సమాజంలో జరిగే వింత పోకడలకు అద్దం పట్టిన నవల – సయ్యాట

సయ్యాట నవల చదివేకొద్దీ చదవాలనిపిస్తుంది. ఆధునిక సమాజంలో ఉండే పరిస్థితులు అన్ని ఈ నవలలో ఉన్నాయి. రచయిత పేరుగాంచిన ఐపిఎస్ అధికారి పి.వి. సునీల్‌కుమార్ కావడంతో ఈ నవలలో ఉన్న అంశాలు అన్ని వాస్తవానికి దగ్గరగా ఉన్నాయి. కొన్ని సంఘటనలు మనం నిత్యజీవితంలో చూస్తూ ఉంటాం. మరి కొన్ని వింటూ ఉంటాం. మనం చదువుతున్నప్పుడు ఈ సంఘటనలు అన్ని నిజంగా జరిగాయి కదూ అనిపిస్తుంది. కానీ ఈ నవలలో వచ్చిన అంశాలన్నీ నూటికి నూరుపాళ్ళు నిత్యసత్యాలు. స్త్రీ పాత్రలు నాలుగు ఉన్నప్పటికీ, ఒక్కొక్క పాత్రలో ఒకొక్క ఔచిత్యం మనకు కనబడుతుంది. ఇద్దరు స్నేహితుల మధ్య సరదాగా జరిగిన పందేన్ని రచయిత ఎంతో చక్కగా వివరించారు. భార్యాభర్తల మధ్య అనురాగం ఏ విధంగా ఉంటుందీ, భర్త ఎంత చెడు పనులు చేస్తున్నా భార్య సహించడం, మరో భార్య వాటిపై నిఘా పెట్టడం వంటి విషయాలు ఎంతగానో రంజింపజేస్తాయి. పశ్చిమ బెంగాల్ ప్రజల జీవన వ్యధ, అక్కడ ఒక వర్గం పడుతున్న బాధలు కూడా ఉన్నాయి. గిరిజనులు దోపిడీ ఎలా జరుగుతుందీ వివరించారు. ఆధునిక ప్రపంచంలో ఉన్న సంఘటనలూ వీటిలో రచయిత కళ్ళకు కట్టినట్టు చూపించారు.

దొంగ స్వామీజీలు నేటి యువతను ఎలా వంచిస్తున్నారో ఉంది. ఈ నవలలో ఇద్దరు యువకులు తరుణ్, రాహుల్ పందానికి ఒక నడి వయస్సు గల ముకుందరావు మధ్యవర్తిగా ఉండడం, బ్రహ్మానందస్వామి వ్యవహారం ఏ విధంగా బట్టబయలైంది, నేటి టివి ఛానళ్ళలో పని చేస్తున్న యాంకర్ల జీవితం, సాఫ్ట్‌వేర్ కంపెనీ ఉద్యోగుల విషయాలూ ఉన్నాయి. అయితే, ఈ నవల చివరిలో రచయిత మిత్రుడు మూర్తి ఈ నవల సమీక్షని ఎంతో చక్కగా చేసారు. నేటి యువతరం ఈ నవలను చదివి ఎన్నో తెలియని విషయాలని తెలుసుకుంటారు. అయితే ఆంగ్లం రాని వారికి ఈ నవలలో ఉన్న కొన్నిఆంగ్ల పదాలకు అర్థం తెలియక తికమకవుతారు.

టివి గోవిందరావు
వార్త దినపత్రిక, ఆదివారం అనుబంధం 8 జూలై 2012

* * *

సయ్యాట నవల డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్‌ను అనుసరించండి.
సయ్యాట On Kinige

Related Posts:

అద్దంలో ఆ ఊరి చరిత్ర

ఉన్న వూరు కన్న తల్లి సమానమంటారు. అమ్మను ఎలా మరిచిపోలేమో పుట్టిపెరిగిన ఊరును కూడా మరిచిపోలేం. దేశ చరిత్రలు ప్రాంతీయ చరిత్రలు రాయటం సులువు. గ్రామ చరిత్ర రాయటానికి ముందుగా పుట్టి పెరిగినవూరిపై మమకారముండాలి. ఆ వూరు చరిత్ర, సంస్కృతి, వ్యక్తులు, అభివ్యక్తులపై అధికారముండాలి. ఇన్నీ ఉన్నా ఒక్కోసారి చారిత్రక ఆధారాలు దొరకవు. తెలిసిన ఒకరిద్దరు పెద్దలూ తమ పిల్లలతో కలిసి ఉండటానికి దూరప్రాంతాలకు నివాసాలు మార్చుకున్న సందర్భాల్లో ఇది మరింత కష్టమవుతుంది. మిగతా వృత్తుల్లో ఉన్నవారు గ్రామచరిత్రలు రాసే కన్నా, ఉపాధ్యాయులు ఆ పనికి పూనుకుంటే మాత్రం ఊరి చరిత్రకు నిజంగా న్యాయం జరుగుతుంది.

తెలంగాణ సాహితీకారుల జాబితాలో చేరాల్సిన కవులనూ, వారి రచనలనూ పొందుపరచటానికి కృషి చేసిన సాహితీపరుడు. చిన్నప్పట్నుంచి తాను విన్న జానపద గేయాలు, నోటి పాటల వివరాలను సేకరించిన అసలు సిసలైన జానపదుడు. చరిత్ర అంటే పాలకులు మాత్రమేకాదు, పాలితులు కూడానని గ్రామ చరిత్రకు ఆనవాళ్ళైన చారిత్రక శకలాలతో పాటు గ్రామ పెద్దల జ్ఞాపకాలను కూడా ఒక్క చోట చేర్చి గ్రామం పుట్టినప్పటి నుంచి నాలుగు వందల ఏళ్ల చరిత్ర సమాహారంగా పుస్తకాన్ని తీర్చిదిద్దారు యాదగిరి. మోడెంపల్లిగా ఉన్న బేచిరా కుగ్రామ పునాదుల్ని తవ్వి ఎల్లమ్మ రంగాపురం ఆనవాళ్ళను వెదికి పట్టుకొని, గ్రామ నామాలపై గతంలో చేసిన పరిశోధనలకు దీటైన రచన చేశారు.

బిజినేపల్లి దగ్గరున్న నందివడ్డమాను (వర్థమానపురం) రాజధానిగా చేసుకొని, రాయచూరుదాకా పాలించిన గోన వంశీయుల కాలంతోనే అంటే క్రీ.శ.13వ శతాబ్దంలో ఆ వూరు పురుడు పోసుకుందని నిరూపించారు. వీర వైష్ణవ విజృంభణతో ఆలయాలు, వాటిలో విగ్రహాలతో పాటు గ్రామ నామాలు కూడా మారిపోయాయి. చదివేవారికి గ్రామ గ్రంథాలయం,పేరొందిన సాహితీ పరులు, వారి రచనలు, వ్యవసాయ పద్ధతులు, పాడి పంటలు, తూనికలు, కొలతలు, గ్రామ దేవతలు, ఆలయాలు, అపురూప శిల్పాలు, అన్ని విషయాలు యాదగిరిగారి పరిశోధనా పటిమకు నిదర్శనాలు.

జి.యాదగిరిగారు స్వయానా కవి, కళాకారుడు కాబట్టి ఆయన ఒంట పట్టించుకొన్న ఈ రెండు లక్షణాలు ఆయన వ్యక్తిత్వంలో భాగమై, వంద సంవత్సరాల కవిత్వం, ఏభై ఏళ్ల నాటక రంగం, యక్షగానాలు, బైలాటలు, యక్షగాన కళాకారులు వైద్యం గోపాల్,చాకలి ఎల్లయ్య, బెస్త బసవయ్య, రాచమళ్ళ గొల్లనారాయణ, బెస్త కృష్ణయ్య, ఒగ్గు కథకులు కురువ బీరన్నలపై అందించిన సమాచారం ఆ గ్రామాన్ని మరికొన్ని శతాబ్దాలపాటు బతికించుకుంటుంది. తాను స్వయంగా చిత్రకారుడు, విశ్వకర్మ అనువంశీకుడు, గ్రామానికి చెందిన శిల్పాలు, చింతోజు వీరయ్య, బెస్త మల్లయ్య, తోలుబొమ్మల కమ్మరి చంద్రయ్య, రంగయ్యగారు శిల్పితో పాటు వడ్ల లింగయ్య, ఆర్ చంద్రశేఖర్ లను వారు వేసిన చిత్రాలను శిల్పాలను పేర్కొంటూ గ్రామ చరిత్రలో, సాంస్కృతిక అనుబంధాలలో తానూ ఒక శకలమైనాడు జి.యాదగిరి. ఎల్లమ్మను తవ్వితీసి మసక బారిన చరిత్రను అద్దంలా తీర్చిదిద్ది గ్రామం పేరు ప్రఖ్యాతులు ఈ తరానికి అందించటానికి పడిన శ్రమ అంతా ఇంతా కాదు. కవులు, కళాకారులు, వృత్తి పనివాళ్ళు, పండుగలు, పబ్బాలు, జాతర్లు, సంబరాల ఫోటోలను సేకరించి ఆ వూరి చరిత్రతో పాటు నడుస్తున్న చరిత్రను కళ్ళకు కట్టినట్టు, మన ముందర ఒక్కో దృశ్యం కదలాడేటట్లు వర్ణించిన తీరు యాదగిరి గారి తపనకు తార్కాణం.

ఈరోజుల్లో చేష్టలుడిగిన ముసలోళ్ళు, శిథిలమైన గుళ్ళు, పుస్తకాల గ్రంథాలయం, ఊరు చుట్టూ దడి గట్టినట్టు పురాతన శిల్పాలు, ఇవన్నీ ఎవరిక్కావాలి? ఆధునికత పేరుతో నిన్నను కూడా మరిచే నేటి మనను తట్టిలేపి, వాటి ప్రాముఖ్యతను వివరించి, గ్రామంలోని ప్రతివారూ గర్వపడేలా మా వూరికీ చరిత్ర ఉంది. సాహిత్యం ఉంది, ఆటలున్నాయి. పాటలున్నాయి అన్న సోయిని రగిలించటంలో ఆయన పెకలించిన గత కాలపు పెళ్ళలు దాచినా దాగని సత్యాలు.

తెలంగాణలో గ్రంథాలయోద్యమం 20 వ శతాబ్దపు తొలినాళ్ళలో ప్రారంభమైనా, రంగాపురంలో 1951 సంవత్సరంలో ‘బాలవాణి’ గ్రంథాలయాన్ని నాటి యువకులు ఎలా నడిపించుకున్నారో చదివినవారికి ఏ మాత్రం స్వార్థ చింతనలేని గ్రామీణుల స్వచ్ఛమైన ఆలోచనలు ఈ తరం యువకుల్ని ప్రేరేపిస్తాయి.
ఇక శ్రామిక రంగంలో జిల్లెళ్ళ జంగయ్య, షబ్బీరలీలతో జరిపిన ఇంటర్యూలు, మానవ సంబంధాలను, నాటి జీవన విధానాన్ని, విద్య, రాజకీయ రంగాలు, వివిధ రంగాల్లో మొదటి వ్యక్తులు, ఉద్యోగులు, ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలు, ప్రోత్సాహకాలు, అరుదైన 1869 నాటి రాజాచందూలాల్ రామగిరి సనదులను సేకరించి పి హెచ్ డీ పట్టాకు సరిపడ సమాచారాన్ని సమకూర్చాడు.

పుస్తకం చివర్లో రంగాపురం ఎల్లమ్మ దేవాలయం, ఎల్లమ్మ ప్రశస్తి, ఊరి ప్రజలనోళ్ళలో నానుతున్న తెలంగాణ సామెతలు, పొడుపు కథలు మనం మరిచిపోయినా యాదగిరిగారు మాత్రం అక్షరబద్ధం చేసారు. తాను సంప్రదాయ కుటుంబంలో జన్మించి, సాంప్రదాయ విద్యనభ్యసించినా, అభ్యుదయ భావాల పట్ల ఆకర్షితుడై, ఉద్యమాల బాటపట్టి, కొత్త బాణీలు కట్టి ఆ వూరిలో ఉద్యమాల్లో పాల్గొన్న త్యాగ జీవుల నేకరువుపెట్టారు.

పేరు కోసం పాటుపడని, పేరు చెప్పటానికే ముందుకు రాని సామాన్య జానపద గాయక, గాయకురాళ్ళ వివరాలతో పాటు వారి పాటల్ని కూడా సేకరించి మనముందుంచారు.
తన అరవై ఏడేళ్ల జీవన గమన నేపథ్యంలో కాచి వడపోసి మానవ సంబంధాలను మెరుగుపరచడంలో ఆ వూరి ఆచార వ్యవహారాలు ఎలా ప్రభావం చూపుతాయో వివరిస్తూ, గ్రామ సమాచారాన్ని చిత్రపటాలు, ఫోటోలతో సహా ప్రచురించి గ్రామ చరిత్రను నిక్షిప్తం చేయటమే గాక గ్రామ చరిత్రలు ఇలా రాయాలని, కొత్త ఒరవడిని దిద్ది, ఎల్లమ్మ రంగాపురానికి ఎన్నో వన్నెలద్దారు జి.యాదగిరిగారు.

ఈమని శివనాగిరెడ్డి
ఆదివారం వార్త 1 జూలై 2012

* * *

ఎల్లమ్మ రంగాపురం గ్రామ చరిత్ర పుస్తకం డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. కినిగె ద్వారా ప్రింటు పుస్తకాన్ని కూడా 20 శాతం తగ్గింపు ధరకు తెప్పించుకోవచ్చు. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్‌ని అనుసరించండి.

ఎల్లమ్మ రంగాపురం గ్రామ చరిత్ర On Kinige

Related Posts:

అక్షర పరిమళం (“ద్రోహవృక్షం” పుస్తక సమీక్ష)

మనసులో బాధ బరువు మోస్తున్నప్పుడు తేలికైన పుస్తకం ఒకటి చదివితే హృదయంలో అక్షరాల చిరుజల్లుల పరిమళం వెల్లివిరుస్తుంది. అపుడు ఆలోచనల వేడి, సాంద్రత తగ్గుముఖం పడుతుంది. అటువంటి పుస్తకాలు తెలుగులో చాలా తక్కువే అయినా డాక్టర్ వి. చంద్రశేఖరరావు రాసిన ‘ద్రోహవృక్షం’ ఈ కోవకి చెందినదే. ఈ పుస్తకం చదువుతుంటే మనం ఎక్కదో విహరిస్తున్నామనే భావన, అక్షరాలు మనల్ని వెంబడిస్తున్నాయనే అపోహ, పాత్రలన్నీ సుపరిచితాలే అనే భావన మనలో చోటుచేసుకునే ముఖ్య అనుభూతులు. బహుశా రచయితకు అడవులు, పూలు, పర్యటనలు, ప్రకృతి అంటే అమితమైన అనురాగం అనుకుంటా. అందుకే పాఠకుడి చిటికెనవేలు పట్టుకుని తెలియని ప్రపంచం వైపు తీసుకు వెళుతుంటారు. మనం ఎక్కడికి వెళుతున్నాం, ఏం తెలుసుకుంటున్నాం అనే జిజ్ఞాస కూడా పాఠకుడిలో లేకుండా చేస్తారు. ఒకసారి కాదు, పేరాను రెండుసార్లు చదివినా మనకు తెలియని అనుభూతి మనల్ని వెంటాడినట్టే అనిపిస్తుంది. ఇందులో ఇరవై కథలు ఉన్నట్టు చెప్పారు. కానీ ఒక నవలలో 20 అధ్యాయాలు అన్నట్లుగా అనిపిస్తుంది. ఒక కథకు, మరో కథకు ఎక్కడో ఏదో కనిపించీ, కనిపించకుండా సన్నని దారం ఉన్న భావన కలుగుతుంది. సుందరం, పూర్ణలు రచయితకి అత్యంత ప్రియమైన పాత్రలే. సుందరమైన ప్రకృతిలోనే పరి’పూర్ణ’మైన జీవితం అనుకోవలా? ఇందులో ఏ కథ బావుంది? అని ప్రశ్నిస్తే, ఏ కథ బావుండలేదు? అని ఎదురుప్రశ్న వేయాలనిపిస్తుంది. మరో మాటలో చెప్పాలంటే ఇదో వచన కావ్యంలా అనిపించింది.
‘కాలం ఎగిరిపోవటాన్ని నేను గమనించాను. సుందరం ఒక్కడే, ఈ ప్రపంచంలో అనిపించడం మొదలుపెట్టింది. సుందరం అనే ఆలోచన లేకపోతే నేను శక్తిహీనంగా మారిపోవటం గమనించాను’ (55 పేజి) అని ది లైఫ్ అండ్ టైమ్స ఆఫ్ సత్యప్రకాశంలో ఒక చోట ఉన్న పేరా. ఇది అచ్చం భావకవితలా ఉంది కదూ. అతను అతనిలాంటి మరొకడు అనే శీర్షికగల కథలో ఇలా ఉంది. “ఆ చెట్లపై నివాసమున్న వందలాది పక్షుల శవాలు, పొదల చాటున, రోడ్ల పక్కన. అదో భయానకమైన దృశ్యం. హాస్టల్‌కు చేరే నీళ్ళ పంపుల్లో సీవేజ్ వాటర్ కలిసి, హాస్టళ్ళంతటా డయేరియాలు, విషజ్వరాలు వ్యాపించేది కూడా ఆ నెలలోనే…” (89 పేజి) సుందరం కలలది ఏ రంగు అనే కథలో ‘ కమల వెంటనే తేరుకొని, కళ్ళలోని అందోళనని తుడిచేసి (కొడుకు చేసే బెదిరింపులు కాసేపు మరిచిపోయి) తనదైన మనోహరాన్ని ముఖంపైకి తెచుకొని ఎట్లా ఉన్నావయ్యా… ఎన్నేళ్ళయ్యింది నిన్ను చూసి, పిరికిగా, భయంగా ఉండేవాడివి, గట్టిగా పట్టుకుంటే కందిపోయే పూవులా ఉండేవాడిని’ అని (పేజి 131) ఇందులో పాత్రలతో సంబంధం లేదు. ఏ పేరా చదివినా ఎక్కడి నుంచి ఎక్కడికి చదివినా ఆసక్తికరంగానే ఉంటుంది. అదే రచయిత ప్రత్యేకత.
ఇక పోతే, హెచ్. నరసింహం ఆత్మహత్య శీర్షికన హైదరాబాద్ లోని ప్రదేశాలను పరిచయం చేస్తూ, ఎర్లీ టీన్స్‌లో గోల్కొండ నా ఎడ్వెంచర్ స్పాట్, ఫలక్‌నుమా నా రహస్య డేటింగ్ ప్లేస్, ఆ రోజుల్లో ప్రేమికులకు కొన్ని ప్రత్యేక ప్రదేశాలు ఉండేవి. ఇందిరాపార్కు, టాంక్‌బండ్, బిర్లామందిర్ (ముఖ్యంగా మెట్ల పైన), గండిపేట చెరువు, యూనివర్సిటీ లోపలి రోడ్డు… (పేజి 217) అంటూ చదువుతూ ఉంటే యవ్వనం దాటిన వారికి మధుర స్మృతులు గుర్తొస్తుంటాయి. ‘హైదరాబాద్ రోడ్లపైనే నా బాల్యమంతా గడచిపోయింది. గుర్తు పట్టలేనంతగ ఆ రోడ్ల రూపం మారినా, అపార్ట్‌మెంట్లు, రంగు దీపాలు, పెద్ద పెద్ద మాల్స్, అయినా ఆ రోడ్లపై పాదం పెట్టగానే ఒక గాఢమైన పరిమళం, నన్ను ఇప్పటికీ చుట్టుముట్టుతుంది. సజీవమైన భాష, ఆత్మీయమైన పలకరింపు, ఎరుపురంగు మెహందీలు, గాలి పటాలు, పురాతనమైన ఆత్మలకు సరికొత్త అలంకరణలు, రోడ్లను చూడగానే, జ్ఞాపకాల ప్రదర్శన నన్ను వివశురాల్ని చేస్తుంది.’
ఏ పేజి తిరగేసినా, ఏదో కొత్తదనం, మాధుర్యం మనల్ని పలకరిస్తునే ఉంటుంది. మనల్నిమనం వెనక్కి తిరిగి ఇలానే చూసుకోవాలనిపిస్తుంది. ఇలాంటి బాల్యం ద్రోహవృక్షంలోనూ దర్శనమిస్తుంది. పుస్తకం చదువుతుంటే కొత్త విషయాలు ఎన్నో తెలుసుకునే అవకాశం లభిస్తుంది. ఎక్కడో ఎక్కడో ఇలాంటి సంఘటనలు మనకు తారసిల్లిన భావం కలుగుతుంది.

టి. వేదాంతసూరి
(వార్త, ఆదివారం అనుబంధం, 17 జూన్ 2012)

* * *

ద్రోహవృక్షం డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్‌ను అనుసరించండి.

ద్రోహవృక్షం On Kinige

Related Posts:

ప్రశ్నల్ని సంధించే కథలు

రెండు దశాబ్దాలుగా తెలుగువారి జీవితంలో అనేక మార్పులు వస్తున్నాయి. ఈ మార్పులకు మూలం ప్రపంచీకరణ. మన తెలుగువాడు పి.వి. నరసింహారావు ప్రధానమంత్రి అయ్యాక ప్రవేశపెట్టిన ఉదారవాద ఆర్థిక విధానాలు ఫలితంగా ప్రైవేటీకరణ విశ్వరూపం దాల్చింది. మార్కెట్ శక్తులు విస్తరించాయి. ఈ కారణంగా గాలి, నీరు కూడా అమ్మకపు సరుకులయ్యాయి. నీటితో కోట్లాది రూపాయలలో వ్యాపారం సాగుతుంది. కానీ ఆ నీటి చెంత పని చేసే వాడికి మాత్రం మంచినీళ్ళు కూడా లభించవు. ఈ కఠోర వాస్తవాన్ని హృదయం చెమర్చే రీతిన కథగా రాశారు జి. ఉమామహేశ్వర్. ఆ కథ పేరు ‘వాటర్’. నీళ్ల కోసం యుద్ధాలు జరిగే ఈ పరిణామానికి మూలం ప్రపంచీకరణ అనుకూల విధనాల్లో వుంది. దీనిని నర్మగర్భంగా చెబుతూ పాఠకులని ఆలోచింపజేస్తారు రచయిత.
ఉమామహేశ్వర్ పదేళ్ళ పైబడి కథలు రాస్తున్నారు. మొదటిసారిగా ‘పరాయోళ్ళు‘ శీర్షికన ఆయన కథల సంపుటి వెలువడింది. ఇందులో పద్నాలుగు కథలున్నాయి. రెండు కథలు మినహా మిగతావన్నీ ఉదారవాద, ఆర్థికవాద విధానాల దుష్ప్రభావం ప్రజల జీవితాన్ని ఏ విధంగా చిన్నాభిన్నం చేసిందో చెబుతాయి. ‘అభివృద్ధి’ గురించి పాలకులు చెప్పే కబుర్లని తిరస్కరించే చెంచుల చైతన్యస్థాయిలోని పరిణితిని ‘చెంచుమిట్ట’ కథ చెబుతుంది. రకరకాల స్కీములతో మనుషులని లోబరుచుకోవాలని చూసే మార్కెట్ మాయాజాలాన్ని తూర్పూరాబట్టే కథ ‘గొర్రె చచ్చింది’. అవసరం లేనివాటిని అవసరాలుగా భ్రమింపజేసి సొమ్ము చేసుకునే మార్కెట్ కుతంత్రాలని ప్రశ్నించే కథ ‘ది ధూల్‌పేట్ ఇండస్ట్రీస్ (పై) లిమిటెడ్’. జనాల బలహీనతల మీద ఆడుకునే మార్కెట్ వ్యూహాలు ఎంత దుర్మార్గంగా ఉంటాయో ఈ కథలో చూస్తాం.
‘పరాయోళ్ళు’ కథ ఇవాళ తెలుగునాట నెలకొన్న రాజకీయాలకు సరిగ్గా ప్రాతినిధ్యం వహిస్తుంది. ఎక్కడివాళ్ళు ఎక్కడికైనా వెళ్ళచ్చు, తప్పు లేదు. కానీ తమ ఊరునీ, తమ బతుకునీ దెబ్బతీస్తామంటే మాత్రం పరాయోళ్ళ దౌష్ట్యాన్ని ప్రశ్నిస్తారు. ప్రపంచీకరణ సందర్భంగా ఎక్కడ్నించి ఎక్కడికయినా వెళ్ళి బతకడం సాధారణాంశం. ఈ విధంగా ఇందులోని పద్నాలుగు కథలు విభిన్న సమాజికాంశల్ని చర్చకు పెడతాయి. ప్రభుత్వ ఆర్థిక విధానాల ఫలితంగా చెదిరిపోతున్న బతుకు జాడల్ని పట్టి చూపుతాయి. సామాజిక సంక్షోభాలకు సంబంధించిన అనేక ప్రశ్నల్ని సంధిస్తాయి.

వై. వసంత
(22 ఏప్రిల్ 2012 నాటి వార్త ఆదివారం అనుబంధం లోని పుస్తక సమీక్ష నుంచి)

* * *

పరాయోళ్ళు కథాసంపుటి డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. మరిన్ని వివరాలకు ఈ లింక్‍ని అనుసరించండి.
పరాయోళ్ళు On Kinige

Related Posts: