ఎప్పుడూ కొత్తగా అనిపించే పాత కథలు (వేలుపిళ్లై సమీక్ష)

దాదాపు ఈ కథలన్నీ ఏభై ఏళ్ళనాటివి. ఐనా పాతబడ్డకొద్దీ విస్కీ విలువ పెరిగినట్లు యిప్పుడొస్తున్న వాసి ప్రధానం కాని కథల రాశితో, నాణ్యతతో పోల్చినప్పుడు ‘అబ్బా… ఆ పాత కథలు ఎంత కొత్తగా, ఎంత తాజాగా, వాడిపోకుండా పరిమళభరితంగా ఉన్నాయా’ అని ఆశ్చర్యపడ్తూ, ఆనందపడే స్థాయిలో ఉన్న కథలు ‘వేలుపిళ్లై‘ పుస్తకంలోనివి. వీటిని రాసిన సి. రామచంద్రరావు కూడా ఈ కథల వలెనే ఒక విలక్షణమైన వ్యక్తి. తెలుగు పాతకథల వైభవం తెలిసిన వరిష్ట పాఠకులకు బాగా తెలిసినవాడు. బాగా అంటే ఎక్కువ అని కాదు, మంచి కథలు రాసే రచయితగా అని. అతను రాసిన కథలే అతి తక్కువ. తన యాభై అరవై ఏళ్ళ రచనా జీవితంలో అతని రాసినవి ఈ పుస్తకంలోని తొమ్మిది కథలే. తక్కువ కథలు రాసిన వారందరూ గొప్ప రచయితలు కారు కాని ఎందుకో చాలామంది గొప్పరచయితలు తక్కువ కథల్నే రాసిన ఉదంతాలు చాలా ఉన్నాయి.
‘వేలుపిళ్లై’లోని దాదపు అన్ని కథల్లోనూ స్థలం తెలుగుప్రాంతం కాదు. పాత్రలు, వాతావరణం, పరిసరాల స్వరూప విశేషాలూ తెలుగువి కావు. కథావస్తువు కూడా జనానికి బాగా తెలిసిన, సార్వజనీనమైన జీవితంలోంచి స్వీకరించినది కాదు. రచయిత తనకు తెలిసిన, తనదైన, తన అభిరుచికి తగిన ఒక అసాధారణ జీవిత పర్యావరణంలో నుండి ప్రత్యేకంగా ఎన్నుకున్న కథావస్తువులే అన్ని కథల్లోనూ ఉన్నాయి. పాత్రలు ఎక్కువగా తమిళులు, ఇంగ్లీషు దొరలు, ఎస్టేట్ కొండలు, లోయలు, అక్కడి ప్రత్యేకమైన జీవితపు అలవాట్లు, సంస్కృతి, జీవన విధానం చాలావరకు అధునాతనమైన నియోరిచ్ క్లాస్ అలవాట్లు, కథనం… ఇవన్నీ వందేళ్ళ తెలుగు కథతో పోలిస్తే, రామచంద్రరావు విలక్షణంగా ప్రవేశపెట్టి, మెప్పించి, అనేక బహుమతులను సాధించి, తనదైన వింత గొంతుతో తనదైన ముద్రని మిగిల్చిన బాపతు… ఐతే ఈ కథలు అనేకమంది విజ్ఞులైన సాహిత్యకారులతో సహా బహుళపాఠకుల ఆదరణని పొందడానికి కారణం పూర్తిగా తెలుగువాడైన రచయిత ప్రతీ కథలోనూ నిజాయితీతో నిండిన తెలుగుదనాన్ని సజీవంగా అందివ్వడం. పాత్రలలో పారదర్శకమైన ప్రతిస్పందనలను, ప్రతిఫలనాలను ఉన్నదున్నట్లుగా ప్రస్ఫుటపరచడం. సందర్భాన్ని అందమైన శిల్పం వలె చెక్కి సన్నివేశాన్ని రూపుకట్టించడం.
రచయిత ఎవరైనా తన కథలను తను ఎరిగిన జీవితం నుంచే సృజిస్తాడు. తను కూడా ఒక భాగస్వామియైన తానెరిగిన సామాజిక వాతావరణం నేపధ్యం నుండీ ఏరుకుని కథనుగానీ, ఏ ఇతర ప్రక్రియనుగానీ సృజిస్తాడు. కథకు అక్కడి భౌగోళిక, వాతావరణ, సన్నివేశ సంబంధ వైవిధ్యత వంటివన్నీ కూడా అదనపు అలంకారాలై కృతిని పరిపుష్టం చేస్తాయి. దృశ్యమాధ్యమమైన ‘సినిమా’లో శ్యామ్ బెనెగల్, గోవింద్ నిహలనీ, సంతోష్ శివన్ వంటి సృజనాత్మక దర్శకులు తమ చిత్రాల్లో కథను చెప్పేముందు ఆ సన్నివేశాన్ని, చుట్టూ ఉన్న వాతావరణాన్ని ముందు ప్రేక్షకుల ముంచు ప్రతిష్టించి ఒక చదరంగంలో పావులవలె పాత్రలను కదుపుతారు. అందుకే వాళ్ళ చిత్రాలు కళాపిపాసులైన ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. సి. రామచంద్రరావు కూడా తన కథల్లో కథా సందర్భాన్ని వాతావరణ సహిత ప్రస్తావనలతో ఉన్నతీకరిస్తారు. అంతిమంగా ఒక కొసమెరుపుతో, అనూహ్య మలుపులతో కథను ముగించి ఒక విభ్రమని కలిగిస్తారు. రచయిత మంచి టెన్నిస్ ప్లేయర్. వింబుల్డన్ క్రీడాకారుడు మహేష్ భూపతి రామచంద్రరావు సోదరుడి కొడుకు. స్వయంగా కూడా ఆయన టెన్నిస్ చాంపియన్‌గా ఎన్నో ట్రోఫీలు గెలిచారు. జీవితంలో ఎక్కువ కాలం టీ తోటల మేనేజర్‌గా, నిర్వాహకుడిగా బ్రిటీష్ అధికారుల మధ్య హుందాయైన ఉద్యోగంలో ఉంటూ వెలుగునీడలను చూశారు. అందువల్ల చాలా కథల్లో టెన్నిస్ ఆట ప్రస్తావన, వివరణ… టీ తోటల్లోని తమిళ వ్యక్తుల, జీవితాల వివరణ, తేయాకు తోటల ఎస్టేట్లలో ఒక అనివార్యభాగమైన ఆఫీసర్స్ క్లబ్బుల ప్రస్తావన, పార్టీలు, విస్కీ విందులు, అత్యాధునిక విలాసవంతమైన యువతీయువకుల అగ్రేసివ్ ప్రవర్తనలతో నిండిన ‘గెట్ టుగెదర్‌లు’… ఇవన్నీ అంతర్లీనంగా ప్రవహిస్తూ అతి సహజమైన కథలికలతో సజీవంగా మన ముందు కదలాడ్తూ కథని సమగ్రం చేస్తూ హృదయాన్ని స్పర్శిస్తాయి. రచయిత తనదైన చమత్కార పాటవంతో సాధించిన విజయమిది.
‘వేలుపిళ్లై’ కథలో ఒక టీ ఎస్టేట్ బజారులో మాములు సరుకులమ్ముకునే వేలుపిళ్లై టోకు వస్తువ్యాపారి గోపాల్ చెట్టియార్ స్నేహంతో ఎలా ఆర్ధికంగా పుంజుకుని ఎదిగి గయ్యాళి పెళ్ళాం పవనాళ్‌ని విడిచి వయసులో ఎంతో చిన్నదీ, వ్యవహారజ్ఞురాలైన సెందామరైతో ఎలా జీవితాన్ని జయించాడో చెప్పాడు రచయిత. సెందామరై శ్రుతి మించిన చురుకుదనంపై అందరికీ కండ్లమంట. అపవాదులు, ఏడుపు. ఐనా జనం మాటలను లక్ష్యపెట్టకుండా సైందామరైని స్వచ్ఛంగా ఇష్టపడే వేలుపిళ్లై అంతరంగాన్ని రచయిత విప్పి చెప్పిన తీరు పాఠకులని చకితులని చేస్తుంది. ముగింపు ఒక గాలితెప్ప స్పర్శవలె పులకింపజేస్తుంది.
మరోకథ ‘ఏనుగుల రాయి’ కూడా అంతే. టీ ఎస్టేట్, ప్లాంటేషన్ ఏరియాలు, తేయాకు మొక్కల నర్సరీలు, ఏటవాలు కొండల నేపథ్యం….. తేయాకు తోటలపైకి ఏనుగుల దాడి…. విధ్వంసం…. అక్కడి ఒక తమిళ బాలుడు కడకరై ఏనుగులతో పరిచయం పెంచుకుని, స్నేహితునిగా మరి, ఏనుగులతో ఎడబాటు, వియోగం…. మళ్ళీ ఏనుగులను కలుసుకుని స్నేహించి…. చివరికి ఏనుగులరాయి దగ్గర రాళ్ళు దొర్లి కడకరై చనిపోవడం… మనిషికీ, జంతువులకూ, ప్రకృతికీ మధ్య అదృశ్యమై సజీవంగా ఉన్న బంధాన్ని ఈ కథ అద్భుతంగా చెబుతుంది.
‘టెన్నిస్ టూర్నమెంట్’, ‘గాళిదేవరు’, ‘ఫాన్సీ డ్రెస్ పార్టీ’, ‘కంపెనీ లీజ్’, ‘క్లబ్ నైట్’…… కథలన్నీ సమాజంలోని ఉన్నత విద్యావంతులైన టీ ఎస్టేట్స్, టెన్నిస్ రంగాలలో ప్రసిద్ధులైన వ్యక్తులు పాత్రలుగా నిండిన విశ్లేషణలే…. ఆడ, మగ… కలతలు, అతి సున్నిత మానవీయ సంబంధాలు, బలాలు, బలహీనతలు…. సెక్స్ ప్రతిఫలనాలు…. లోలోపల రహస్యమై నడిపించే అంతరంగ స్వభావాలు….. అంతా ఒక ‘న్యూ సాండ్‌విచ్’. ఈ కథలన్నీ యిదివరకు ఎన్నోసార్లు ‘పాతకథల’ ప్రస్తావన కింద ఎన్నో ప్రముఖ పత్రికల్లో మళ్ళీ మళ్ళీ వెలువడ్డవే.
కొత్తగా కథలను రాయాలనుకుంటున్న రచయితలు ‘వేలుపిళ్లై’ కథల్ను నమూనాగా అధ్యయించి కథను ఎంత సరళ సుందరంగా నడిపించవచ్చో నేర్చుకోవచ్చు. ఈ కథలు ‘తెలుగు కథ’ యాత్రలో తారసపడే అందమైన జ్ఞాపికలు. శాశ్వతమైనవి. మరుపురానివి.

రామాచంద్రమౌళి
(పాలపిట్ట జూన్ 2012 సంచికలో ప్రచురితం)

* * *

“వేలుపిళ్లై” డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్‌ని అనుసరించండి.
వేలుపిళ్లై On Kinige

Related Posts:

విలక్షణమైన గొప్ప కథకుడు సి. రామచంద్రరావు

ఏ దేశమేగినా ఎందుకాలిడినా రాణించగల రమ్యగాథలు అంటూ వేలుపిళ్లై కథలు గురించి 21 డిసెంబరు 2011 నవ్య వార పత్రికలో సమీక్షించారు సుధామ.

రాసింది తక్కువైనా, వాసిగల రచనతో పాఠకులను హృదయదఘ్నంగా ప్రభావితం చేసిన కథకులలో సి. రామచంద్ర రావు ఒకరని సుధామ అన్నారు.

ఈ కథలలో ఇంగ్లీషు, తమిళ పాత్రలు తెలుగు పాత్రలతో ఎక్కువ సహచరిస్తూ, ఆ పాత్రల మాటుచాటుల నుంచి అద్భుత జీవన అంతరంగ తరంగాలను ఎగసి పడేలా చేస్తాయని సమీక్షకులు పేర్కొన్నారు.

“అద్భుత ‘జీవనసారం’ గల పాత్రలనూ, గొప్ప పఠనానుభూతినీ పాఠకులకిచ్చి, ఇప్పటికీ తలచుకునే కథా విన్నాణం చూపిన రామచంద్రరావుగారు తెలుగు కథా ప్రపంచంలో విలక్షణమైన గొప్ప కథకులు! ‘వేలుపిళ్లై’ నిలిచిపోయే కథా సంపుటి” అని వ్యాఖ్యానించారు సుధామ.

పూర్తి సమీక్షకై ఈ లింక్ నొక్కండి.

వేలుపిళ్లై కథాసంపుటి డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. వివరాలకు ఈ క్రింది లింక్‍ని అనుసరించండి

వేలుపిళ్లై On Kinige

కొల్లూరి సోమ శంకర్

Related Posts:

వేలుపిళ్ళై

ఈ కథలను రాసింది సి. రామచంద్రరావుగారు. ఇంగ్లీషు, తెలుగు, తమిళ పాత్రల చుట్టూ అల్లిన ఈ కథలన్నీ రచయిత తనకు తెలిసిన, పరిచితమైన జీవితంలో నుంచి ఏరుకుని, పరిశీలించి, భావనచేసి రాసినవే.

ఈ సంకలనంలోని కొన్ని కథలను పరిచయం చేసుకుందాం.

వేలుపిళ్ళై: వేలుపిళ్లై ఓ టీ ఎస్టేటులో కూలీగా పనిచేస్తూ వుండేవాడు. ఒకసారి ఎస్టేటు కండక్టరుతో మాటా మాటా వచ్చి పని మానేస్తాడు. కొండలకింద వున్న పొల్లాచీ సంతలో లక్ష్మీవారాలు అమ్ముడైపోగా మిగిలిన ఉల్లిపాయ, చింతపండు, కాయగూరలూ కొని ప్రోస్పెక్టు ఎస్టేటు కూలీలకి అవ్మేువాడు. కొన్నాళ్ళకి వేలుపిళ్లై పెద్దబజార్లో అంగడి ప్రారంభించాడు. కలిసొస్తుంది. వేలుపిళ్లైకి సిరి అబ్బడంతో తనపేరు చిరస్థాయి చేసుకోవాలని కోరిక పుట్టింది. పేరు శాశ్వతంగా నిలిచే దానం ఏదైనా చెయ్యడానికి నిర్ణయం చేసుకుని ఎస్టేటు కూలీలతో సంప్రదించాడు. వినాయకుని గుడి కావాలని అడిగారు కూలీలు. ‘సరే’ అన్నాడు వేలుపిళ్లై. భార్య వద్దంటుంది. ఆమె మాటలని లెక్క చేయకుండా, పని మొదలుపెడతాడు వేలుపిళ్ళై. ముందుగా గోపురం సిద్ధమైపోతుంది. ఒక రాతి పలక మీద వేలుపిళ్ళై ధర్మం అని రాయించుకుని మురిసిపోతాడు. అయితే వినాయకుడి విగ్రహాన్ని చేయించడానికి అతనికి కుదరదు. చివరికి ఓ గుడిలోంచి విగ్రహాన్ని దొంగిలించి తెస్తాడు. ఆ ప్రయత్నంలో పారిపోతుండగా సెందామరైతో పరిచయం ఏర్పడుతుంది. ఆమెతో చాటు మాటు వ్యవహారాలు సాగిస్తాడు. వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్టించడానికి, నాటకం ఆడి భార్యనగలని తాకట్టు పెట్టి, డబ్బు తెచ్చుకుంటాడు. తనని మోసం చేసి డబ్బు తీసుకున్నాడన్న సంగతి తెలిసి భార్య అతడిని విడిచి వెళ్ళిపోతుంది. సెందామరైని తీసుకొచ్చి ఇంట్లోనే కాపురం పెడతాడు. ఆమె వచ్చాక అతనికి మరింత కలిసొస్తుంది. ఆమె వలన తన జీవితం మారిపోయిందనే ప్రగాఢ విశ్వాసం అతనిలో కలుగుతుంది. ఆమె మీద ఎన్ని అపనిందలు వచ్చినా పట్టించుకోడు. ఆమె చనిపోతే, అన్నపానీయాలు మాని వినాయకుడి గుడి దగ్గర కూర్చుంటాడు. మనుషుల్లోని కీర్తికండూతిని, తామనుకున్న పనిని పూర్తి చేసేందుకు ఎంతటి పనికైనా వెనుకాడకపోవడాన్ని తమకి భరోసా కల్పించిన వారి పట్ల అమితమైన అనురాగాన్నిపెంచుకోడాన్ని ఈ కథ చిత్రిస్తుంది.

నల్లతోలు: కొందరు తెల్లవారు చదువుకున్న భారతీయులని తమతో సమానంగా చూసేవారు. అటువంటి కుటుంబమే మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ స్టూవర్ట్‌. వారితో సంబంధాలు కలుపుకుని తానూ సైతం ఆంగ్లేయుడిలానే ప్రవర్తిస్తుంటాడు పేట్ అనబడే ప్రతాపరావు. ఒకసారి వారిచ్చే పార్టీకి వెడతాడు పేట్. అక్కడ బ్రిటీషు యువకులు చాలా మంది ఉంటారు. తాగి వాగడం మొదలుపెడతారు. తమ మధ్య ఈ నల్లతోలు గాడెందుకు అని పేట్ నుద్దేశించి వ్యాఖ్యానిస్తాడు డంకన్ హార్వీ అనే కుర్రాడు. కొంత వాగ్వాదం తర్వాత, పేట్‌రావ్‌‌ని పట్టుకుని ఈడ్చడం ప్రారంభించాడు డంకన్‌హార్వీ. పేట్‌రావ్‌ కొంత గింజుకుంటాడు. నలుగురూ సాయంపట్టి అతన్ని గది బయటికి నెట్టి తలుపు మూసేస్తారు. ఈ విషయం విని మిస్టర్‌ స్టూపర్ట్‌ కోపోద్రిక్తుదవుతాడు. “బ్రిటిష్‌యువకులంతా మృగాల్లాగా ప్రవర్తించారు” అంటాడు. “నా అతిథిని అవమానపరచడానికి డంకన్‌కి ఏం అధికారం వుంది!” అని గర్జిస్తాడు. “అంతా వెళ్ళి పేట్‌కి క్షమాపణ చెప్పుకోండి” అంటాడు. ఇంతలో అతడి భార్య అక్కడికి వస్తుంది. తమ కూతురిని చేసుకోబోయేది డంకన్ అని గుర్తు చేస్తుంది. మౌనంగా ఉండిపోతాడు. నిస్సహాయంగా ఇల్లు చేరుతాడు పేట్.

ఏనుగుల రాయి: ప్రోస్పెక్ట్ టీ ఎస్టేటు, కండక్టరుగా పనిచేస్తున్నాడు తంగముత్తు. కొత్తగా వేునేజర్‌లా వచ్చిన సిమ్మన్సు పదిరోజులైనా కాకుండానే, ఎస్టేటంతా తెగ తిరిగేశాడు. వచ్చే ఏడాది టీ నాటబోయే స్థలం కోసం ఇప్పటినుంచీ వెతుకుతున్నాడు. ఓ స్థలం చూసి, దాని గురించి వాకబు చేస్తే, అది టీ నాటడానికి మంచి స్థలం అని పదేళ్ళ క్రితవేు అప్పటి మేనేజరు నిర్ణయించి నర్సరీ ఏర్పాటు చేసాడని, కానీ అక్కడ మొక్కల్ని ఏనుగులు బ్రతకనీయవని తెలుస్తుంది. ఆ క్రమంలో అతనికి ఏనుగుల రాయి గురించి తెలుస్తుంది. ఏనుగుల రాయికి, టీ మొక్కలకి ఉన్న సంబంధం ఏమిటి? ఏనుగులు ఎందుకు ఆ మొక్కలపై పగబట్టాయో తెలుసుకోవాలంటే ఈ కథ చదవాల్సిందే.

టెన్నిస్ టూర్నమెంట్: పేదవాడైనా, టెన్నిస్ బాగా ఆడగల గిరిని చూసి ఆకర్షితురాలవుతుంది ధనవంతుల కుటుంబానికి చెందిన కమల. తండ్ర అభీష్టానికి వ్యతిరేకంగా గిరిని పెళ్ళాడి ఇంట్లోంచి వెళ్ళిపోతుంది. మొదట్లో ఇద్దరూ సరదాగా ఉంటూ కలసి టెన్నిస్ ఆడుకునే వారు. అయితే రాను రాను గిరికి టెన్నిస్ పట్ల వ్యామోహం అధికమై, ఇంటిని, భార్యని నిర్లక్ష్యం చేయడం మొదలుపెడతాడు. తానేదో గొప్ప ఆటగాడినని, తాను గట్టిగా ప్రయత్నిస్తే డేవిస్ కప్ కైనా ఆడగలనని అనుకుంటాడు గిరి. కానీ అతని ఆట అంతంత మాత్రమేనని అతని మిత్రుడయిన కథకుడికి తెలుసు. కొన్నేళ్ళ తర్వాత మిత్రులిద్దరూ కలుసుకున్నప్పుడు ఉద్యోగం మానేసి ఆట మీద దృష్టి పెట్టానని గిరి చెబుతాడు. కుటుంబమెలా గడుస్తుందని కథకుడు అడిగితే, కమల వాళ్ళ నాన్న కలిసిపోయారని, ఆయన డబ్బుతో వ్యాపరం చేయనున్నానని చెబుతాడు గిరి. కమల కరుడు గట్టిన ద్వేషాన్ని సైతం మర్చిపోయి తండ్రి పంచన ఎందుకు చేరిందో తెలుసుకోవాలంటే ఈ కథ చదవాల్సిందే.

ఉద్యోగం: ఈ కథ జగన్నాధం అనే ఓ న్యాయమూర్తి కథ, వెంకట రమణ అనే ఓ పేదింటి న్యాయవాది కథ. ఈ కుర్రప్లీడరు కేసులు వాదించే తీరుని గమనించి,అతని పట్ల ఆకర్షితుడవుతాడు జగన్నాధం. జగన్నాధం ఉద్దేశంలో లాయరుగా ప్రావీణ్యం సంపాదించడానికి కావలసినవి అభిరుచి, కాలం. వెంకటరమణ కూడా కాలక్రవేుణా ‘లా’ సూత్రాలకి చిలవలూ, పలవలూ కల్పించి వ్యాఖ్యానం చెయ్యడం, ప్రతి వాదనకీ పది కేసులు ఉద్ఘోషించి బలపరచడం నేర్చుకుంటాడని, కాలం కాని మరొకటి కాని నేర్పలేని ఏదో ప్రజ్ఞ వెంకటరమణలో వుందని, అది అతన్ని వృత్తిలో చివరంటా తీసుకుపోతుందని ఆయన భావిస్తారు. వీరి పరిచయం పెరిగి వెంకటరమణ జగన్నాధం ఇంటికి వచ్చిపోయేంత చనువు ఏర్పడుతుంది. ఈ క్రమంలోనే జగన్నాధం గారి కూతురు నిర్మల్, వెంకట్ ఒకరినొకరు ఇష్టపడతారు, పెళ్ళాడుతారు. కాలక్రమంలో వెంకట రమణ ప్రాక్టీసు తగ్గుతుంది, న్యాయవాది వృత్తి విరమించుకుని ఏదైనా ఉద్యోగం చూసుకోవాలనుకుంటాడు. ఇలా ఎందుకు జరిగిందో తెలుసుకోవాలంటే ఈ కథ చదవాలి.

గాళిదేవరు: ఇది ఓ కాఫీతోటల కంపెనీ మానేజరు, సిబ్బంది కథ. కంపెనీ వృద్ధి చెందుతూంటుందీ, కానీ అభివృద్ధికి పాటుపడుతున్న కార్మికులు మాత్రం ఎన్నో కష్టాలు పడుతుంటారు. చిన్న ఉద్యోగుల కష్టాలు వివరించి, ముఖ్యంగా వాళ్ళ యిళ్ళయినా బాగుచేసి నూతన వసతులు కల్పించమని కంపెనీని కోరేడు మానేజర్ సోమయ్య. ఎలక్ట్రిసిటీ కూడా యిస్తే బాగుంటుందని రాయబోయి, ఆగిపోతాడు. అలా చేస్తే వేునేజిమెంటుకీ, తక్కిన చిల్లర ఉద్యోగులకీ వుండే వ్యత్యాసం సన్నగిల్లిపోతుందేమోనని భయం వేసింది. ఎలక్ట్రిసిటీ ప్రసక్తి ఎత్తకుండా ఉత్తరం ముగించాడు సోమయ్య. మానేజ్‌మెంట్ ఒప్పుకుని, కార్మికుల ఇళ్ళు బాగు చేయించడానికి, బాత్ రూమ్‍లు కట్టించడానికి అనుమతినిస్తుంది. ఈ విషయమై మాట్లాడి ఒప్పందం చేసుకునేందుకు బెంగుళూర్ వెళ్ళి, కిల్లిక్‌సన్‌ అండ్‌ కంపెనీకి వెడతాడు. అక్కడి ఆఫీసర్ చిన్నప్ప వీరి ఎస్టేట్ వివరాలు విని గాళిదేవరు ఉన్న ఎస్టేట్ అని తెలుసుకుని తానే స్వయంగా అక్కడికి వస్తాడు. గాళిదేవరు ఎవరు? అయన మహత్యమేమిటి? ఆ ఎస్టేట్‌కి ఒకప్పటి యజమాని అయిన వేుంగిల్స్‌ గాళిదేవరు ఆగ్రహానికి ఎలా గురయ్యాడు? ఎందుకు ఎస్టేట్‌ని అమ్మేసుకుని స్వదేశం వెళ్లిపోయాడు? మానవ మనస్తత్వాలని, ప్రాకృతిక శక్తుల పట్ల మనుషుల భయాన్ని, తోటివారి బలహీనతలపై ప్రాక్టికల్ జోకులు వేసి ఆనందించే స్వభావాన్ని ఈ కథ చిత్రిస్తుంది. కాఫీ తోట వర్ణన అద్భుతంగా ఉంటుందీ కథలో.

ఫ్యాన్సీడ్రెస్‌పార్టీ: లలితా మురళీలది అన్యోన్య దాంపత్యం. మురళీ టీ తోటలో మానేజర్‌గా పనిచేస్తూంటాడు. మురళి ఆఫీసుకు వెళ్ళిపోతే, లలితకి ఏమీ తోచదు. టీ తోటల్లో జీవితం ఎంతో ఒంటరిగా వుంటుంది. ఇక్కడ చాలా భాగం కూలీలే. కొద్దిమంది గుమాస్తాలూ, ఫ్యాక్టరీ సిబ్బంది కూడా వుంటారు. వేునేజ్‌మెంట్‌ హోదాలో వున్నవాళ్ళు వీరితో కలవడం ఎలానూ పడదు. ఉన్న మానేజ్‌మెంట్ ఉద్యోగులందరూ కలిసేదీ ఏ మూడు నెలలకి ఒకసారో అవుతుంది. ఈ సారి అందరూ కలిసినప్పుడూ, ఏవో రొటీన్ కార్యక్రమాలు కాకుండా కొత్త, భిన్నమైన కార్యక్రమాలు రూపొందించాలని అనుకుని ఫాన్సీ డ్రెస్ పార్టీ ఏర్పాటు చేస్తుంది లలిత. అందరూ తాము వేసుకోబోయే డ్రెస్ గురించి గోప్యంగా ఉంచాలి, కనుక తాను వేసుకోదలచిన జపాన్ డ్రెస్ గురించి భర్తకి చెప్పదు లలిత. ఒక రోజు అనుకోకుండా ఆ డ్రెస్‌ని చూస్తాడు మురళి, అది అతనికి నచ్చదు, దాన్ని వేసుకోవద్దంటాడు. భార్యభర్తలలో అభిప్రాయబేధాలొస్తాయి. ఇద్దరూ ఒకరిమీద ఒకరు అలుగుతారు. తర్వాత ఏం జరిగిందనేది ఆసక్తిదాయకంగా ఉంటుంది. ఒక ఫాన్సీ డ్రెస్ లలిత మురళీల మధ్య దూరం కల్పిస్తే, మరో ఫాన్సీ డ్రెస్ వారిద్దరిని కలుపుతుంది. టీ ఎస్టేట్‌లో పనిచేసే ఉద్యోగుల జీవితాలను దగ్గరగా చూపిస్తుందీ కథ.

క్లబ్ నైట్: ఒకప్పుడు బాగా రాసే రచయిత హఠాత్తుగా రాయడం మానేస్తాడు. టీ ఎస్టేట్ ప్రెసిడెంట్ కాబట్టి పనుల ఒత్తిడి వలన రాయడం లేదని పాత మిత్రుడు భావిస్తాడు, కానీ ఆ రచయిత అసలు వివరం ఇలా వివరిస్తాడు “ఎవరో ఎక్కడో మెచ్చుకుంటున్నారని నెలలూ, ఏళ్ళూ తరవాత వినికిడిగా తెలిస్తే ఏం తృప్తిగా వుంటుంది? రాసింది నీ చుట్టూ వున్న వాళ్ళని కదిలించడం చూడగలిగితేనే కదా ఇంకా రాయాలనే వుత్సాహాం పుట్టేది!” అంటాడు. మిత్రుడు అంగీకరించడు. మళ్ళీ రాయాలని పట్టుపడతాడు. మళ్ళీ రాయడం తన వల్ల కాదని, “గడించిన పేరుని భద్రంగా రక్షించుకుంటూ రాయడం మానెయ్యాలా, చిత్తశుద్ధితో రాసి ఆకట్టుకున్న వాళ్ళ అభిమానాన్ని పోగొట్టుకునే ప్రమాదాన్ని ఎదుర్కోవాలా?” అంటాడు. చివరికి అతను మళ్ళీ రాసాడో లేదో తెలుసుకోవాలంటే ఈ కథ చదవాలి.
పచ్చటి టీ, కాఫీ తోటలలో చూడడానికి అందంగా ఉండే బయట కొండలూ, స్వచ్ఛమైన గాలి అన్నీ ఉంటాయి. వీటితో పాటు పెద్దా చిన్నా తారతమ్యాలూ, స్పర్థలూ కావేషాలూ, నటనలూ, ఆశ్రిత పక్షపాతాలూ, అన్ని చోట్లా వున్నట్లే ఇక్కడకూడా అదే మోతాదులో తాండవిస్తూ వుంటాయని ఈ కథ చెబుతుంది.

చివరిదాక ఆసక్తిగా చదివించే కథలున్న ఈ పుస్తకం డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. వెల రూ. 50/- . నెలకి రూ. 30/- అద్దెతో కూడా చదువుకోవచ్చు.

వేలుపిళ్లై On Kinige

కొల్లూరి సోమశంకర్

Related Posts: