అసిధార–కస్తూరి మురళికృష్ణ–మునుజూపు

ముందుమాట

భారతీయ సమాజంలో అనేక అపోహలు, సందిగ్ధాలు నెలకొని ఉన్నాయి. బోలెడన్ని సమస్యలున్నాయి. ముఖ్యంగా జాతి ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసంలేక తనదన్న ప్రతీదాన్నీ చులకన భావంతో చూస్తూ, పరాయి దాన్ని చూసి నూన్యతా భావానికి గురవుతోంది. ‘మనం గొప్పవాళ్ళం. మన సంస్కృతి గొప్పది,’ అన్న వారు దూషణలకు గురవుతున్నారు. మన జాతి ఔన్నత్యాన్ని తెలపాలనుకునేవారు ఛాందసులవుతున్నారు. మనం గతంలోని పొరపాట్లును చూసి సిగ్గుతో తలవంచుకుని, ఒకరిపై ఒకరు ద్వేష భావాలు పెంచుకుని విధ్వంసం సృష్టించుకుని మనల్ని మనమే నాశనం చేసుకునేందుకు ఉవ్విళ్ళూరుతున్నాం. అంతేకానీ, ప్రపంచంలోని ప్రతి సమాజంలో అసమానతలున్నాయని గ్రహించి, మన దేశంలోని పరిస్థితులను విశ్లేషించి, వాటిని తొలగించి నూతన సమాజాన్ని నిర్మించుకుందామన్న ఆలోచన అంటరానిదౌతోంది. పూర్వీకుల భుజాలపై నిలిచి ఇంకా ముందుకు చూడవచ్చని పాశ్చాత్యులంటూంటే, మేరు శిఖర సమానులైన పూర్వీకులను వదిలి మరుగుజ్జులమై పోతున్నాం. ఇందుకు ప్రధానకారణం వ్యక్తికి వ్యక్తిత్వాన్నిచ్చి, తనపట్ల, తన పూర్వీకులపట్ల, తన సమాజంపట్ల విశ్వాసాన్ని పెంచవలసిన విద్యా విధానంలో విద్య అదృశ్యమై, ‘చదువు’మాత్రం మిగలటం. విశ్వనాథ వారి మాటల్లో చెప్పాలంటే “బ్రిటీషు వాడు నాటిన బహు విష వృక్షములలో విద్యా విధాన విష వృక్షమొకటి” ఆ విష వృక్ష ఫలితాలు మనం అనుభవిస్తున్నాం. ఆలోచనలు లేని యువత ఆకర్షణకూ ప్రేమకూ తేడా తెలియక జీవితాలను నాశనం చేసుకుంటోంది. వీచికలకు మరీచికలకు భేదం తెలియలేక మరీచికలనే వీచికలనుకుని వెంటపడి జీవితాలను దఃఖమయం చేసుకుంటోంది. రాజకీయం, వ్యక్తుల వ్యక్తిగతస్వార్థం పరిస్థితి నిలాగే కొనసాగిస్తూ దేశాన్ని నిర్వీర్యం చేస్తోంది. వ్యక్తిత్వం లేని ఈ విద్యా విధానంలో లోపాలు, దోషాలు ప్రతివారూ గ్రహించినా, అనేక రాజకీయాలవల్ల అదే కొనసాగుతూ వస్తోంది. ‘ముషిణిపళ్ళు[1] తినుటకు అలవాటుపడిన జాతి తినుచున్నది, బ్రతుకుచున్నది. విషములో పుట్టిన పురుగు తినియే బ్రతుకును.’ అలా కొనసాగుతూ వస్తున్న విద్యా విధానంలోని దోషాలను, తద్వారా నెలకొన్న అపోహలు, సందిగ్ధాలను, వాటికి నేను నిజమని నమ్మిన పరిష్కారాలను ‘అసిధార’ నవలలో చూపించే ప్రయత్నం చేశాను. ఈ నవల మీ ముందు ఉంది. దీని నిగ్గు తేలి తాను రాసిన ప్రతి రచన అద్భుతమే అనుకుంటాడు రచయిత. అతడిని భూమికి తేవాల్సిన బాధ్యత పాఠకులది.

జాగృతిలో సీరియల్‌గా వస్తున్న సమయంలో నవలపై అభిప్రాయాలు నిర్మొహమాటంగా చెప్పి, ఆదరించిన పాఠకులందరికీ కృతజ్ఞతాభివందనాలు. నవలా రచనలో స్వేచ్ఛనిచ్చిన జాగృతి సంపాదకుడు వి. రామ్మోహనరావుగారికి సర్వదా కృతజ్ఞుడనై ఉంటాను. నవలా రచనకు ప్రేరణ నిచ్చింది శరత్ రచన ‘విప్రదాసు.’ నవల రచనకు దిశ నిచ్చాయి విశ్వనాథవారి రచనలు. గతంలో నవలా రచనతో రచయిత పనిపూర్తయిపోయేది. రచన బాగుంటే సమాజమే దాన్ని ఆదరించేది. కానీ ఇప్పుడు కాల్పనిక రచనల పరిస్థితి క్లిష్టంగా ఉంది. తన రచనను బ్రతికించుకోవాల్సిన బాధ్యత, పాఠకులకు అందిచాల్సిన బాధ్యత రచయితపైనే ఉంటోంది. ఈ నవలను చదివి “సమాజంలోని ప్రతి యువతీ యువకుడు చదువవలసిన రచనను ఇలా ఇంట్లో మూట కట్టి అటకమీద పడేస్తారా?” అని నవల ప్రచురణకు నన్ను ముందుకు తోసింది నా శ్రీమతి పద్మ. ‘డబ్బు…’ అని నేనే నీళ్ళు నముల్తూంటే “అప్పోసొప్పో చేసి పిల్లల భవిష్యత్తుకోసం పాటు పడమా? మీ రచనలూ మన పిల్లలే” అని నన్ను కార్యోన్ముఖుడిని చేసింది పద్మ. నా చేయి పట్టుకుని దారి చూపించింది మిత్రుడు గుడిపాటి. నా సందేహాలను, భయాలను ఓపికగా తీరుస్తూ, పుస్తకం వెలువడటంలో అన్నీ దగ్గరుండి చూసుకుంది ఆయనే. భవిష్యత్తులోకూడా మా మైత్రి ఇలాగే కొనసాగాలని ఆశిస్తున్నాను.

ఈ నవలను ఇతర రచనల్లాగే అమ్మకు, నాన్నగారికి, గురుతుల్యులు విశ్వనాథ సత్యనారాయణగారికి అంకితమిస్తున్నాను. వారి ఆశీస్సులతో మరిన్ని సమాజోపయోగకరమైన రచనలు చేసి, రచయితగా నా బాధ్యత సక్రమంగా నిర్వహించగలనని ఆశిస్తున్నాను.

‘అసిధార’ నవలను చదివి, దీనిపై నిర్మొహమాటంగా అభిప్రాయాలను తెలియపరచాలని పాఠకులను కోరుతున్నాను.

అసిధార

 

వందేమాతరం, వందేమాతరం

సుజలాం, సుఫలాం

మలయజ శీతలాం సస్యశ్యామలాం, మాతరం

వందేమాతరం

ఒక సన్నని వాయు వీచిక సముద్ర ఉపరితలాన్ని స్పృశించగానే ఓ చిన్న అల కదిలినట్టు, మాతృమూర్తి అనురాగ పూరిత స్పర్శ స్మరణకు రాగానే స్పందించి, పులకరించే శిశువు హృదయపు కదలికలా, వివేకానంద హృదయం స్పందించింది.

ఎన్నిమార్లు విన్నా ప్రతీసారి తనువులోని అణువణువూ పులకరిస్తుంది. సముద్రంలోని అలలు అనంత కాలం నుండీ వస్తున్నా ప్రతీసారి, ప్రతి అలా నవ్యమే అయినట్టు, ప్రతీసారి ఈ ప్రార్థన వివేకానందలో వినూత్న సంచలనాలను కలిగిస్తూంటుంది.

శుభ్రజోత్స్న పులకిత యామినీమ్

ఫుల్లకు సుమిత ద్రుమదళ శోభినీమ్

సుహాసినీమ్, సుమధుర భాషిణీమ్

సుఖదామ్ వరదామ్ మాతరమ్

వందేమాతరమ్, వందేమాతరమ్

మాతృమూర్తిని ప్రకృతిలో దర్శించి, ప్రకృతి సౌందర్యాన్ని మాతృమూర్తిలో వీక్షించి, మాతృమూర్తే ప్రకృతిగా, ప్రకృతే మాతృమూర్తిగా దర్శించి, స్పందించిన కవి హృదయలోతుల్లో జనించిన భావగానం ఇది.

చిత్తశుద్ధితో, క్రమశిక్షణగా, రాగం చెడకుండా, ప్రతి పదంలోని భావాన్ని అనుభవిస్తూ ప్రార్థన చేస్తున్న విద్యార్థినీ విద్యార్థులు తరగల నురగలలో తళతళలాడే సూర్య కిరణాలతో చేసిన హారంలో వెలిగే మణుల్లా ఉన్నారు.

కోటి కోటి కంఠ కలకల నినాద కరాళె

కోటి కోటి భుజైధృత ఖరవాలె

బహుబల ధారిణీమ్, నమామి తారిణీమ్

రిపుదళ వారిణీమ్, మాతరమ్

వివేకానంద కళ్లు చెమర్చాయి.

అవును, ఇక్కడ దేనికీ లోటు లేదు. మానవ శక్తి వుంది. మేధా శక్తి ఉంది. ప్రకృతి సంపద ఉంది. అయినా తామెందుకు బలహీనంగా ఉన్నాము?

ఏరకంగా, ఈ దేశం, ఈ జాతి, ఈ సంఘం బలహీనంగా తయారయింది? కోటి కోటి బలమైన బాహువులు ఆయుధాలు ధరించి నీకు రక్షణగా ఉన్నప్పుడు నీవు అబలవెలా అవుతావమ్మా?

తుమి విద్య తుమి హృది తుమి మర్మ

త్వంహి ప్రాణః శరీరె

బాహుతే తుమి మాశక్తి, హృదయ

తుమి మా భక్తి

తోమారయి ప్రతిమా గుడి మందిరే,

మందిరే మాతరమ్!

ఎంత అద్భుతమైన భావం!

మాతృమూర్తే మాతృభూమి. ఈ భూమిలో పండిన పంట ప్రజలు. ఈ ప్రజల విద్య ధర్మం, మర్మం, హృదయం, ప్రాణం, దేహం సర్వం మాతృమూర్తే, ఏనాడైతే మాతృభూమిని గౌరవించటం మానేస్తారో, తమ స్వీయ ధర్మం తిరస్కరిస్తారో, ఆనాడే ఈ ప్రజలు దిక్కులేనివారై నిర్వీర్యులైపోతారు.

విద్యార్ధులు ఉచ్ఛస్వరంలో పాడుతున్నారు.

వారందరికీ కళ్ళల్లో ఉద్వేగం, ఉత్సాహం, భక్తిభావనతో మిళితమై కనిపిస్తోంది. ప్రతి విద్యార్థిలో మాతృదర్శణమౌతున్న పవిత్ర భావన కనిపిస్తోంది.

త్వంహి దుర్గా దశ ప్రహరణ ధారిణీ

కమలా కమల దళ విహారిణీ

వాణీ విద్యాదాయినీ

నమామిత్వాం, నమామి

కమలామ్, అమలామ్, అతులామ్,

సుజలామ్, సుఫలామ్, మాతరమ్

వివేకానంద శరీరం గగుర్పొడిచింది.

శబ్దాలకెంత శక్తి ఉంది!

పాటలోని పదాలు కలిగించిన ధ్వని తరంగాలు, గాలిని స్పందింపజేస్తూ, చెవుల ద్వారా హృదయలోతుల్లో ప్రవేశించి కలిగించిన స్పందనలు సృష్టించిన ఒక రూపం మనో నేత్రం ముందు కదలాడుతోంది.

మాతృమూర్తి దుర్గాదేవి రూపంలో కనుల ముందు సాక్షాత్కరించింది.

విద్యార్థినీ, విద్యార్థుల మిశ్రమ స్వరాలు కోటికోటి కంఠ కలకల నాదాలలా ప్రతి ధ్వనిస్తున్నాయి.

మాతృమూర్తిలో ధాత్రిని, ప్రకృతిని, జగజ్జననిని, దర్శించి, స్పర్శించి, స్మరించగలిగిన ఈ మానవులు ఎంత అదృష్టవంతులు!

ఈ సంస్కృతి ఎంత గొప్పది!

ఈ భావన ఎంత అమోఘం!

అగాధం! అమేయం!

శ్యామలామ్, సరళామ్, సుస్మితామ్, భూషితామ్

ధరణీమ్, భరణీమ్, మాతరమ్ వందేమాతరమ్!

అప్రయత్నంగా వివేకానంద కళ్లు మూతపడ్డాయి.

వివేకానందనే కాదు, ప్రార్థన నాలాపిస్తున్న ప్రతి వ్యక్తి కళ్ళూ అశృపూరితాలై, భక్తి భావంతో మూతపడ్డాయి.

మూసిన కళ్ళ ముందు మహాద్భుతమైన భావం ఆకారం దాల్చి దర్శనమిస్తోంది.

ఆ అద్భుత దృశ్యాన్ని ప్రకృతి సైతం తన నేత్రంతో దర్శించి స్పందించినట్టు చిరు గాలి వీచింది. కరతాళనం చేస్తున్నట్టు ఆకులు గలగలలాడాయి. ఆకాశం నుండి భూమిపై రాలుతున్న సూర్యకిరణాలు, ఆకాశం ఆనందంతో కురిపిస్తున్న వెలుతురు కిరణాల వర్షంలా తోచాయి.

ప్రార్థన పూర్తయ్యాక విద్యార్థులు క్రమశిక్షణగా తమ తమ నిర్ణీత తరగతులకు వెళ్ళసాగారు. ఇంతలో దూరంగా ఏవో కేకలు, అరుపులు ఆ ప్రశాంతతను భంగం చేస్తూ వినిపించాయి. వివేకానంద దృష్టి ఆ వైపుకు మళ్లింది.

పూర్ణయ్య పరిగెత్తుకు వచ్చాడు. ‘తలుపు బయట ఏవేవో నినాదాలు చేస్తూ గుంపులు గుంపులుగా నిలబడ్డారండి’ చెప్పాడు వివేకానందతో. వివేకానంద భృకుటి ముడిపడింది.

‘ఏమిటీ విషయం?’ అడిగాడు.

ఇంతలో తలుపు తోసుకుని దశరథ రామయ్య రావటం కనిపించింది.

వివేకానందకు విషయం అర్థమయింది.

‘దశరథ రామయ్యను నా గదిలోకి పంపించు’ అని వడివడిగా తన గదిలోకి వెళ్ళిపోయాడు వివేకానంద.

చుట్టూ చూస్తూ నడుస్తున్న దశరథ రామయ్యకు ఎదురుగా వచ్చి నిలబడ్డాడు పూర్ణయ్య. ‘బాబుగారు తమరిని గదిలోకి రమ్మన్నారు’ చెప్పాడు.

మందార విరగ బూసింది. అశోక వృక్షాలు ఆకాశాన్నంటుతున్నాయి. కొబ్బరికాయలు బాగున్నాయి. అనుకుంటున్న దశరథ రామయ్య ‘ఏ లోకం నుంచి ఊడిపడ్డాడు వీడు?’ అన్నట్టు పూర్ణయ్యవైపు చూశాడు.

పూర్ణయ్య మళ్ళీ చెప్పాడు.

దశరథ రామయ్య పూర్ణయ్యవైపు తిరస్కారంగా చూసి రెండడుగులు ముందుకేశాడు. అయితే వరసగా తోటలోకి వెళ్తున్న విద్యార్థినీ, విద్యార్థులు అడ్డు రావటంతో ఆగాడు.

‘ప్రొద్దున్నే తోటలోకి వెళ్తున్నారు, వీళ్ళకి క్లాసుల్లేవా?’ పూర్ణయ్యను అడిగాడు.

‘వాళ్ళు తరగతులకే వెళ్తున్నారయ్యా’ చెప్పాడు పూర్ణయ్య.

‘అక్కడ తరగతులెక్కడున్నాయి. అన్నీ చెట్లు పుట్టలే అయితే?’ చిరాగ్గా అన్నాడు దశరథ రామయ్య.

‘అవే తరగతులయ్యా, పైన విశాలమైన ఆకాశం కప్పు, చెట్టు…చేమలు’ ఇంకా ఏదో చెప్పబోతున్న పూర్ణయ్య మాటలకు అడ్డొచ్చాడు దశరథ రామయ్య.

‘బాగానే ఉంది. స్కూలుని ఇలా తగలబెడుతున్నారని తెలిసే వచ్చాను’ అన్నాడు పైకి. లోపల ‘వివేకానంద పైత్యం అందరికీ వంట పడుతున్నట్టుంది’ అనుకుంటూ లోపలకు వెళ్ళాడు.

వివేకానంద గదిలో అడుగు పెట్టబోతూ, గది బయట పెద్దగా రాసివున్న వాక్యాలను చదివాడు.

‘ప్రకృతి గురువు. ప్రకృతి ఒడి పాఠశాల. ప్రపంచమే చదువు. విశ్వమే విజ్ఞానం. మనసే గురువు. మనసే ప్రకృతి.

చదివి, పక్కకు తిరిగి తుపుక్కున ఉమ్మేసి ‘పిచ్చి’ అని గొణుక్కుంటూ లోపలకు అడుగుపెట్టాడు.

దశరథ రామయ్య లోపలకు రాగానే వివేకానంద లేచి నుంచుని నమస్కారం పెట్టి కుర్చీ చూపించాడు.

‘వినయానికి లోపం లేదు’ అనుకుంటూ కూర్చున్నాడు దశరథ రామయ్య.

‘గాయత్రి బాగుందా?’ అడిగాడు వివేకానంద.

గాయత్రి వివేకానంద అక్క. ఆమెను దశరథ రామయ్య కొడుకు పెళ్ళిచేసుకున్నాడు.

‘ఊఁ’ అన్నాడు దశరథ రామయ్య.

ఆయనకు మామూలు మాటలు మాట్లాడే ఉద్దేశ్యం లేదని గ్రహించి మౌనంగా ఉండిపోయాడు వివేకానంద.

‘ఏమిటీ స్కూలుని సర్వనాశనం చేస్తున్నావు?’ గద్దించినట్టు అడిగాడు దశరథ రామయ్య. వివేకానంద మౌనంగా వున్నాడు.

‘విద్యా భారతి’ పాఠశాలను వివేకానంద పూర్వీకులు స్థాపించారు. ఆ పాఠశాలను ఒక సాంప్రదాయం ప్రకారం, ఒక పద్దతి ప్రకారం నడిపిస్తూ వచ్చారు. మొత్తం రాష్ట్రంలో విద్యా భారతి పాఠశాల ఉత్తమ విద్యాబోధనకు పేరు పొందింది. అయితే వివేకానంద, అతని తమ్ముడు రామకృష్ణ ఇంకా పసి వయసులో ఉండగానే వారి తండ్రి మరణించటంతో పాఠశాలనెవరు నడపాలన్నది సమస్యగా మారింది. వివేకానంద తల్లి సరోజినమ్మ అన్నయ్య దశరథ రామయ్య పాఠశాల బాధ్యతలు చెల్లెలి పేరుమీద చేపట్టటంతో ఆ సమస్య తాత్కాలికంగా పరిష్కారమయింది.

కానీ దశరథ రామయ్య పక్కా వ్యాపారి. వివేకానంద కుటుంబానికున్న ఆదర్శాలు, ఉత్తమ ఆలోచనలు, ఉన్నత లక్ష్యాలు అతనికి లేవు. దాంతో నెమ్మదిగా తరతరాలుగా వస్తున్న పద్దతులను ఒక్కటొక్కటిగా మార్చి తనకు లాభకారిగా తోచిన పద్దతులను ప్రవేశపెట్టసాగాడు. వివేకానంద, రామకృష్ణలు పట్టణంలో చదువుకోవటంతో, సరోజినమ్మ అన్నయ్యను ధైర్యంగా వ్యతిరేకించలేకపోవటంతో దశరథ రామయ్యకు అడ్డుపెట్టేవారు లేకపోయారు. దాదాపుగా ఇరవై ఏళ్ళు ఆప్రతిహతంగా ఆయన హయాం సాగటంతో పాఠశాల రూపురేఖలు మారిపోయాయి. ‘విద్యా భారతి’ పేరు తప్ప దాన్లో పాతది అన్నదేదీ మిగలలేదు.

దశరథ రామయ్య పాఠశాల పేరుని మార్చాలని ప్రయత్నించాడు. కానీ ఆవిషయంలో సరోజినమ్మ గట్టి పట్టు పట్టటంతో ఆయన ఆటలు సాగలేదు. ‘ఈ కాలంలో నలంద, విద్యా భారతి లాంటి పేర్లు పెడితే పిల్లలు రారమ్మా. ఏదో ఓ సెయింట్ పేరుండాలి. కనీసం సెయింట్ సిద్దార్థ అని పెట్టినా పర్లేదు’ అని చెల్లెలిని బ్రతిమిలాడాడు. కానీ ఫలితం లేకపోవటంతో ‘పేరులో ఏముందిలే’ అనుకుని ఊరుకున్నాడు.

వివేకానంద, రామకృష్ణులు చదువులు పూర్తిచేసి అక్కడే వుండి పల్లెకు వచ్చేందుకు ఇష్టపడరని, అందువల్ల పాఠశాల తన ఆదీనంలోనే ఉంటుందని భావించిన దశరథ రామయ్య, వివేకానంద చదువు పూర్తి కాగానే పాఠశాలను తాను నడిపిస్తానని పల్లెకు రావటంతో దెబ్బతిన్నాడు.

ఏవేవో మాటలు చెప్పి వివేకానందని పట్నానికి పంపాలని ప్రయత్నించాడు. అన్నీ విని మౌనంగా నవ్వి తన పని తాను చేసుకుంటూ పోయాడు వివేకానంద.

చట్ట ప్రకారం వివేకానందకు అప్పగించటం తప్ప వేరే మార్గం తోచలేదు దశరథ రామయ్యకు. వివేకానంద యువకుడు, అనుభవ శూన్యుడు, తన సహాయం అభ్యర్థించక తప్పదనుకున్న దశరథ రామయ్య ధీమా, వివేకానంద తన సహాయం అడగటం అటుంచి,దశరథ రామయ్యకు పాఠశాల వ్యవహారాల్లో ఎటువంటి అధికారం లేకుండా చేయటంతో దెబ్బతింది. అంతేకాదు ఒకటొకటిగా వివేకానంద, దశరథ రామయ్య ప్రవేశపెట్టిన పద్ధతులన్నింటినీ తొలగించటం ఆయనకు కొరుకుడు పడటంలేదు. బంగారు గుడ్లు పెట్టె బాతు గొంతు నులిమి చంపుతున్నట్టు బాధ పడసాగాడాయన.

‘వివేకానంద అనుభవ శూన్యత వల్ల పాఠశాలను చెడగొడుతున్నాడ’ని ప్రచారం ప్రారంభించాడు. ఆ ఊళ్ళో తనకున్న పరపతిని ఉపయోగించి వివేకానంద ప్రతి పనికి అడ్డుపడసాగాడు. ప్రతి చిన్న విషయానికి ఏదో ఒక గొడవ చేస్తూనే ఉన్నాడు. కానీ వివేకానంద ఓర్పుగా, నేర్పుతో సమస్యలను అణగద్రొక్కి పెద్ద గొడవ కాకుండా చూస్తున్నాడు.

అందుకే ‘పాఠశాలను నాశనం చేస్తున్నావ’ని ఆయన ఆరోపించినా వివేకానంద మౌనంగా ఉన్నాడు. తనపై నిందారోపణకు వివేకానంద స్పందించక పోవటంతో దశరథ రామయ్య మళ్ళీ తనే అన్నాడు.

‘నేనెంతో కష్టపడి స్కూలుని ఓ పద్దతిలో నడిపిస్తే నువ్వు మళ్ళీ పద్దతులన్నీ మార్చేస్తున్నావు’ వివేకానంద మౌనంగా ఉన్నాడు.

‘అదిగో ఆ బయట గోల చేస్తున్నారు. వాళ్ళకేం సమాధానం చెప్తావో చెప్పు’ చిరాగ్గా అన్నాడు దశరథ రామయ్య. వివేకానంద మౌనంగా ఉన్న కొద్దీ ఆయనకు చిరాకు పెరిగిపోతూంటుంది. మనం అన్న మాటకు ఎదుటి వ్యక్తి స్పందిస్తే మనం దానికి తగ్గట్టు ప్రతి స్పందించవచ్చు. మనం ఏమన్నా ఎదుటి వ్యక్తి కదలకపోతే మనకూ ఏమనాలో తోచదు. వివేకానందతో దశరథ రామయ్యకదే సమస్య. పైగా వివేకానంద ఒక్కమాట వ్యతిరేకంగా మాట్లాడడు. దేనికీ నోరిప్పడు. కానీ తను చేసేది మౌనంగా చేస్తూంటాడు.

వివేకానంద ఎంత సేపటికీ ‘వాళ్ళ గోల ఏమిటి?’ అని అడగక పోవటంతో, దశరథ రామయ్య మళ్ళీ తనే చెప్పసాగాడు. ‘నువ్వేమిటి అందరికీ సంస్కృతం నేర్పుతున్నావట? వేదాలు ఉపనిషత్తులు చెప్తానంటున్నావట! సంస్కృతం ఇప్పుడెవరికి కావాలి? సంస్కృతం నేర్పి ఏం సాధిస్తావు? వేదాలు, ఉపనిషత్తులు ఎవరు చదువుతారు? చదివి ఏ ఉద్యోగానికి వెళ్తారు? ఇంజనీరింగా ఎలా చేస్తారు? కంప్యూటర్ ఎలా నేర్చుకుంటారు? డాక్టర్లు ఎలాగవుతారు? ఒకప్పుడు అవిచదివితేనే పండితుడు. ఇప్పుడవి చదివితే పనికిరానివాడు. ఎందుకు మన స్కూలునిలా పనికిరాకుండా చేస్తున్నావు?’ వివేకానంద చిరునవ్వు నవ్వాడు.

దశరథ రామయ్య ఒళ్ళు మండిపోయింది. ‘వందేమాతరం పాట పాడిస్తున్నావట, అది మతపరమైన పాట. దానివల్ల ఇతర మతస్థుల సెంటిమెంట్లు దెబ్బతింటాయి. అదిగో మాకు వేదకాలం వద్దు. ఆధునిక యుగం కావాలి మన ‘అభ్యుదయ యువ సంఘం’ సభ్యుల గోలచేస్తున్నారు. ఏం సమాధానం చెప్తావు వాళ్ళకు?’ దబాయించి అడిగాడు దశరథ రామయ్య.

సమాధానంగా వివేకానంద నవ్వాడు.

‘ఇది నవ్వులాట కాదు, వచ్చేవారం ఆకాశంగారు వస్తున్నారట. ఆయన వస్తే ఈ యువకులకు ఆర్భాటానికి అంతు ఉండదు. అప్పుడు చూద్దాం నువ్వెలా నవ్వగలవో?’

వివేకానంద ఏమీ మాట్లాడలేదు. ఎందుకంటే సమస్యను సృష్టించిన దశరథ రామయ్యనే సమస్యకు పరిష్కారం కూడా చెప్తాడని వివేకానందకు తెలుసు. ఆ పరిష్కారంతో అతనికి ఏదో లాభం ఉండి తీరుతుందనీ వివేకానందకు తెలుసు. ఎందుకంటే ఆ లాభం కోరే దశరథ రామయ్య ఈ సమస్యను సృష్టించి ఉంటాడు.

వివేకానంద ఏమీ అనకపోవటంతో దశరథ రామయ్య మళ్ళా తనే అన్నాడు. ‘చూడబ్బాయ్ ఎంతకాదన్నా మనం బంధువులం. రక్తసంబంధీకులం. వాళ్ళు ఆవేశంతో ఏవేవో చేస్తామంటూ ఎగుర్తూంటే ఏదో పెద్దవాడిని కనుక, ఊళ్ళో ఇంకా నన్ను పెద్దవాడిగా భావించి గౌరవిస్తుంటారు కనక, నేను నీతో మాట్లాడి ఒప్పిస్తానని నచ్చ చెప్పి వచ్చాను. మీ ఇంటికి పెద్దదిక్కుగానే కాదు ఈ ఊరికి పెద్దగా కూడా చెప్తున్నాను. వివేకానందా, నీ పద్దతులు కొన్ని మార్చుకోవాలోయ్’ అని ఆగాడు దశరథ రామయ్య. ‘ఏమిటా పద్దతులు?’ అని వివేకానంద అడుగుతాడేమోనని ఆగాడు.

వివేకానంద ఏకాగ్రతతో ఆయనవైపు చూస్తున్నాడు తప్ప మాట్లాడలేదు. కాస్సేపు ఎదురు చూసి మళ్ళీ దశరథ రామయ్య తనే అన్నాడు. “నలుగురితో పాటు నారాయణ అనాలి కాని ఊరి దారొకటి, నాదారి నాది అన్నట్టు ఉండకూడదు. ఏదో చిన్నవాడివి నీకేం తెలీదు, అనుభవం వస్తూంటే అన్నీ తనే తెలుసుకుంటాడని నేను నచ్చ చెప్తాను. ఎంతైనా మనది రక్తసంబంధం’ అని లేచాడు దశరథ రామయ్య.

‘అసలు విషయం ఇప్పుడు చెప్తాడు’ అనుకుంటూ లేచి నిలబడ్డాడు వివేకానంద.

‘మరి నేను వస్తాను. ఇవాళ వాళ్ళను గేటు దగ్గిరే ఆపాను. కానీ ఆకాశంగారు వచ్చిన తరువాత ఏమౌతుందో నేను చెప్పలేను. మన ఊరిలో గొడవలు మనలో మనం తేల్చుకుంటేనే మంచిది. ఆలోచించుకో’ అంటూ తలుపు దగ్గర వరకూ వెళ్ళి ఏదో గుర్తుకు వచ్చినట్టు ఆగి వెనక్కు తిరిగాడు. వివేకానంద చిరునవ్వు నవ్వాడు.

‘ఆ మరచిపోయాను. నువ్వు తెలుగు, సంస్కృతం చెప్పగలిగే వ్యక్తి కావాలని ప్రకటన ఇచ్చావట, నిజమేనా?’

‘నిజమే’ అన్నాడు వివేకానంద.

‘ముత్యాలు రాలాయి’ అని పెద్దగా నవ్వి పేపరులో ప్రకటన ఇచ్చే ముందు నాకో మాట చెప్పవచ్చు కదా! అయినా ఇప్పుడూ మించిపోయిందేమీలేదు, నాకు తెలిసిన అబ్బాయి ఉన్నాడు. రంగనాధం అని, మన వాడే మనకు బాగా కావలసినవాడు. ఇంటర్య్వూలు ఆరంభమయ్యే సమయానికి వస్తాడు. కాస్త చూడు. రంగనాథం ఈ అభ్యుదయ సంఘం వాడే. దాంతో మనకు గొడవలు కూడా తగ్గుతాయి. వివేకానంద ముఖంలోకి పరీక్షగా చూస్తూ అన్నాడు దశరథ రామయ్య.

కానీ వివేకానంద ముఖంలో ఎటువంటి భావాలు ఆయనకు కనిపించలేదు. ‘పంపించండి చూద్దాం’ అన్నాడు మెల్లగా వివేకానంద.

‘చూద్దాం కాదు చేద్దాం అనాలి’ అంటూ బయటికి వెళ్ళిపోయాడు దశరథ రామయ్య.

ఆయన వెళ్ళిన తరువాత కాస్సేపటికి బయట అరుపులు కేకలు తగ్గిపోయాయి. వివేకానంద అలాగే మౌనంగా ఆలోచిస్తూ కూచుండి పోయాడు.

తనీ గురుతర బాధ్యతను నిర్వర్తించగలడా.

ఒక వ్యక్తి తాను నమ్మిన సత్యాన్ని ఆచరణలో పెట్టటం ఇంత కష్టమా? సత్యాన్ని గ్రహించేందుకు వ్యక్తులు ఇంతగా ప్రతిఘటిస్తారా? ఇది ఇంకా ఆరంభమే, రానురాను తానింకా ఎంత ప్రతిఘటనను ఎదుర్కోవాల్సి ఉంటుందో? అప్పుడు తెలుస్తుంది తనవారెవరో, తానెవరో!

‘నాన్నగారూ సరైన బాటలో ప్రయాణించగలిగిన శక్తిని నాకు ఇవ్వండి. అమ్మా నువ్వే నా శక్తివి’

ఆలోచిస్తూ కళ్ళు మూసుకున్నాడు వివేకానంద.

‘ఇదొక యుద్ధం. ఇది ప్రత్యక్షయుద్ధం కాదు. ఈ యుద్ధంలో రక్తపాతాలుండవు. వ్యక్తుల ప్రాణాలు కోల్పోవటం ఉండదు. ఇది ఒక సంస్కృతికి మరో సంస్కృతికి మధ్య జరిగే యుద్ధం. ప్రతి దేశానికీ ఓ ప్రత్యేకమైన శక్తి ఉంటుంది. ఆ దేశ సంస్కృతి ఆదేశ శక్తి. మరో దేశం తన సంస్కృతిని ఆ దేశంలో ప్రవేశపెట్టాలని ప్రయత్నిస్తుంది. అప్పుడా రెండు దేశాల శక్తుల మధ్య జరిగే యుద్ధం రక్తపాత రహిత సాంస్కృతిక సమరం.

మనది భారత శక్తి. అద్భుతమైన ఆలోచనలకు ప్రతి రూపం. మన సంస్కృతి పాలన మన ధర్మం. స్వధర్మ పాలనను మించిన కర్తవ్యం మరొకటి లేదు. మన దేశ శక్తిని పరాయి పాలన బలహీనం చేసింది. మనం మన సంస్కృతిని మరిచిపోతున్నాం. మనకు తెలియకుండానే మనం మనకు దూరమౌతున్నాం. ఇది ఒక సంవత్సరంలో, ఒక రోజులో జరిగిన పనికాదు. కొన్ని తరాలుగా ఒక్కో అడుగు మన సంస్కృతికి మనం దూరం అవుతున్నాం. మన ధర్మాన్ని మనం త్యజిస్తున్నాం. అది మరణం కన్నా ఘోరం. జీవచ్ఛవాల వంటి స్థితికి చేరుకుంటున్నాం.

ఈ దేశంపై గౌరవమున్న ప్రతి వ్యక్తి. ఈ ధర్మాన్ని అభిమానించే ప్రతి పౌరుడూ ఈ సంస్కృతిని సజీవం చేసేందుకు తన శాయశక్తులా కృషిచేయాలి. అంతకు మించి వ్యక్తి జీవితానికి మరో పరమార్థం లేదు. ప్రస్తుత సమయంలో భౌతిక పోరాటాలలో సాధించే విజయం కన్నా ఈ మానసిక పోరాటంలో విజయం సాధించటం ముఖ్యం. ఈ ధర్మమే మన దేశానికి ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం. ‘ఈ దేశ ప్రజల ఆత్మవిశ్వాసాన్ని పెంచి, ప్రజల ఆత్మగౌరవాన్ని నిలపటం కన్నా పవిత్రమైన పని మరొకటి లేదు.’ విశ్వనాథ శర్మ గారి మాటలు వివేకానంద చెవుల్లో ప్రతి ధ్వనిస్తున్నాయి.

‘నేను పని సమర్థవంతంగా నిర్వహించగలనా గురువుగారూ’ అనుకున్నాడు వివేకానంద మనసులో.

‘ఏమండీ, ఇంటర్వ్యూకి అందరూ వచ్చారు’ పూర్ణయ్య అనటంతో ఉలిక్కి పడ్డాడు వివేకానంద.

‘ఆ ఉన్న పేర్లతో పాటు రంగనాథం అన్న పేరును కూడా చేర్చి వరుసగా ఒకరొకరిని పంపించండి’ అన్నాడు వివేకానంద.

కుర్చీలో వెనక్కి వాలి మొదటి అభ్యర్థి కోసం ఎదురు చూడసాగాడు వివేకానంద. ఇంటర్వ్యూలంటేనే వివేకానందకు నచ్చవు. ఒక పది నిముషాలు మనిషితో మాట్లాడి, అతని ఆలోచనలను, తెలివిని, జీవితం పట్ల దృక్పథాన్ని సరిగ్గా అంచనా వేయటం, ఏవో కొన్ని సందర్భాల్లో తప్ప సాధ్య కాదు. ఒక జీవిత కాలం కలిసి బ్రతికినా ఓ వ్యక్తి గురించి సంపూర్ణంగా తెలుసని చెప్పటం కష్టం. అటువంటిది పది నిముషాల్లో, అయిదు ప్రశ్నలతో వ్యక్తి వ్యక్తిత్వాన్ని నిర్ణయించటం ఎలా? బయట కనిపించే వ్యక్తికి, లోపల నివశించే వ్యక్తికి మధ్య ఉన్న తేడాను గ్రహించటం ఎలా?

‘మే ఐ కమిన్ సర్’ అంటూ ఓ యువకుడు లోపలికి ప్రవేశించాడు. వివేకానంద దీర్ఘంగా నిట్టూర్చి ఆ వ్యక్తిని పరిశీలనగా చూస్తూ ‘కూచోండి’ అన్నాడు, ఇంటర్వ్యూని ఆరంభించేందుకు సిద్దమౌతూ.

***

‘ఏమండీ, రంగనాథం గారిని పంపించమంటారా? ఆయనకు ముఖ్యమైన పనులు ఇంకా ఏవో ఉన్నాయట’ చెప్పాడు పూర్ణయ్య లోపలకు వచ్చి.

‘పంపించండి’ అని తన ఎదురుగా కూర్చున్న శాస్త్రిగారివైపు చూశాడు వివేకానంద. ఆయనకు అరవై వరకూ ఉంటుంది వయస్సు.

వివేకానంద దృష్టి తనపై పడగానే ఆయన నవ్వి చెప్పారు. ‘బాబూ నాకు డిగ్రీలు లేవు. కానీ పాండిత్యం ఉంది. డిగ్రీలు లేని పాండిత్యానికి విలువలేని రోజులివి. నాకు రికమండేషన్లు లేవు. రికమండేషన్ లేందే వ్యక్తి నైపుణ్యం పనికిరాకుండా పోయే రోజులివి. కానీ మీరు పాండిత్యానికి, నైపుణ్యానికి మాత్రమే విలువనిస్తారని తెలిసి ఏ అర్హతలు లేకున్నా వచ్చాను.

నాకు వేదం తెలుసు. ఉపనిషత్తులు తెలుసు. బ్రాహ్మణాలు తెలుసు. చక్కటి వ్యాఖ్యానాలతో పసి పిల్లలకు సైతం అర్థమయ్యే రీతిలో వివరించగలను. నా వయస్సే నా అనుభవం. అదే నా డిగ్రీ. ఇంతకన్నా నా గురించి చెప్పుకోదగింది ఏమీ లేదు.’

వివేకానంద ఆయనవైపు నిశితంగా చూశాడు. ‘అందరూ విశ్రాంతి తీసుకోవాలనుకునే వయసులో మీరు ఈ ఉద్యోగమే ఎందుకు చేయాలనుకుంటున్నారు?’ అడిగాడు.

‘వేరే ఏమీ చేయలేక’ ఠ క్కున వచ్చింది సమాధానం. ‘నా నరనరాన విద్యాబోధన జీర్ణించుపోయింది. గతంలో కృష్ణాపురంలో ఉండేవాళ్ళం. కృష్ణానదిపై ఆనకట్ట కట్టేటప్పుడు మళ్ళించిన నీళ్ళతో మాగ్రామం మునిగిపోయింది. నా అదృష్టమూ మునిగిపోయింది. ప్రభుత్వం ఇచ్చిన నష్టపరిహారం మరో ఊళ్ళో స్థిరపడేందుకే సరిపోయింది. పిల్లలను చదివించటం, సంసారాన్ని నెట్టుకురావటంతో జీవితం గడిచిపోయింది. ఊహా తెలిసినప్పటినుంచి శాస్త్రాలు చదవటం, ఎదిగినప్పటినుండీ బోధించటం తప్ప నాకు మరో విషయం తెలియదు. ఎలాగోలా జీవితాన్ని ఈడ్చుకుంటూ వస్తున్నాను. రెక్కలొచ్చి కొడుకులు ఎగిరిపోయారు. వాళ్ళు చేసే ఉద్యోగాలకు వచ్చే డబ్బులతో వాళ్ళ సంసారాలు గడవటమే కష్టంగా వుంది. పుట్టినప్పటి నుంచీ ఇవ్వటమే కానీ పుచ్చుకోవటం తెలియని వాడిని. మాట పడటం అలవాటు లేదు. పొట్ట చేత పట్టుకుని గంపెడంత ఆశతో మీ దగ్గరకు వచ్చాను.’

వివేకానంద తలవంచుకుని వింటున్నాడు.

తన మదిలో కలిగే భావ సంచలనాన్ని తల ఎత్తితే ఆయన పసిగట్టేస్తారేమోనని తల ఎత్తటం లేదు.

‘ఇది సంధి దశలో తప్పనిసరిగా జరిగే పరిణామం’ అనుకున్నాడు వివేకానంద. ఒక పద్దతి కొంతకాలం నుంచీ వస్తూంటుంది. ఆ పద్దతికి జనులు అలవాటు పడిపోతారు. కాలం మారుతుంది. అనుగుణంగా కొత్త పద్దతిని ఆకళింపు చేసుకున్నవారు నిలబడగలరు. అలా కాని వారి బ్రతుకు దుర్భరం. వాళ్ళు వ్రేళ్ళు పాత పద్దతిలో నాటుకుని ఉంటాయి. శాఖలు కొత్త పద్దతికి అలవాటు పడాలి. అలా కానప్పుడు నెమ్మదిగా ఒక్కో ఆకు, ఒక్కో శాఖ, ఒక్కో కొమ్మ వాడి, చెట్టు మోడై కూలిపోతుంది. ఈ సమయం మరీ భయంకరం!

శాస్త్రిగారు తాను చెప్పవలసిందంతా అయిపోయినట్టు మౌనంగా ఉండిపోయారు. వివేకానంద తల ఎత్తాడు. సూటిగా శాస్త్రిగారి కళ్ళలోకి చూస్తూ అడిగాడు.

‘శాస్త్రిగారు, నేను వెతికేది డిగ్రీలకోసం కాదు. తాను చేసే పని పట్ల శ్రద్ధ, ఉత్సాహం ఉంటే కలిగే ఫలితం, ఎన్ని డిగ్రీలున్నా యాంత్రికంగా డబ్బుకోసం మొక్కుబడిగా చేస్తూంటే కలగదు. అయితే ఓ ప్రశ్న, మీరున్న గ్రామం నీటి పాలయి ఎన్నో ఏళ్ళయింది. ఆ సమయంలో మీరేం చేశారు?’

‘అనేక పాఠశాలల్లో తెలుగు, సంస్కృతాలు బోధించాను.’

‘మరి ఎందుకు మానేశారు’?

నవ్వారు శాస్త్రిగారు ‘నాకు తెలుగు రాదని అనేక పాఠశాలాధ్యక్షులు అభిప్రాయపడ్డారు. పద్యాలు రాగయుక్తంగా చదివితే పక్క తరగతుల వారికి ఇబ్బంది. అన్నీ అగ్గిపెట్టె పాఠశాలలు ప్రౌఢ ప్రయోగాలు అవన్నీ నేర్పటం అక్కడ అనవసరం. మరి అవి లేకపోతే భాషనెలా నేర్పాలో నాకు చేతకాలేదు. ఏవి పరీక్షల్లో వచ్చే అవకాశం ఉందో అవి బట్టీ పట్టిస్తే చాలని ఒకరిద్దరు కాదు నేను పనిచేసిన ప్రతి పాఠశాలాధ్యక్షులు, విద్యార్థులు, తల్లిదండ్రులు అభిప్రాయపడ్డారు. ఇది ప్రజాస్వామ్యం కదా, అధిక సంఖ్యాకుల అభిప్రాయమే సరైనది. కాబట్టి నా పద్దతి తప్పు. నాకు తెలుగు రాదు పొమ్మన్నారు.

కాదనలేదు. మెజారిటీ వాళ్ళది. అదీగాక వాళ్ళు నిజమే చెప్పారు. వాళ్ళ తెలుగు నాకు రాదు. నాకు వచ్చిన తెలుగు, తెలుగు కాదు’ అంటూ నవ్వారాయన. ఆయన నవ్వుల్లో విరక్తి, వేదన స్పష్టంగా కనబడ్డాయి.

ఇంతలో తలుపు తోసుకుని రంగనాథం లోపలికి వచ్చాడు.

అతనితో పాటే సిగరెట్ వాసనతో మిళితమై ఆయన నములుతున్న వక్క పొడి వాసన కూడా గదిలో ప్రవేశించింది.

‘కూర్చోండి’ అన్నాడు వివేకానంద, శాస్త్రిగారి పక్కన ఖాళీగా ఉన్న కుర్చీ చూపిస్తూ, రంగనాథం శాస్త్రిగారివైపోసారి చూసి ఠీవిగా కాలుమీద కాలు వేసుకుని కూర్చున్నాడు. ‘మీ విద్యార్హతలు?’ అడిగాడు వివేకానంద.

‘డబుల్ ఎమ్మె. ఎమ్మె తెలుగు, ఎమ్మె శాంస్క్రీట్, పిహెచ్‌డి ప్రయత్నాల్లో ఉన్నాను’ గర్వంగా అన్నాడు రంగనాథం.

‘నన్ను మించిన అభ్యర్థి మీకు దొరకడు’ అన్న ధీమా అతనిలో కనబడుతోంది.

‘నేను తెలుగు, సంస్కృతం చెప్పగలిగేవారికోసం చూస్తున్నాను. మీరు ఏ అంశం చెప్పేందుకు ఎక్కువగా ఇష్టపడతారు?’ సంస్కృతాన్ని స్పష్టంగా వొత్తిపలుకుతూ అడిగాడు వివేకానంద.

‘ఏదైనా ఓకే. అయామ్ ఈక్వల్లీ అడెప్ట్ ఇన్ బోత్‌ ద లాంగ్వేజెస్’ అన్నాడు రంగనాథం. అతని చేతి వేళ్ళు అప్రయత్నంగా నోటి దాకా వెళ్ళి, అక్కడ సిగరెట్ లేదని గ్రహించి క్రిందకు వెళ్ళిపోవటం గమనించాడు వివేకానంద.

‘మీరేమనుకోకపోతే ‘పురుష’ అన్న సంస్కృత పదానికి ఉన్న అర్థాలు విడమరచి చెప్తారా?’ అడిగాడు వివేకానంద.

రంగనాథం నవ్వాడు. ‘పురుష ఈజ్ పురుష. దానికెన్ని అర్థాలుంటాయి? పురుషుడు మేల్’ అన్నాడు తేలికగా, వివేకానందవైపు విచిత్రంగా చూస్తూ. దశరథ రామయ్య ముందే చెప్పాడతనికి, వివేకానంద ఇటువంటి పిచ్చి ప్రశ్నలు అడుగుతాడని.

వివేకానంద నవ్వాడు. ‘శుక్లాం బరదరం విష్ణుం’ శ్లోకంలో ఇమిడివున్న వేదాంతార్థాన్ని వివరించగలరా?’ అని అడిగాడు.

రంగనాథం చిరాగ్గా చూశాడు.

‘చూడండి నేను డబుల్ ఎమ్మె. ఇటువంటి సిల్లీ ప్రశ్నలడిగి మీరు నన్ను కాదు నా చదువుని అవమానిస్తున్నారు. నేనెక్కడా ఉద్యోగం దొరక్క పొట్టచేత పట్టుకుని మీ దగ్గరకు రాలేదు. దశరథ రామయ్య గారు ‘మా స్కూలుని నువ్వు బాగుపరచాలి’ అని బ్రతిమిలాడితే వచ్చాను.

అయినా నన్నిలా ప్రశ్నించేందుకు మీకేం అర్హతలున్నాయి? ఆర్ యు డబుల్ ఎమ్మె? నేనిలా ప్రశ్నించటం అహంకారంలా అనిపించవచ్చు, కానీ కేవలం యజమాని అయినంత మాత్రాన ఎదుటి వ్యక్తిని అవమానించే హక్కు మీకు లేదు. ఇంతకీ వాట్ ఆర్ యువర్ క్వాలిఫికేషన్స్?’ కోపంగా అడిగాడు రంగనాథం. అతని ముఖం ఎర్రబడింది. అతనికి అర్జంటుగా సిగరెట్ కాల్చాలని ఉంది. రంగనాథానికి ఇంత కోపం వచ్చేందుకు కారణం ఉంది. తనకు ఎర్ర తివాచీ పరిచి ఉద్యోగం ఇప్పిస్తానని పిలిచాడు, దశరథ రామయ్య. తీరా ఇక్కడ చూస్తే పురుష అంటే అర్థం ఏమిటి? శుక్లాంబరధరం అర్థం ఏమిటి? అని అడుగుతూంటే అతని ఒళ్ళు మండిపోయింది. పైగా పక్కనే ఇంకెవరో గోచీ గాడు కూర్చుని ఉండటం అతని కోపాన్ని రెట్టింపు చేసింది. అదీగాక దశరథ రామయ్య ఈ స్కూలు తనదేనని, ఎలాగైనా ఉద్యోగం ఇప్పిస్తానని రంగనాథానికి అంత ధైర్యాన్నిచ్చింది.

రంగనాథం కోపం ప్రదర్శిస్తూంటే వివేకానందలో ఇసుమంతయినా మార్పు రాలేదు. అతని వదనంపై చిరునవ్వు చెదరలేదు.

చిరునవ్వు పెదవులపై కదలాడుతూంటే చెప్పాడు వివేకానంద, ‘రంగనాథంగారూ, మీరు ఉద్యోగానికి అభ్యర్థిగా నా దగ్గరకు వచ్చారు. అదీ అధ్యాపకుని ఉద్యోగం. సమాజానికి యువత వెన్నుముక అయితే ఆ యువతను తీర్చిదిద్దేది అధ్యాపకులే. మీలో ఒక అభ్యర్థిలో ఉండవలసిన వినయం లేదు. ఒక అధ్యాపకునిలో ఉండవలసిన విజ్ఞానం లేదు.’

వెంటనే కోపంగా లేచి నిలబడ్డాడు రంగనాథం.

‘నాకు విజ్ఞానం లేదని మీరెలా చెప్పగలరు? నా విజ్ఞానం మీరేం చూశారు?’ కోపంగా అడిగాడు రంగనాథం.

‘నేను తెలుగు, శాంస్క్రీట్‌లలో ఎమ్మేని కాను. నాకు ఆయా భాషలపై వున్న ఇష్టం వల్ల వాటిని ప్రత్యేక శ్రద్దతో చదివాను. మన భాష సంస్కృతం. శాంస్క్రీట్ కాదు. ఇంగ్లీషు వాళ్ళకి నోరు తిరగక, సరిగా పలకరాక, వాళ్ళ స్పెల్లింగ్ అలా ఉండటంవల్ల శాంస్క్రీట్ అంటారు. మనమూ అలా అనటం భావ్యమా?

మన భాషలు పరిష్కృతమైన పవిత్ర భాషలు. వాటికి నిర్ధిష్టమైన వ్యాకరణం ఉంది. స్పష్టమైన ఉచ్ఛారణ ఉంది. అలాగే అధ్యాపక వృత్తి అతి పవిత్రమైనది. అధ్యాపకుని ప్రతి కదలిక పసిపిల్లల మనసులపై చెరగని ముద్ర వేస్తుంది. వారి భావి జీవితాలపై ప్రభావం చూపిస్తుంది. అధ్యాపకులే సిగరెట్లు తాగుతూ, వక్కపొడులు, పాన్ పరాగ్‌లు నముల్తూ ఉంటే భాషలో స్వచ్ఛత ఉండదు. ఆ ప్రవర్తన విద్యార్థులకు ఆదర్శనీయం కాదు. అనుసరణీయం కాదు.

ఇక మిమ్మల్ని పరీక్షించటంలో నా అర్హత, మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, మీకీ ఉద్యోగం ఇవ్వాలో, వొద్దో నిర్ణయించే అధికారం నా వద్ద ఉంది. కేవలం రెండు ప్రశ్నలకు సమాధానం చెప్పే సహనం లేని మీరు, విద్యార్థుల అనేక అర్థం లేనివిగా అనిపించే ప్రశ్నలకు నేర్పుగా, ఓర్పుగా సమాధానాలెలా ఇవ్వగలరు?’

రంగనాథం ముఖం కందగడ్డలా తయారయింది. అతని ఉచ్ఛ్వాస నిశ్వాసలు బుసలాగా వినిపించసాగాయి.

‘నేను సిగరెట్టు తాగటం, వక్క పొడి తినటం, శాంస్క్రీట్ అనటమే నాకు ఉద్యోగాన్నివ్వటంలో మీకు అభ్యంతరాలా?’ కోపంగా అడిగాడు.

‘మీకలా అర్థమైతే అలాగే అనుకోండి’ అని శాస్త్రిగారు వైపు తిరిగాడు. వివేకానంద.

ఆయన లేచి నిలబడి పురుష అంటే పురుషుడు. అదే పురు, ఉపగా విడదీస్తే, పురం అంటే నగరం, ఉష అంటే ప్రభాత సంధ్య అన్న అర్ధం వస్తుంది. నగరాన్ని మనిషి శరీరానికి, ఉషోదయాన్ని, విజ్ఞానోదయానికి ప్రతీకలుగా తీసుకుంటే విజ్ఞావంతుడైన శరీరం కలవాడు పురుషుడు అన్న అర్థం అంటే విజ్ఞానవంతుడు అన్న అర్థం వస్తుంది.

అలాగే పురు,షగా విడదీస్తే శుద్ధ చైతన్యం కలవాడు అన్న అర్థం వస్తుంది. అంటే ఏరకంగా చూసిన ‘పురుష’ అనే పదం ఉత్తమ వ్యక్తి అన్న అర్థాన్నిస్తుంది. ప్రతి మగవాడినీ పురుషుడు అనేందుకు వీలు లేదు’ అన్నారు.

End of Preview.

Rest of the book can be read @ http://kinige.com/kbook.php?id=193

 


[1] విష ముష్టి (Nux Vomica)

Related Posts: