కాలం చెల్లని ‘కాలమ్’కబుర్లు

జంట అవధానులు, జంట కవయిత్రులు తెలుసుగానీ జంట కాలమిస్టుల గురించి విన్నది తక్కువే. రచయిత్రులు ఓల్గా, వసంత కన్నబిరాన్ కలిసి ఓ దినపత్రికలో ఏడాది పాటు నిర్వహించిన ‘కాలమ్’ ఇప్పుడు ‘ఈ కాలమ్‘ పుస్తకంగా వచ్చింది. ‘రెండు కొప్పులొకచోట చేరితే…’ అన్న సామెతను చిత్తు చిత్తు చేస్తూ ‘ప్రతి అంశం గురించీ మాట్లాడుకోవడం, కలిసి రాయడం మాకెంతో సంతృప్తినిచ్చింది’ అని చెప్పుకొచ్చారు వాళ్లు తమ ముందుమాటలో.

వాస్తవంగా ఈ కాలంలో మనం ఏయే అంశాలను సీరియస్‌గా పట్టించుకోవాలి, వేటిని కూడదు అనేది తెలుసుకోవడానికి దిక్సూచిగా నిలబడుతుందీ పుస్తకం. వేలంటైన్స్ డే వేడుకలు, టీవీ కార్యక్రమాలు, మకరజ్యోతి దర్శనాలు, సెల్‌ఫోన్ సంభాషణలు, ఓట్స్ టిఫిన్లు, టమోటా పండగలు, వ్యక్తిత్వ వికాస పుస్తకాలు… ఇలాంటి రోజువారీ విషయాల వెనక ఉన్న మార్కెట్ శక్తులను సామాన్యుడి దృష్టికి తేవడానికి ఉపయోగడతాయి ఈ కాలమ్ కబుర్లు. ఒబామా, ఒసామాల గురించి, ప్రపంచబ్యాంకు అధ్యక్షుడి నిర్వాకం గురించి, పేదలకు అందని వైద్యం గురించి… ఒకటీరెండు కాదు, దాదాపు యాభై అంశాల మీద సున్నితంగానో, హాస్యంగానో చెబుతున్నప్పుడు కూడా వాళ్ల మాటల్లో పదును ఏమాత్రం తగ్గలేదు. ‘ఈ కాలమ్‌లో మేం రాసిన విషయాలన్నీ ముఖ్యమైన రాజకీయ అంశాలే. వాటికి ఇప్పట్లో కాలం చెల్లే అవకాశం కనపడటం లేదు. మళ్లీ మళ్లీ అవే సంఘటనలు, అవే ధోరణులు కొనసాగుతున్నాయి…’ అన్న రచయిత్రుల అవగాహన సరైనదే అనిపిస్తుంది నేటి సమాజంలో జరుగుతున్న ఘటనలను చూస్తున్నప్పుడు.

అసమానత్వం, ఆధిపత్యం, హింస, అత్యాచారం, అవినీతి, దోపిడి, మూఢత్వం కొనసాగుతున్న రోజుల్లో ఆయా అంశాల గురించి రచయిత్రులు చేసిన వ్యాఖ్యలు, విశ్లేషణలు సామాన్యులకు సైతం ఒక రాజకీయ దృష్టి కోణాన్ని, సమస్యల లోతు గురించిన అవగాహనను కలిగిస్తాయి. అలా కలగాలనే ఉద్దేశంతోనే ‘ఈ కాలమ్‌ను పుస్తకంగా తెస్తున్నాం’ అన్న రచయిత్రులు ఆ పనిలో సఫలీకృతులయ్యారనే చెప్పాలి. తమ ఉద్యోగం, తమ ఇల్లు…. అని గిరిగీసుక్కూచుంటున్న వాళ్లంతా కనీసం బయటేం జరుగుతోందో తెలుసుకోవాలంటే, తాము తమలా ఎందుకున్నారో తెలుసుకోవాలంటే దీన్ని తప్పక చదవాలి.

అరుణ పప్పు
ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధం, 19 మే 2013

* * *

“ఈ కాలమ్” డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్‌ని అనుసరించండి.
ఈ కాలమ్ On Kinige

Related Posts: