మారుతున్న విలువల్ని తెలుగు కథ ప్రతిబింబిస్తోందా ? (వాసిరెడ్డి నవీన్)

కథ 2006 నుండి:

కథ 2006 On Kinige

సామాజిక అంశాలను అర్థం చేసుకోవడానికి సామాజిక, ఆర్థిక విషయాలపై చర్చ ఎంత అవసరమో, సాహిత్యాన్ని సరైనదారిలో నడపడానికి, దిశానిర్దేశానికి అర్థవంతమైన సాహితీ విమర్శ అంతే అవసరం. గత నాలుగైదు సంవత్సరాలుగా తెలుగులో వెలువడుతున్న కథాసాహిత్యాన్ని పరిశీలిస్తే సరైన విమర్శలేని లోపం కొట్టొచ్చినట్లు కనబడుతుంది. కథా రచనలో, నిర్మాణంలో అలసత్వం కనబడుతోంది. ఓ విమర్శకుడన్నట్లు చాలా కథలు సగం చెక్కిన శిల్పాలుగా, గొప్ప కథలు కావాల్సిన ఎన్నో కథలు కేవలం మంచి కథలుగా మాత్రమే మిగిలిపోతున్నాయి. ఈ విషయంపై సరైన చర్చ లేకపోవటం, ఒకవేళ అలాంటి చర్చ ఏదో ఒక రూపంలో మొదలైనా అది ప్రక్కదారి పట్టడం కథా సాహిత్యానికి, దాని ఎదుగుదలకూ ఆటంకంగా తయారైంది.

మన సమాజంలో ఇవాళ ఎన్నో విషయాలు చర్చకు వస్తున్నాయి. సామాజిక చిత్రం మారిపోతుంది. ప్రతి అంశాన్నీ ఆర్థిక విషయాలు శాసిస్తున్నాయి నూతన ఆర్థిక విధానాలు ప్రారంభమై గ్లొబలైజేషన్ దిశగా సమాజం పరుగులు పెట్టడంతో వస్తున్న విపరీత పరిణామాలను మనం ప్రత్యక్ష్యంగా చూస్తూనే ఉన్నాం. గత పదేళ్ళ క్రితం ఉన్న అస్పష్టత, అయోమయం, అర్థంగానితనం ఇప్పుడేమీ లేదు. ఇప్పుడంతా నలుపు తెలుపుల్లో స్పష్టంగా ఒక వికృత సమాజం మన కళ్ళ ముందు నిలబడి ఉంది.

ఈ పెను మార్పులన్నీ మానవ జీవితాల్లోకి ఇంకిపోయి – మానవ విలువల స్వరూప స్వభావాలను సమూలంగా మార్చివేస్తున్నాయి. వ్యవస్థీకృత విలువల పునాదులు కదిలి పోతున్నాయి. ఈ మార్పులు మనల్ని ఎటువైపు నడిపిస్తాయో అర్థం కాకుండా ఉంది. ఈ దశలో అనేక కొత్త అంశాలు, కొత్త విషయాలు, సంబంధాలు కథా వస్తువులుగా తెరమీద కొచ్చాయి. వాటిని అందిపుచ్చుకోవడంలో, వాటిని కథలుగా మలచటంలో మన కథా రచయితలు నైపుణ్యాన్ని, పరిణితిని చూపలేకపోతున్నారు.

గ్లోబలైజేషన్‌కి వ్యతిరేకంగా భారతదేశంలోని ఏ రాష్ట్రంలోనూ జరగనంత చర్చ, ఉద్యమాలు మన రాష్ట్రంలో జరిగాయి. గ్లోబలైజేషన్ ప్రక్రియ ఆగలేదు గాని దాని ఫలితాల పట్ల ఒక అవగాహనని ఈ ఉద్యమాలు ఇవ్వగలిగాయనే అనుకొంటున్నాను. తీరా దాని పరిణామాలు తీవ్రరూపం దాల్చాక, అవి మానవ సంబంధాలను, విలువలను తీవ్రంగా ప్రభావితం చేసే స్థాయికి వెళ్ళాక ఈ విషయంపై మన కథకులెందుకో లోతుల్లోకి వెళ్ళలేకపోతున్నారు.

ఉదాహరణకి భూమినే తీసుకొందాం. దానికి రెక్కలొచ్చాయి. ఎక్కడెక్కడికో ఎగిరి పోతోంది. త్వరితగతిన అనేక చేతులు మారి చివరికి మల్టీనేషనల్ కంపెనీలు, కార్పొరేట్ సంస్థల చేతుల్లోకి వెళ్ళిపోతోంది. ఈ ప్రక్రియ రాజధాని హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే కాదు, చిన్నపాటి పట్టణ ప్రాంతాల్లోనూ వేగవంతం అయింది. ఈ క్రమంలో భూమి విలువలలో వచ్చిన అనూహ్యమైన పెరుగుదలను మన సమాజపు మానవ సంబంధాలు తట్టుకోగలవా? భూమి ఇంక ఎంతమాత్రమూ పంటలు పండించే క్షేత్రం కాదు. కోట్లు కుమ్మరించగలిగే సాధనం కూడా. పోనీ ఈ ఫలితాలు అందరికీ అందుతున్నాయా అంటే అదీ లేదు. అతి తక్కువ ధరకు చేతులు మారిపోయి కోట్ల విలువను సంతరించుకొనే ఈ మాయ అంత తేలిగ్గా అర్థం కాదు. ఒకవేళ ఈ అనూహ్య సంపద సామాన్యుల చేతి కొచ్చినా దాని వెన్నంటి వచ్చే కృతకమైన విలువలు, విశృంఖల భావనలు, అనుమానాలు, ఆరాటాలు, హత్యలు, ఆత్మహత్యలు… ఇలా బహు ముఖాలుగా విస్తరించిన సమాజపు వికృత స్వరూపం ఇంకా మన కథల్లోకి రావటమే లేదు.

గతంలో ఉన్న అస్పస్టత ఇప్పుడు లేదు. మారుతున్న కాలానికి అనుగుణంగా కథా వస్తువుని ఎంచుకొని తదనుగుణమైన శైలిలో కథారచన కొనసాగాలి. కథారచన, ఆ మాట కొస్తే సాహితీసృజన ఎప్పుడూ ఆషామాషీ వ్యవహారం కాదు. మనల్ని శోధించుకొని అంతరంగం నండి తన్నుకు రావాలి.

***

ఈ సంకలనంలోని 13 కథలను ఈ నేపథ్యంలో పరిశీలించినప్పుడు అనేక విషయాలు ఇంకా స్పష్టంగా అర్థమవుతాయి.

మారుతున్న విలువల్ని సందర్భాలను కొత్తకోణం నుంచి పరిశీలించిన గేటెడ్ కమ్యూనిటీ, మా నాన్న నేను మా అబ్బాయి, యూ… టర్న్ కథల వంటివి ఇంకా విస్తృతస్థాయిలో రావలిసిన అవసరం ఉంది. అత్యంత సున్నితమైన విషయాలను నేర్పుగా చెప్పిన కథలివి. విలువల మధ్య అంతరాలు, తరాల మధ్య అంతరాలుగా పైకి కనబడినా వాటి నేపథ్యం మాత్రం మారిన సామాజిక స్థితిగతులే. పోగుపడుతున్న సంపద తెచ్చే అశాంతికి, వితరణశీలతకి ఉన్న సంబంధం కొంచెం ఆశ్చర్యం అనిపించవచ్చు… కానీ వాస్తవం కదా!

మారిన సమీకరణాలు, పల్లెల్ని సైతం విడవకుండా ఆవరించినా ఇంకా సజీవ సంబంధాలు కొనసాగడానికి కారణం. ఈ దేశ సంస్కృతి, ఇక్కడ పోరాట సంప్రదాయం కారణం. అందుకే ఊడల్లేన్ని మర్రి కథలో చెల్లవ్వకు ఓ ఆసరా దొరికింది. కుటుంబాల పట్ల ఎంత శతృత్వమున్నా మూగజీవాలను సైతం ఆప్యాయంగానే చూడగలిగారు (మాయిముంత). యవనిక కథలో నేపథ్యం మారిందే తప్ప విషయం అదే. మారిన విలువలు మనుషులను దూరంగా ఉంచినా ఇంకా తడి ఇంకిపోని మానవ హృదయం ఒకటి ఆవిష్కృతమయిందీ కథలో.

అయితే ఈ సంప్రదాయాన్ని ఇలా నిలుపుకోవడానికి ఎన్ని పోరాటాలు చేయాలో మరెంత వేదనను భరించాలో? ఇది భవిష్యత్తు తేల్చాల్సిన సమస్య.

గ్లోబలైజేషన్ దేశానికి, రాష్ట్రానికి ఎన్ని పెట్టుబడులను, ఎన్ని మల్టీనేషనల్ కంపెనీలను తెచ్చింది, ఎంత వ్యాపారాభివృద్ధి జరిగిందీ గణాంకాలతో సహా లెక్కలు వేసి చెప్పగలం కానీ అత్మహత్యల సంస్కృతిని ఈ స్థాయిలో తెచ్చింది అన్న విషయం మాత్రం అలవోకగా మర్చిపోతాం. వందలాది అత్మహత్యలు మన కంటికి సామాన్యంగా కనబడతాయి. ఎన్ని కుటుంబాలు రోడ్ల పాలైనాయో. ఎంతమంది ఉసుళ్ళలాగా ఎరవేసి వేటాడబడ్డారో (వేట)! ఎలా ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళంతా ఒకచోటా మాట్లాడుకోగలిగితే (ఆత్మలు వాలిన చెట్టు) ఎన్నెన్ని సామాజిక కోణాలు ఆవిష్కృతమౌతాయో కదా !

ఎన్ని ప్రభుత్వాలు మారినా, గ్లోబల్ పెట్టుబడులు దేశంలోకి వరదగా వచ్చినా కొన్ని ప్రాంతాల్లో తీవ్రంగా ఉన్న ఫ్లొరైడ్ సమస్యను ఎందుకు పరిష్కరించలేకపోయాయి? మరే దేశంలోనయినా ఈ వికృతమైన అశ్రద్ధ సాధ్యమేనా? (జీవచ్ఛవాలు).

ఈ సంకలనంలో వస్తురీత్యా, శిల్పరీత్యా విలక్షణమైన రెండేసి కథలు ఉన్నాయి.

పురాణ చారిత్రిక గాథల్ని కొత్త కోణం నుండి దర్శించడం కథగా మలచటం తెలుగు సాహిత్యానికి కొత్తకాదు కానీ, ఈ సంకలనంలోని మృణ్మయనాదం కథలో సీత,అహల్యల సంభాషణ అనేక కొత్త విషయాలను చర్చకు తెస్తుంది. తెలుగులో బౌద్ద జాతక కథలను తిరిగి చెప్పడం దాదాపుగా లేదనే చెప్పాలి. ఆనాటి వాతావరణాన్ని ఆసరా చేసుకొని నేడు హింస, అహింస గురించి చర్చించడమే ఈ కథ (జాతక కథ) లోని ప్రత్యేకత.

అతడు… నేను.., లోయ చివరి రహస్యం కథ మళ్ళీ త్రిపురను గుర్తు చేస్తుంది. ఈ మధ్య కాలంలో ఇటువంటి అబ్సర్డ్ కథలు ఎవరూ పెద్దగా రాసినట్లు లేదు. రచయిత కొత్తవాడైనా ఒడుపుగా కథ చెప్పటంలో, మానవ మస్తిష్కంలో సుడులు తిరిగే ఆలోచనలను సమన్వయం చేయడంలో విజయం సాధించినట్లే. అతను, అతనిలాంటి మరొకడు కథ 20 ఏళ్ళు మనల్ని వెనక్కి తెసుకెళ్ళి,ఆ రాజకీయ వాతావరణాన్ని కళ్ళముందు నిలబెట్టడంతో పాటు ఇప్పటి అవకాశవాద విద్యార్ధి రాయకీయాలను, వాటిని నడిపే శక్తుల మోసపూరిత తత్వాన్ని విలక్షణశైలిలో చిత్రించింది.

***

చివరిగా ఒక ప్రశ్న,మారిన సామాజిక విలువల్ని , మానవ సంబంధాల్ని సమగ్రంగానూ, కళాత్మకంగానూ తెలుగు కథ చిత్రించగలుగుతోందా?

9 ఏప్రిల్ 2006 ,హైదరాబాద్

Read Complete Katha 2006 eBook on Kinige @ http://kinige.com/kbook.php?id=119

కథ 2006 On Kinige

Related Posts: