రాలిన కథా కుసుమం

తన రచనలలో మార్మికతకు పెద్దపీట వేసి, కేవలం 15 కథలతోనే చదువరులను అభిమానులుగా మార్చుకున్న త్రిపుర 24 మే 2013 న దివంగతులయ్యారు.

సెప్టెంబరు 2, 1928 నాడు జన్మించిన రాయసం వెంకట త్రిపురాంతకేశ్వర రావు (ఆర్.వి. టి. కె. రావు) ఉరఫ్ త్రిపుర, తన మొదటి కథ 31-5-1963 నాటి ఆంధ్రపత్రికలో ప్రచురించారు. 2012-13 నాటికి త్రిపుర సాహితీసృజనకి యాభై సంవత్సరాలు పూర్తవుతాయి.

త్రిపుర కథల విలక్షణత అయన ఎత్తుగడలో ఉంటుంది, మొదటే అర్థం కాలేదని పుస్తకం పక్కన పడేస్తే మాత్రం కొన్ని అద్భుతమైన కథలని కోల్పోయిన వారవుతారు. మొదట అర్థం కానట్టు అనిపించినా, చదివే కొద్దీ కొత్త భావాలేవో అనుభవంలోకి వస్తున్నట్లు, మళ్ళీ మళ్లీ చదవాలనుకుంటారు పాఠకులు. కథలు సంక్లిష్టంగా అనిపిస్తాయి, వాటి పరిథి పెద్దది – ఫ్లోరిడా, వారణాశి, కేరళ, రంగూన్, థాయిలాండ్, సరిహద్దు ప్రాంతాలు – ఎన్నో చుట్టి వస్తాయి యీ కథలు. జెన్ బౌద్ధం మొదలు నక్సలిజం దాకా అనేక శ్రేణుల్లో తత్త్వచింతన ఈ కథల్లో ఉంది. చదివేకొద్దీ, మరింతగా చదివించే గుణం ఉన్న కథలివి. ఈ కథల్లో సర్రియలిజం, ట్రాన్స్‌పరెంట్ చీకటీ ఉండి అంతర్ముఖీనమైపోయే ఒక కన్ఫెషనల్ ఎలిమెంట్ కనపడుతుందని సుధామ అంటారు.

త్రిపుర కథలే కాకుండా కవితలూ అద్భుతంగా ఉంటాయి. తన 47వ పుట్టిన రోజు సందర్భంగా ” సెగ్మెంట్స్” అనే ఆత్మకథాత్మక దీర్ఘకవితని రాసారు. దీన్ని మరో ప్రముఖ కవి వేగుంట మోహన్ ప్రసాద్ త్రిపుర స్వశకలాలు పేరుతో తెలుగులోకి అనువదించారు. ఫ్రాంజ్ కాఫ్కాకి వీరాభిమాని అయిన త్రిపుర ఆయన ప్రేరణతో, “త్రిపుర కాఫ్కా కవితలు” రాసారు. కాఫ్కా రచనల్లోని నిగూఢత్వం ఈ కవితల్లోనూ గోచరిస్తుంది. ఈ పుస్తకాన్ని “సాహితీమిత్రులు” ప్రచురించారు. 1980 – 1988 మధ్యలో త్రిపుర రాసిన 16 కవితలని “కవిత్వం ప్రచురణలు” వారు “బాధలూ -సందర్భాలూ” అనే శీర్షికతో నవంబరు 1990లో ప్రచురించారు.

“త్రిపుర కథలు, కవితలు, సంభాషణలు, మౌనం ఇవి వేరు వేరు కావు. అవన్నీ కలిసి అల్లే దారులు ఎంతో విస్తారము, సాధారణమైన అనుభవాల కంటె లోతు, అపరిచితమైన సృజనావరణానికి దిక్సూచికల వంటివి” అని అంటారు కనకప్రసాద్.

చక్కని సాహిత్యం ఆస్వాదించాలనే తెలుగు పాఠకులకు ఒయాసిస్సు లాంటివి ఈ త్రిపుర రచనలు.

తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేయడంలో తనవంతు పాత్ర పోషించి, కథనరంగం నుంచి నిష్క్రమించిన త్రిపురకి హృదయపూర్వక నివాళి అర్పిస్తోంది కినిగె.

Related Posts:

‘ప్రయాణీకులు’ కథపై వాకాటి పాండురంగారావు అభిప్రాయం

చక్కని తెలుగు సాహిత్యం ఆస్వాదించాలనే తెలుగు పాఠకులకు ఒయాసిస్సు లాంటివి త్రిపుర కథలు. రాసి కన్నా వాసి మిన్న అని విశ్వసించిన త్రిపుర గారు 1963 – 1973 మధ్య కాలంలో 13, 1990-91 మధ్యలో 2 కథలు… మొత్తం 15 కథలు వ్రాశారు. వీటిలోని విషయం, శైలి, గాఢత పలు విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. ఈ కథలు డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తాయి.

ఈ సంకలనంలోని ‘ప్రయాణీకులు’ కథపై వాకాటి పాండురంగారావు గారి అభిప్రాయం చదవండి.

* * *

“ఎవడి జీవితం వాడికో పజిల్. పదబంధ ప్రహేళిక. గళ్ళ నుడికట్టు.

‘క్లూ’ దొరికిన క్షణం ఆకాశం; దొరకని యుగం అథఃపాతాళం. ఈ పజిల్‌ను శబ్దార్థ చంద్రికతో సాధించే వారు కొందరు, కేవలం పెన్సిలు ముక్కతో చేసే వారు కొందరు,’క్లూ’ ల కోసం టార్చిలు వేసే వారింకొందరు, ‘శ్రీ మహాలక్ష్మీ’ అంటూ ముడుపు కట్టి రంగంలోకి దిగే వారు కొందరు. దీనిని చదరంగం బల్లగా ఆడేవాళ్ళు కొందరు. దీన్ని మడిచేసి ఇలాటిదొకటి లేదనట్లుగా బతికేసేవాళ్ళు చాలా కొందరు….

అన్ని గళ్ళూ ఎప్పటికి పూర్తి అయ్యేను? బహుమతి ఏమిటి? అసలు ‘కీ’ సొల్యూషన్ అంటూ ఉందా? అర్థంలేదు కాబోలు, అంతం లేదు కాబోలు. అలాగని మనసు వూరుకుంటుందా? చెయ్యని దానిని చెయ్యమంటుంది. చేసిన దానిని ‘అబ్బే’ చేయకుండా ఉండాల్సింది అంటుంది, మనో ఫలకంప్యూటర్ లోకి ఎవరో, ఎప్పుడో, ఎక్కడో ‘ప్రోగ్రాం’ చేసిన కార్డు ఒక్కొక్కటి ‘డిసైఫర్’ అవుతున్నకొద్దీ భోగం, రోగం, యోగం పడతాయి పూర్ మానవుడికి.

జ్ఞాపకాలు తరుముతోంటే అడుగులు పడని దారుల వెంట పరుగులు తీస్తాడు. ‘అదిగో అవతల వాడెవడో వెడుతున్నది రాజ మార్గమేమో? నే తొక్కినది మందమతుల సందు కాబోలు’ అన్న సందియం పీడిస్తుంది. కాని కాలం – ట్రాఫిక్ ఎప్పుడూ వన్-వే యే: ఇక్కడ ‘బావా ఎప్పుడు వచ్చితివీవు’-ఒక్కసారే పాడతారు. నోవన్స్ మోర్! నో ఎన్ కోర్! జీవితం కొవ్వొత్తి ఒక్కసారే వెలుగుతోంది: చివరకు జ్ఞాపకాల ముద్దలు నిర్జీవంగా, అస్తవ్యస్తంగా పేరుకుంటాయి. ఏడ్వాలో నవ్వాలో తెలియదు.

సరేలెమ్మని కాంచనమాల కోసం బయలు దేరినవాడు కనకాలుతో స్థిరపడతాడు. కలెక్టర్ కావలసిన వాడు క్లర్క్ అవుతాడు. కాని, జీవితం రైలులో ఏదో ఒక పెట్టెలోనో, ఒక స్టేషన్ లోనో కాంచన మాల, దాని మొగుడూ ఊడిపడతారు. తలుపులు తెరుచుకుంటాయి. అలారం మోగుతుంది. కొవ్వొత్తి మైనపు ముద్దు అసహ్యంగా కదులుతాయి. ‘నిజంగా నేనొక నిధిని కోల్పోయానా?’ వాడెవడో ఈ క్షణం హీరోలా మరు క్షణం నీరోలా, ఇంకోక్షణం నారోలా కన్పిస్తాడేం? నిన్నటి అద్దం మీది ఆ వికారం నా మొహమేనా? నా పెరటి కోకిల గానం ఇంత వికృతంగా వుందేం?…. అన్నీ సందేహాలే!

అలాంటి అతలా కుతలంలో, సదసత్సంశయంలో పడిన ‘భాస్కారియో’ కథ ‘ప్రయాణీకులు’.

తనొకప్పుడు కోరిన శాంత (కళ్యాణి?)ను తన జీవితంలోంచి నడిపించుకు వెళ్ళిపోయిన నాగుపాము లాటి మిత్రుడు ‘శేషియో’ హఠాత్తుగా ఏరుపోర్టులో ఊడిపడి
“శాంత ఒక జబ్బు. దాన్నుంచి నిన్ను విడుదల చేశాను. ఆ జబ్బును నేను త్వరలోనే వదల గొట్టుకున్నాను.” అన్నా-

మళ్ళీ ఇంకో సారి తన జీవితంలోకి ఎలాటి రిగ్రెట్సూ లేకుండా, ఝామ్మున, రాజాధి రాజులా వెళ్ళి పోబోతున్న శేషాచలపతి తన భార్య గురించి చెబుదామని-
“సుశీలను చూడలేదు నువ్వు. ఎంతో ‘ఇద’వుతుంది” అని భాస్కరం అంటే “ఎవరా బిచ్? నీ భార్యా!” అని తలమీద కొట్టి, వెళ్ళిపోయి, కాక్‌పిట్‌లో కూర్చుని. ప్లేన్ లో వేగంగా సాగి నల్లటి మేఘాల్లోకి శేషాచలపతి దూసుకుపోగా –
క్రింద నిలబడిపోయిన భాస్కరం కథ ఇది.

మనసు విలవిలలాడినా, ఏమీ అనని, ఏమీ చెయ్యని, అలాగని వూర్కోలేని దేవదాసులాంటి భాస్కరం కథ ఇది.

అనుభవాలను, జ్ఞాపకాలను, అబ్జర్వేషన్లను, వర్తమానాన్ని ఎర్నెస్టు హెమీంగ్వే ఇంగ్లీషు లాటి తెలుగులో ‘శాండ్విచ్’ చేసి- అలతి మాటలతో, అందమైన పొత్తికడుపు మడతల వంటి ఇమేజరీలతో, డ్రెస్టెన్ బౌల్ లో వడ్డించిన ‘పరవాణ్ణం’ ఇది.

-అయితే 1964 లో రాసిన ఈ కథను చదవడానికి ముందుగా, ఆయన 1967 లో రాసిన ‘చీకటి గదులు’ చదివితే ఈ కథలోకి మనం బాగా వెళ్ళగల్గడం అన్నది – తెలుగు కథల్లోకి హెచ్. జి. వెల్స్ ‘టైమ్ మెషీన్’ రావడం లాంటిది!

ఇంతటి పనితనపు కలము మూగబోయిందెందుకు?

‘వారా’ల పత్రి ‘కలి’యుగం అని కాదు కద?”

వాకాటి పాండురంగారావు

త్రిపుర కథలు On Kinige

Related Posts: