts:

త్రిపుర జ్ఞాపకాలు

తెలుగు సాహిత్యంలోకి ఓ గుప్పెడు కథలు, కవితలు గెరిల్లాలా విసిరేసి అదృశ్యమైన రచయిత త్రిపుర.

త్రిపుర పూర్తి పేరు ఏంటి?
ఆయన బాల్యం ఎక్కడెక్కడ గడిచింది?
ఆయన ఏం చదువుకున్నారు?
బెనారస్ ఎందుకు వెళ్ళారు?
ఆయన సాహిత్యం వైపు మళ్ళడానికి ప్రేరణ ఎవరు?
ఎక్కడెక్కడ ఉద్యోగాలు చేసారు?
ఆయన భార్యాపిల్లల వివరాలేంటి?
ఏ మాత్రం నిలకడ లేని ఆయనను త్రిపుర రాష్ట్రం ఎలా కట్టి పడేసింది?
కథలని ఆయన ఎందుకు రొటీన్‌గా రాయలేకపోయారు?
భారతికి పంపిన కథ ఆంధ్రపత్రికలోను, ఆంధ్రపత్రికకి పంపిన కథ భారతిలోను ఎలా అచ్చయ్యాయి?
ఆయన రాసిన రెండు కథలకి స్ఫూర్తి ఎక్కడిది?
ఆయనకున్న సాహితీమిత్రులు ఎవరెవరు?
కవితల్ని ఏ సందర్భంలో రాసారు?

నక్సలైట్లకు త్రిపురకు ఉన్న సంబంధం ఏమిటి ?

“త్రిపుర జ్ఞాపకాలు” అనే పేరుతో ప్రముఖ జర్నలిస్ట్ గొరుసు జగదీశ్వర రెడ్డి త్రిపుర గారితో చేసిన ఇంటర్వ్యూ చదివితే ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు లభిస్తాయి.
చక్కని ఇంటర్వూ చేసి, దానిని 2 నవంబరు 2008 నాటి ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రచురించినందుకు గొరుసు జగదీశ్వర రెడ్డి గారికి ధన్యవాదాలు.

త్రిపుర గారి ఇంటర్వ్యూ పూర్తి పాఠాన్ని ఈ దిగువ చిత్రంలో చదవచ్చు.

త్రిపుర గారి కథాసంకలనం “త్రిపుర కథలు” డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. . అచ్చులో ప్రస్తుతం అందుబాటులో లేని ఈ పుస్తకాన్ని ఇ-బుక్ రూపంలో కినిగె నుంచి అందుకోండి.

త్రిపుర కథలు On Kinige

ఈ ఇంటర్వ్యూ పునఃప్రచురణకు అనుమతిచ్చిన గొరుసు జగదీశ్వర్ రెడ్డి గారికి నెనర్లు.

Also visit fan blog of author Tripura @ http://tripura-telugu-author.blogspot.com/

Related Posts:

త్రిపుర కథలు

సెప్టెంబరు 2, 1928 నాడు జన్మించిన త్రిపుర, తన మొదటి కథ 31-5-1963 నాటి ఆంధ్రపత్రికలో ప్రచురించారు. ఆ తరువాత 7 కథలు భారతిలో ప్రచురితమయ్యాయి. వీరు రాసి కన్నా వాసి మిన్న అని విశ్వసించి 1963 – 1973 మధ్య కాలంలో 13, 1990-91 మధ్యలో 2 కథలు… మొత్తం 15 కథలు వ్రాశారు. వీటిలోని విషయం, శైలి, గాఢత విమర్శకుల నుండి ప్రశంసలు అందుకున్నాయి, పలువురిని త్రిపుర అభిమానులుగా మార్చాయి. ఈ కథలు రెండు ముద్రణలు పొంది పాఠకులని అలరించాయి. ఇప్పుడు కినిగె వీటిని సరికొత్తగా ‘ఈపుస్తకం’గా కనక ప్రసాద్ ముందుమాటతో, సరికొత్త అలంకరణతో, త్రిపుర గారి మాటతో మీ ముందుకు తీసుకువచ్చింది. చక్కని తెలుగు సాహిత్యం ఆస్వాదించాలనే తెలుగు పాఠకులకు ఒయాసిస్సు లాంటివి ఈ త్రిపుర కథలు.

* * *

త్రిపుర కథలు On Kinige

భౌతికంగానూ, మానసికంగానూ, ఈ కథల పరిధి చాలా పెద్దది. ఫ్లోరిడా, వారణాశి, కేరళ, రంగూన్, థాయిలాండ్, సరిహద్దు ప్రాంతాలు – ఎన్నో చుట్టి వస్తాయి యీ కథలు. జెన్ బౌద్ధం మొదలు నక్సలిజం దాకా అనేక శ్రేణుల్లో తత్త్వచింతన ఈ కథల్లో ఉంది.

ఈ కథలు చదువుతుంటే, నేను ఇలాంటివి రాయగలనా అనిపించింది. అంతకన్న మెచ్చుకోలు ఏముంటుంది? ఒక కథకుడు మరొక కథకుణ్ణి గురించి చెప్పేటప్పుడు.

- పాలగుమ్మి పద్మరాజు

త్రిపుర కథలు, కవితలు, సంభాషణలు, మౌనం ఇవి వేరు వేరు కావు. అవన్నీ కలిసి అల్లే దారులు ఎంతో విస్తారము, సాధారణమైన అనుభవాల కంటె లోతు, అపరిచితమైన సృజనావరణానికి దిక్సూచికల వంటివి.

ఈ కథల్లోని మాటలు కథను నిర్వహించటం కోసం కథకుడు ప్రణాళిక వేసుకొని మాట్లాడిస్తే అంటున్నట్టు మాట్లాడవు. ఇతివృత్తాన్ని నిర్మించి కథను ముందుకు నడిపించడం కోసం మాట్లాడవు. కథ ఆవరణం అంతా ఆంతరంగికం; కథ నడిచేది లోకంలోనే అయినా దాని అసలు వేదిక పాత్రల మనో రంగమే.

- కనక ప్రసాదు